Boeing 787-8 Dreamliner: డ్రీమ్‌లైనర్.. డిజాస్టర్..!
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:41 AM
బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్.. అత్యాధునికమైన, ఇంధన సామర్థ్యం కలిగిన విమానంగా పేరుపొందింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన ఈ భారీ విమానంలో ఒకేసారి 242-290 మంది వరకు ప్రయాణించవచ్చు.
బోయింగ్ 787 అత్యాధునికం.. సమస్యలూ అత్యధికం
హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు
అత్యవసర ల్యాండింగ్.. తయారీ, భద్రతలో లోపాలు
పలు విమానయాన సంస్థల ఫిర్యాదులు
కుప్పకూలడం మాత్రం ఇదే తొలిసారి!
(సెంట్రల్ డెస్క్): బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్.. అత్యాధునికమైన, ఇంధన సామర్థ్యం కలిగిన విమానంగా పేరుపొందింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన ఈ భారీ విమానంలో ఒకేసారి 242-290 మంది వరకు ప్రయాణించవచ్చు. దీని పొడవు 57 మీటర్లు, రెక్కల పొడవు 60 మీటర్లు, ఎత్తు 17 మీటర్లు. 2011లో బోయింగ్ దీన్ని మార్కెట్‌లోకి తెచ్చింది. పలు విమానయాన సంస్థలు ఖండాంతర ప్రయాణాలకు ఈ డ్రీమ్‌లైనర్లను వినియోగిస్తుంటాయి. విమాన బాడీని 50 శాతం కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మించారు. ఇది ఉక్కు కంటే బలంగా, అల్యూమినియం కంటే తేలికగా ఉంటుంది. ఫలితంగా విమానం బరువు తగ్గి, ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇది పర్యావరణహిత విమానంగా పేరు పొందింది. ఇందులో రెండు హై బైపాస్ టర్బో ఫ్యాన్ ఇంజన్లు ఉంటాయి. జీఈఎన్‌ఎక్స్ లేదా రోల్స్‌రాయిస్ ట్రెంట్ 1000 ఇంజన్లను వినియోగిస్తారు. వీటి వల్ల బోయింగ్ 767తో పోలిస్తే 20 శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యం ఉంటుంది. ఈ విమానం ఏకధాటిగా 13,530 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
2011లో ఈ విమానం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. బోయింగ్ సంస్థ ఈ డ్రీమ్‌లైనర్ విమానాన్ని 2009లో తయారు చేసింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని పలు విమానయాన సంస్థలకు 1000కి పైగా విమానాలను సరఫరా చేసింది. సాంకేతికతంగా అధునాతన ఫీచర్లు ఉన్నప్పటికీ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ అనేక వివాదాలు కూడా ఎదుర్కొంది. తయారీ నాణ్యత, భద్రతాపరమైన అంశాల్లో బోయింగ్ రాజీ పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. సీట్లు వదులుగా ఉండడం, పిన్స్ సరిగా ఏర్పాటు చేయకపోవడం, నట్లు, బోల్టులు గట్టిగా బిగించకపోవడం, భద్రత లేని ఫ్యూయల్ లైన్ క్లాంపులు వంటి సమస్యలు ఉన్నాయని, తయారీలో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని కేఎల్‌ఎం సహా పలు విమానయాన సంస్థలు ఆరోపించాయి. అంతర్జాతీయంగా ఈ డ్రీమ్‌లైనర్‌లోని సాంకేతిక సమస్యలపై పలు విమానయాన సంస్థలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. బోయింగ్‌కు చెందిన నార్త్ చార్ల్‌టన్ ప్లాంట్‌లో 2019 నుంచి క్వాలిటీ కంట్రోల్ సమస్యలపై డ్రీమ్‌లైనర్‌ను తనిఖీలు చేస్తూనే ఉన్నారు.
అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియాకు చెందిన డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ విమానంలో 242 మంది ఉన్నారు. ప్రమాద ఘటన నేపథ్యంలో బోయింగ్ విమానాల భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. డ్రీమ్‌లైనర్‌లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినా.. విమానం కూలిపోవడం మాత్రం ఇదే తొలిసారి.
సాంకేతిక సమస్యలెన్నో..
బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం హైడ్రాలిక్ లీక్ సమస్యలు, బ్యాటరీ సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సందర్భాలు ఉన్నాయి. బోయింగ్ మాజీ ఇంజనీర్, ప్రజావేగు సామ్ సలేపుర్ న్యూయార్క్ టైమ్స్, సీఎన్‌ఎన్ వంటి మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో గతంలో డ్రీమ్‌లైనర్ విమానంపై ఆరోపణలు చేశారు. బోయింగ్ 777, 787 మోడల్ విమానాల నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ విమానాల తయారీని పూర్తిగా నిలిపేయాలని డిమాండ్ చేశారు.
ఆరు నెలల కిందట కూడా..
అహ్మదాబాద్‌లో కుప్పలికూన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో ఆర్నెల్ల కిందట కూడా తీవ్రమైన సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఎయిరిండియాకు చెందిన ఏఐ-171 విమానం అహ్మదాబాద్- లండన్ గాట్విక్ మార్గంలో తిరుగుతుంది. గత డిసెంబరులో కూడా భారీ సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దాంతో నిర్వహణ లోపాలు, విమాన భద్రతా ప్రక్రియలో లోపాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తనిఖీల అనంతరం మళ్లీ విమానాన్ని నడిపేందుకు అనుమతులు ఇచ్చారు. కాగా, ప్రయాణిలకు అసౌకర్యం, విమాన భద్రత చర్యల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఎయిరిండియాకు డీజీసీఏ పలుమార్లు షోకాజ్ నోటీసులివ్వడంతో పాటు జరిమానాలు కూడా విధించింది.
గతంలో జరిగిన ఘటనలివీ..
ఈ ఏడాది ఆరంభంలో వాషింగ్టన్ నుంచి బయల్దేరిన డ్రీమ్‌లైనర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో లాగోస్‌లో అత్యవసరంగా దించారు. అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానంలో 245 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది, ముగ్గురు పైలట్లు ఉన్నారు. ఐవరీ కోస్ట్ గగనతలంలో ఉండగా విమానం హఠాత్తుగా నియంత్రణ కోల్పోయి వేగంగా కిందకు పడిపోతుండడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
గత ఏడాది సెప్టెంబరులో ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787 విమానం ఢిల్లీ నుంచి బర్మింగ్‌హాం వెళ్తుండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మాస్కోలో దించారు. విమానం సురక్షితంగా దిగడంతో 258 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
గత ఏడాది జూలైలో ఎయిరిండియాకే చెందిన డ్రీమ్‌లైనర్ ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తుండగా కార్గో ఏరియాలో సమస్యను గుర్తించిన పైలట్లు ముందుజాగ్రత్తగా సైబీరియాలో ల్యాండ్ చేశారు.
గత ఏడాది మేలో న్యూజిలాండ్‌కు చెందిన విమానం కాక్‌పిట్‌లో సమస్యలు తలెత్తడంతో హఠాత్తుగా కొన్ని వేల అడుగులు కిందకు పడిపోయింది. ఆ ఘటనలో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో 787 డ్రీమ్‌లైనర్ విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బోయింగ్ సంస్థ విమానయాన సంస్థలకు సూచించింది.
మరింత సమాచారం అందాల్సి ఉంది: బోయింగ్
బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిన ఘటనపై ప్రాథమిక సమాచారం మాత్రమే వచ్చిందని బోయింగ్ సంస్థ తెలిపింది. మరింత సమాచారం అందాల్సి ఉందని పేర్కొంది. ఈ విషయమై ఎయిరిండియాతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే కంపెనీ షేర్లు అమెరికా ప్రి-మార్కెట్‌లో భారీగా పతనమయ్యాయి.
విమానం గాల్లోకి లేచినట్లే.. ప్రణాళికల తాలూకు కలలు, ఊహలు గాల్లోకి లేచి.. ఆ ఫ్లైట్ ముక్కలైనట్లుగానే అర్ధంతరంగా చిద్రమైపోయాయి. ఆప్తుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. పెళ్లయ్యాక భర్త దగ్గరికి వెళుతూ యువతి, మామగారి పెద్దకర్మ కోసం వెళుతూ ఏడాదిన్నర కుమారుడి సహా ఓ మహిళ, భారత పర్యటనలోని తీపిజ్ఞాపకాలను ముటగట్టుకొని స్వదేశానికి బయలుదేరిన యూకే యువకుడు మరలిరాని లోకాలకు శాశ్వతంగా తరలిపోయారు.

పెళ్లయ్యాక తొలిసారి భర్త దగ్గరకు వెళుతూ.. రాజస్థాన్‌కు చెందిన యువతి దుర్మరణం
పెళ్లయ్యాక.. తొలిసారి తన భర్త దగ్గరకు వెళుతూ రాజస్థాన్‌కు చెందిన నవ వధువు తిరిగిరాని లోకాలకు చేరింది. రాజస్థాన్‌కు చెందిన బలోత్రా జిల్లాకు చెందిన మదన్ సింగ్ రాజ్‌పుత్ కుమార్తె ఖుష్బూ వివాహం జనవరి 18న లండన్‌లో ఉంటున్న వైద్యుడు రాజ్‌పురోహిత్‌తో జరిగింది. పెళ్లయినప్పటి నుంచి స్వదేశంలోని అత్తింట్లో ఉంటున్న ఖుష్బూ, తొలిసారి భర్త రాజ్‌పురోహిత్ వద్దకు వెళ్లేందుకు లండన్ బయలుదేరింది. ప్రమాదం గురించి తెలిసి.. కుటుంబసభ్యులు, గ్రామస్థులు దిగ్ర్భాంతికి గురయ్యారు.
నా కూతురు.. మనుమడు ఎక్కడ? పుణెవాసి కన్నీటి పర్యంతం..
ఉదయం తొమ్మిదింటికే కూతురుతో మాట్లాడాను.. ఇప్పుడామె గురించి తెలియడం లేదు అని పుణెకు చెందిన మనీశ్ కన్నీటిపర్యంతమయ్యాడు. అహ్మదాబాద్ విమానంలో మనీశ్ కూతురు యషా, ఆమె ఏడాదిన్నర కుమారుడు రుద్ర, యషా అత్తగారు ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు వీరి ఆచూకీ గురించి ఎవ్వరూ చెప్పడం లేదని, ఇప్పటివరకు అధికారులెవరూ తమను సంప్రదించలేదని మనీశ్ వాపోయాడు. ఆస్పత్రిని ముఖ్యమంత్రి సందర్శించిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని బాధితులకు చెబుతున్నారని చెప్పాడు. యూకేలో ఉంటున్న తన కూతురు మామ గారు నెలక్రితం అహ్మదాబాద్‌లో చనిపోయారని, 22న జరగాల్సిన కర్మక్రియలకు హాజరయ్యేందుకు బయలుదేరారని చెప్పాడు.

భారత్‌లో ఇదే చివరి రాత్రి.. ఇన్‌స్టాలో యూకే యువకుడి పోస్టు
జామీ మీక్! యోగా పట్ల గొప్ప ఆసక్తిగల ఈ బ్రిటన్ యువకుడు.. ‘భారత్‌లో ఇదే చివరి రాత్రి’ అపి పోస్టు పెట్టాడు గానీ.. తన జీవితంలోనే ‘చివరిది’ అని ఊహించలేకపోయాడు. తన భారత పర్యటనను ముగించుకొని జామీ గురువారం లండన్ విమానం ఎక్కాడు. అంతకుముందు భారత్‌లో తాను చవిచూసిన మధురమైన జ్ఞాపకాలను క్రోడీకరిస్తూ ‘గుడ్‌బై ఇండియా’ అని భావోద్వేగపూరితమైన పోస్టు పెట్టాడు. భారత్‌లో తాను ఊహించని గొప్ప అనుభూతిని పొందానని.. మనసు కదిలించే జ్ఞాపకాలతో యూకే వెళుతున్నానంటూ ‘గుడ్‌బై ఇండియా’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. భారత్‌లో చివరిరోజు.. గుజరాతీ థాలీ రుచి చూడటం.. హోటల్‌లో ఓ రాత్రి గడపడం అద్భుతం అని రాసుకొచ్చాడు.
