Share News

BJP: హడావుడే.. తొక్కిసలాటకు కారణం.. ఆ ముగ్గురూ రాజీనామా చేయాలి

ABN , Publish Date - Jun 18 , 2025 | 01:04 PM

ఐపీఎల్‌ టోర్నీలో ఆర్సీబీ విజయోత్సవాలు హడావుడిగా జరపడమే తొక్కిసలాటకు కారణమని బీజేపీ మండిపడింది. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఫ్రీడంపార్కులో నిరసన చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్షనేతలు అశోక్‌, చలవాది నారాయణస్వామి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన సాగింది.

BJP: హడావుడే.. తొక్కిసలాటకు కారణం.. ఆ ముగ్గురూ రాజీనామా చేయాలి

- వారే బాధ్యత వహించాలి

- బీజేపీ నేతల డిమాండ్‌

బెంగళూరు: ఐపీఎల్‌ టోర్నీలో ఆర్సీబీ విజయోత్సవాలు హడావుడిగా జరపడమే తొక్కిసలాటకు కారణమని బీజేపీ మండిపడింది. రాష్ట్ర బీజేపీ(BJP) ఆధ్వర్యంలో ఫ్రీడంపార్కులో నిరసన చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్షనేతలు అశోక్‌, చలవాది నారాయణస్వామి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన సాగింది. పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర మాట్లాడుతూ ఈ నెల 3న అర్ధరాత్రి జట్టు విజయం సాధించిందన్నారు. రాత్రంతా పోలీసులు గస్తీ నిర్వహించారన్నారు. బెంగళూరు(Bengaluru) నగర వ్యాప్తంగా తెల్లవారే దాకా ఎటుచూసినా సంబరాలు కొనసాగాయన్నారు.


pandu1.jpg

4వ తేదీ మధ్యాహ్నానికే విధానసౌధ, చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాలు జరుపుతున్నట్టు ప్రకటించారన్నారు. 17ఏళ్ల తర్వాత జట్టు గెలుపొందడంతో అభిమానులలో ఎనలేని ఉత్సాహం నెలకొందన్నారు. గెలుపొందిన జట్టు బెంగళూరుకు వస్తోందనే సమాచారంతో లక్షలమంది చేరారన్నారు. కనీస జాగ్రత్తలు ప్రభుత్వం పాటించలేదన్నారు. పోలీసులు వెనుకడుగు వేస్తున్నా జరపాల్సిందేననే ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. తగినంత పోలీసు బందోబస్తు లేకపోవడమే ఏకంగా 11మంది మృతికి కారణమైందన్నారు.


pandu1.2.jpg

ప్రతిపక్షనేత అశోక్‌ మాట్లాడుతూ క్రీడాకారులు సైతం విధానసౌధనుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారన్నారు. ఎవరికోసం ఈ హడావుడి చేశారని ప్రశ్నించారు. డీకే శివకుమార్‌ షీల్డును పైకెత్తి ఆయనే సాధించినట్టుగా వ్యవహరించారన్నారు. 11 కుటుంబాల శాపం ప్రభుత్వానికి తగలనుందన్నారు. తొలుత విధానసౌధ, ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంకు రావాలంటూ పిలుపునిచ్చారన్నారు. తప్పు ప్రభుత్వం చేసి అధికారులను బలిపశువులను చేశారన్నారు. పరిషత్‌ ప్రతిపక్షనేత చలవాది నారాయణస్వామి మాట్లాడుతూ కార్యక్రమం వద్దంటూ పోలీసుశాఖ సూచించినా ప్రభుత్వం ఏదో సాధించినట్టుగా వ్యవహరించిందన్నారు.


11మంది మృతికి కారకులైన సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌, హోం మంత్రి పరమేశ్వర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో భాగంగా ఫ్రీడంపార్కునుంచి సీఎం నివాసాన్ని ముట్టడిచేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విజయేంద్ర మాట్లాడుతూ సీఎం, డీసీఎంల పిచ్చిచేష్టలతో 11మంది మృతి చెందారన్నారు. సిగ్గులేని ప్రభుత్వమని, నైతిక బాధ్యతతో వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం నివాసంవైపు వెళ్లేందుకు ప్రయత్నించగా విజయేంద్ర, అశోక్‌, చలవాదితోపాటు ఎంపీలు గోవిందకారజోళ, పీసీ మోహన్‌, ఎమ్మెల్యేలు బైరతి బసవరాజ్‌, గోపాలయ్య, రవిసుబ్రమణ్య, ఉదయ్‌ గరుడాచార్‌, మునిరాజ్‌, కృష్ణప్ప, రవికుమార్‌, కేశవప్రసాద్‌తోపాటు పలువురిని అరెస్టు చేశారు. నిరసనకు భారీగా జనం తరలివచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంజనీరింగ్‌లో మళ్లీ ‘నచ్చిన సబ్జెక్టులు’!

సౌర విద్యుత్‌పై అవగాహన పెంచాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 18 , 2025 | 01:04 PM