Share News

BJP: అహరహం శ్రమించి.. విజయాన్ని ముద్దాడి!

ABN , Publish Date - Feb 09 , 2025 | 05:33 AM

దేశ రాజధాని ఢిల్లీలో అధికారానికి ఆమడ దూరంలో ఉన్న కమలం ఇప్పుడు వికసించడం వెనక భారీ కసరత్తే జరిగింది..! ఆరెస్సెస్‌ నిశ్శబ్ద ప్రచారం మొదలు.. కార్యకర్తలు..

BJP: అహరహం శ్రమించి.. విజయాన్ని ముద్దాడి!

26 ఏళ్ల తర్వాత..ఢిల్లీలో కమల వికాసం.. ఫలించిన మోదీ, షా వ్యూహాలు

దాదాపు 27 సంవత్సరాల నిరీక్షణ..! కొత్త మిలీనియం వచ్చినా.. కొత్త శతాబ్దిలోకి అడుగు పెట్టినా.. దేశ రాజధాని ఢిల్లీలో అధికారానికి ఆమడ దూరంలో ఉన్న కమలం ఇప్పుడు వికసించడం వెనక భారీ కసరత్తే జరిగింది..! ఆరెస్సెస్‌ నిశ్శబ్ద ప్రచారం మొదలు.. కార్యకర్తలు.. నాయకులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, అగ్రనేతలు, మోదీ-షా వరకు అంతా కలిసి అహరహం శ్రమించడంతో బీజేపీ విజయాన్ని ముద్దాడింది.

ఆప్‌ ప్రజా వ్యతిరేకతను ఒడిసి పట్టుకోవడంలో విజయవంతం

రంగంలోకి 300 మంది ఎంపీలు

బీజేపీ గెలుపులో ‘వికసిత్‌ ఢిల్లీ సంకల్ప్‌ పత్ర’ కీలకం

ఉద్యోగులను ఆకట్టుకున్న.. 8వ పే-కమిషన్‌, ఐటీ మినహాయింపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఇన్నాళ్లూ ప్రతిపక్షానికి పరిమితమైన కమలం ఇప్పుడు అధికారాన్ని ఏర్పాటు చేస్తోంది. కేంద్రంలో వరుస విజయాలను నమోదు చేస్తున్నా.. ఢిల్లీలోని లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్నా.. విధానసభ దక్కకపోవడానికి కారణాలు.. పార్టీకి ఉన్న బలాలు, బలహీనతలు, అవకాశాలు, ప్రమాదాలు.. ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని, పక్కా ప్రణాళికతో ముందుకు సాగడమే ఆ పార్టీ ఘన విజయానికి ప్రధాన కారణం..! ఈ విజయం కోసం బీజేపీ ఏడాదిన్నరగా కసరత్తు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మధ్యతరగతి మందహాసం!

ఢిల్లీ జనాభాలో 90.2% మంది ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత రంగాల్లో ఉపాధి పొందుతున్నట్లు 2018 నాటి ఎన్‌ఎ్‌సఎ్‌సవో గణాంకాలు చెబుతున్నాయి. ఇవే గణాంకాల ప్రకారం 33ు మంది చెప్పుకోదగ్గ స్థాయిలో వేతనాలు పొందుతున్నారు. మొత్తం జనాభాలో 50-60ు మధ్యతరగతి జనాభా ఉంది. కేంద్రం రూ.12.75 లక్షల వార్షికాదాయం వరకు ఉన్నవారిని ఆదాయపన్ను(ఐటీ) నుంచి మినహాయించడం ఈ వర్గాలకు భారీ ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం బీజేపీవైపు వేతన జీవులు, మధ్యతరగతి కుటుంబాలు మొగ్గినట్లు తెలుస్తోంది. ఇక అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, పేదల కోసం బీజేపీ ప్రకటించిన ఉచితాలు కలిసివచ్చినట్లు స్పష్టమవుతోంది. మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, పేదల కుటుంబాలకు రూ.500కే గ్యాస్‌బండ, హోలీ, దీపావళి పండుగలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌, మాతృ సురక్ష వందన కింద గర్భిణులకు రూ.21 వేలతోపాటు.. 6 పోషకాహార కిట్లు అందిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించడం ఈ వర్గాలను ఆకట్టుకుంది. ఆప్‌ అమలు చేసిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా, ఉచిత విద్యుత్తును కొనసాగిస్తామని బీజేపీ భరోసా ఇచ్చింది. వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా, నెలవారీ పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.3,000కు పెంచుతామని ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలందరికీ కేజీ నుంచి పీజీ వరకూ ఉచితంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని వాగ్దానం చేసింది. ఆటోడ్రైవర్లకు రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని పేర్కొంది. ఈ హామీలతో.. సామాన్య ప్రజలు మొదలు.. ఎగువ మధ్య తరగతి ఓటర్ల దాకా బీజేపీ వైపు ఆకర్షితులైనట్లు తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.


సుస్థిర ఓటు బ్యాంకు

ముందు నుంచి బీజేపీకి ఢిల్లీలో సుస్థిర ఓటుబ్యాంకు ఉంది. అధికారంలోకి రాకపోయినా 2008లో బీజేపీ 36.34ు ఓట్లతో రెండోస్థానంలో నిలిచింది. 2013లో 33ు ఓట్లు, 2015లో 3 సీట్లే వచ్చినా.. 32.3ు, 2020లో 8 సీట్లే వచ్చినా.. 38.51ు ఓట్లు బీజేపీకి వచ్చాయి. తాజా ఎన్నికల్లో 45.56ు ఓట్లను సాధించింది. గడిచిన 27 ఏళ్లుగా బీజేపీకి సుస్థిర ఓటుబ్యాంకు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌!

బీజేపీ ‘డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌’ నినాదం కూడా ఈ ఎన్నికల్లో బాగానే పనిచేసింది. ఆప్‌ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మధ్య విభేదాలతో పాలన సజావుగా సాగడం లేదని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో సఖ్యత ఏర్పడి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని ఓటర్లు భావించారు. కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయడం కూడా బీజేపీకి కలిసివచ్చింది. బలహీనవర్గాలు, మైనార్టీలు, దళితులు.. కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలవైపు చీలిపోయారు. కాంగ్రెస్‌ కూడా ‘ఆప్‌’ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించడం బీజేపీకి కలిసివచ్చింది. తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం కమలనాథులకు కలిసివచ్చింది.


మోదీ, షా హవా..!

ఢిల్లీ బీజేపీ విజయంలో ప్రధాని మోదీ గాలి జోరుగా వీచింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించకపోయినా.. మోదీ ప్రజాదరణ ఓట్లు కురిసేలా చేసింది. ఆప్‌ను ఢిల్లీకి ఆప్దా(విపత్తు)గా అభివర్ణించారు. ఎన్నికల ప్రచారం చివరి మూడు రోజులు ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, శివసేన, జనసేనలను రంగంలోకి దించడం మరింత కలిసి వచ్చింది. కేంద్రమంత్రులు, 300 మంది ఎంపీలను బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దింపింది.

హిందూత్వ తోడ్పాటు

ఢిల్లీ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపడానికి ‘హిందూత్వ’ అంశం ప్రధానంగా తోడ్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పౌరసత్వ చట్టంపై షాహిన్‌బాగ్‌లో నిరసనలు, ఢిల్లీలోని పలు ప్రాంతాలలో అల్లర్లు, జామియామిలియా, జేఎన్‌యూలో విద్యార్థుల ఆందోళన, ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ ప్రాబల్యం మొదలైనవన్నీ గత ఎన్నికల్లో కేజ్రీవాల్‌ ధాటిని అడ్డుకోలేకపోయాయి. ఈసారి మాత్రం హిందూత్వ పవనాలు ఢిల్లీలో బలంగా వీచినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 05:33 AM