పెళ్లికి హాజరై తిరిగి వెళుతూ.. రెండేళ్లపాప సహా తల్లీకూతుళ్ల దుర్మరణం
జసాధికాబెన్ మహ్మద్, మియాన్ షెత్వాలా తల్లీకూతుళ్లు. షెత్వాలాకు రెండేళ్ల పాప కూడా ఉంది. వీరు లండన్‌లో ఉంటున్నారు. ఈ తల్లీకూతుళ్లు పాపతో కలిసి ఓ పెళ్లికని భారత్‌కొచ్చారు. గురువారం విమానంలో తిరుగుప్రయాణమై ప్రమాదంలో మృతిచెందారు. చోటా ఉదేపూర్‌కు చెందిన 32 ఏళ్ల నాన్సీ చిత్రేశ్ పటేల్‌కు ఇటీవలే పెళ్లయింది. ఒంటరిగా విమానంలో బయటుదేరింది. వడోదరకు చెందిన దంపతులు నీరజ్, అపర్ణ... గాంధీనగర్‌కు చెందిన గౌరవ్ భాయ్, కల్యాణిబెన్ దంపతులు.. సూరత్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు... అఖిల్ అబ్దుల్లా (32), హనా అఖిల్ నానబావా (31), హనా కుమార్తె సారా ఆఖిల్ ప్రాణాలొదిలారు.
ప్రమాద దృశ్యాలు కలచివేస్తున్నాయి: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. భారతీయులతో పాటు అనేక మంది బ్రిటన్ పౌరులు ప్రయాణిస్తున్న విమాన ప్రమాద దృశ్యాలు కలచివేస్తున్నాయని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని, బ్రిటన్‌కు చెందిన ప్రయాణికుల కుటుంబాలకు అండగా ఉంటామని ఒక ప్రకటనలో తెలిపారు. వారికి సహాయ కార్యక్రమాల కోసం ఢిల్లీ, లండన్‌లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ పేర్కొన్నారు. భారత్‌లోని హై కమిషన్ అక్కడి అధికారులతో కలిసి పనిచేస్తోందని సోషల్ మీడియాలో తెలిపారు. 020 7008 5000 నంబరుతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు.
విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు... మాంట్రియల్ ఒప్పందం ప్రకారం బీమా సొమ్ము!
విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు బీమా సొమ్మును మాంట్రియల్ ఒప్పందం ప్రకారం చెల్లిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ ఒప్పందంలో భారత్ కూడా భాగస్వామి. మొదటగా వివిధ దేశాల మధ్య 1999లో ఈ ఒప్పందం కుదిరినా భారత్ 2009లో చేరింది. దీని ప్రకారం విమానయాన సంస్థ ప్రయాణికులకు ఎంత సొమ్ము చెల్లించాలనేది వారు ఏ దేశానికి చెందిన వారనే అంశంపై ఆధారపడి ఉంటుందని ప్రుడెంట్ ఇన్సురెన్స్ బ్రోకర్స్ వైస్ ప్రెసిడెంట్ హితేష్ గిరోత్రా తెలిపారు. వయసు, వృత్తి వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎయిర్‌లైన్స్ సంస్థ అప్పటికప్పడు నష్టపరిహారం ప్రకటించినప్పటికీ మాంట్రియల్ ఒప్పందం ప్రకారం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని హౌడెన్ (ఇండియా) ఎండీ, సీఈవో అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు.