Share News

Tariff Impact: టారిఫ్‌ బాధిత పరిశ్రమలకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ

ABN , Publish Date - Sep 06 , 2025 | 05:11 AM

అమెరికా అడ్డగోలు సుంకాలతో ఇబ్బందులు పడుతున్న భారత పరిశ్రమలు, ఎగుమతిదారులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం..

Tariff Impact: టారిఫ్‌ బాధిత పరిశ్రమలకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: అమెరికా అడ్డగోలు సుంకాలతో ఇబ్బందులు పడుతున్న భారత పరిశ్రమలు, ఎగుమతిదారులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. ఎగుమతులపై ఆధారపడిన సంస్థలకు సులువుగా రుణాలు, మూల ధనం అందేలా చూడటం, కొత్త మార్కెట్లను అన్వేషించుకునేందుకు తోడ్పడటం వంటి చర్యలు చేపట్టనున్నట్టు తెలిసింది. కరోనా సమయంలో కుదేలైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.20 లక్షల కోట్లతో ఇచ్చిన రిలీఫ్‌ ప్యాకేజీ తరహాలో ఈ ప్యాకేజీ ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. సుంకాల దెబ్బకు ఎగుమతులు తగ్గిన సంస్థలు మూతపడకూడదని, ఉద్యోగాలేవీ పోకుండా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై 50శాతం సుంకాలు విధించడంతో.. మన దేశం నుంచి అమెరికాకు చేసే ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వస్త్రాలు, పాదరక్షలు, రసాయనాలు, యంత్ర పరికరాలు, రొయ్యలు, రత్నాలు-ఆభరణాల రంగాల పరిశ్రమలకు దెబ్బతగిలింది. కాగా, క్రెమ్లిన్‌కు భారత్‌ శుద్ధి కేంద్రంగా ఉపయోగపడుతోందంటూ ట్రంప్‌ వాణిజ్య సలహాదారు నవారో ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్‌ తోసిపుచ్చింది. నవారో వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జైస్వాల్‌ చెప్పారు. అమెరికాతో సంబంధాలు తమకెంతో ముఖ్యమని, రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయన్నారు.


ఇవి కూడా చదవండి

భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..

భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం

For More National News and Telugu News

Updated Date - Sep 06 , 2025 | 05:11 AM