Solar Power: సౌర విద్యుత్‌పై అవగాహన పెంచాలి
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:27 AM
పునరుత్పాదక ఇంధన లక్ష్యాల పెంపు దశగా ప్రజాప్రతినిధులు ఐక్యంగా ముందుకెళ్లాలని పలువురు ఎంపీలు పేర్కొన్నారు.
గ్రామీణులను ప్రోత్సహించాలి
సౌర విద్యుద్ధీకరణపై భేటీలో ఎంపీల సూచన
హైదరాబాద్ సిటీ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): పునరుత్పాదక ఇంధన లక్ష్యాల పెంపు దశగా ప్రజాప్రతినిధులు ఐక్యంగా ముందుకెళ్లాలని పలువురు ఎంపీలు పేర్కొన్నారు. ‘భారత సౌర విద్యుద్దీకరణ ప్రస్థానంలో ప్రజా ప్రతినిధుల పాత్ర’ అనే అంశంపై స్వానితి అనే సంస్థ మంగళవారం ట్యాంక్‌బండ్ వద్ద గల మారియట్ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఎంపీలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరుత్పాదక ఇంధన పథకాలను సమర్థంగా ఉపయోగించుకునేందుకు స్వయం సాధికారత దిశగా గ్రామీణులను ప్రోత్సహించాలని సూచించారు. సౌర విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి కలిసి పనిచేయాలన్నారు.
ఈ సమావేశంలో రాజకీయాలకతీతంగా రాష్ట్ర ఎంపీలు బలరామ్ నాయక్, మల్లురవి, కిరణ్‌కుమార్ రెడ్డి, రఘురామ్‌రెడ్డి (కాంగ్రెస్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (బీజేపీ), ఎమ్మెల్యేలు గోపికృష్ణ, మందుల శామ్యూల్, కుచుకుళ్ల రాజేష్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, కె.సత్యనారాయణ, బీర్ల ఐలయ్య, మేఘారెడ్డి తుది, జారే ఆదినారాయణ, వేముల వీరేశం, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పాల్గొన్నారు. తెలంగాణ రెడ్కో చైర్‌పర్సన్ అనిలా మాట్లాడుతూ గ్రామాల్లో సౌర శక్తి వినియోగం పెంచుకునేందుకు పలు అవకాశాలున్నాయని చెప్పారు. స్వానితి ట్రస్టీ ఉమా భట్టాచార్య మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు.