BJP: తేల్చిచెప్పేశారు.. వారిద్దరిని మళ్లీ పార్టీలోకి తీసుకోం
ABN , Publish Date - Jun 27 , 2025 | 01:30 PM
సస్పెన్షన్ వేటు పడిన ఈశ్వరప్ప, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్‌లను మళ్ళీ బీజేపీలోకి తీసుకునేది లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రాధామోహన్‌దాస్ అగర్వాల్ అన్నారు.
బెంగళూరు: సస్పెన్షన్ వేటు పడిన ఈశ్వరప్ప, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్‌లను మళ్ళీ బీజేపీ(BJP)లోకి తీసుకునేది లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రాధామోహన్‌దాస్ అగర్వాల్ అన్నారు. మంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడిన మేరకు వారిద్దరినీ సస్పెండ్ చేశామన్నారు. ఇద్దరిపైనా ఆరేళ్ళపాటు నిషేధం ఉందన్నారు.
వారిద్దరూ తమ పార్టీలో లేరన్నారు. బీజేపీ సిద్దాంతాలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. క్రమశిక్షణ లేని వారిని, పార్టీ ఉనికికి భంగం కలిగించేలా వ్యవహరించిన వారిని మళ్ళీ పార్టీలోకి తీసుకునేది లేదన్నారు. కాగా ఈశ్వరప్ప ఒకప్పుడు రాష్ట్రంలో తిరుగులేని నేతగా కొనసాగారు. డీసీఎం పదవిలోను ఉన్నారు. కానీ 2024 లోక్‌సభ ఎన్నికల వేళ శివమొగ్గ నుంచి రెబల్‌గా పోటీ చేయడంతో సస్పెన్షన్ వేటు పడింది.
కానీ ఇటీవల యడియూరప్ప మనవడి పెళ్ళివేడుకలలో పాల్గొనడంతో పాటు యడియూరప్ప తనకు పెద్దన్న వంటివారని వ్యాఖ్యానించారు. ఇక ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ పార్టీలో గ్రూపు ఏర్పాటు చేస్తున్నారని, పార్టీ అధ్యక్షుడితో వ్యతిరేకంగా ఉన్నారని అధిష్టానం వేటు వేసింది. పార్టీకి ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన యత్నాళ్ మరోసారి అవకాశమిస్తే తిరిగి వస్తారని కానీ విజయేంద్ర అధ్యక్షుడిగా ఉండేంత దాకా సాధ్యం కానిదనే అభిప్రాయాలు పార్టీలో ఉన్నాయి.

ఇలా ఇద్దరినీ మళ్ళీ పార్టీలోకి చేర్చుకునేది లేదని పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తేల్చడం వారికి షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఇప్పటికే వర్గపోరుతో విలవిలలాడుతున్న పార్టీలో అసంతృప్తులకు షాక్ ఇచ్చినట్లయ్యింది. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు అన్నట్లు తేల్చినట్లుంది.
ఈ వార్తలు కూడా చదవండి.
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..
Read Latest Telangana News and National News