PM Modi: బీజేపీ ఎంపీల వర్క్ షాప్.. ఆసక్తికర సంఘటన
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:37 PM
ఉప రాష్ట్రపతి ఎన్నికలు నేపథ్యంలో రెండు రోజుల పాటు ఎంపీలతో బీజేపీ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఈ వర్క్ షాప్ ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 07: ఉప రాష్ట్రపతి ఎన్నిక మంగళవారం జరగనుంది. ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీ.. తన ఎంపీలతో రెండు రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఈ వర్క్ షాష్ ఆదివారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వర్క్ షాప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ.. ఇతర సభ్యులతో కలిసి చివరి వరుసలో కూర్చున్నారు. అందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.

ఈ వర్క్ షాప్ ప్రారంభం కాగానే.. జీఎస్టీలో సంస్కరణలు తీసుకు వచ్చిన ప్రధాని మోదీని సభ్యులు ప్రశంసలతో ముంచెత్తారు. ఇక తొలి రోజు ఈ వర్క్ షాప్‌లో 2027 నాటికి అభివృద్ధి దిశగా భారత్.., సోషల్ మీడియాను ఎంపీలు సమర్థవంతంగా వినియోగించడం.. ఈ రెండు ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. అలాగే వ్యవసాయం, రక్షణ, ఇంధనం, విద్య, రైల్వేలు తదితర కమిటీలతో ఈ ఎంపీలు సమావేశం కానున్నారు. ఇక రెండో రోజు సోమవారం.. అంటే సెప్టెంబర్ 8వ తేదీన జరిగే వర్క్ షాప్‌లో ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎంపీలకు శిక్షణ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ దన్‌ఖడ్ రాజీనామా చేశారు. దీంతో ఈ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక తేదీని ఖరారు చేసింది. దాంతో ఎన్డీయే నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరు ఖరారు చేసింది. ఇక ప్రతిపక్షం ఇండియా కూటమిలోని పార్టీలు సుప్ట్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశాయి. ఈ ఇద్దరు అభ్యర్థులు దక్షిణ భారతదేశానికి చెందిన వారే కావడం గమనార్హం.
సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు, జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వారు. అయితే ఈ ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ విజయం సాధిస్తారంటూ ఇప్పటికే ఒక చర్చ అయితే బలంగా సాగుతోంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల ఎంపీల సంఖ్య అధికంగా ఉండడమే అందుకు కారణం. ఇక సెప్టెంబర్ 8వ తేదీన జరిగే ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 786 సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.