Share News

BJP: 3 రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారుల నియామకం

ABN , Publish Date - Jun 27 , 2025 | 07:28 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉండటంతో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే ఆయా రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుంది.

BJP: 3 రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారుల నియామకం

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర ఎన్నికల అధికారులను బీజేపీ (BJP) శుక్రవారంనాడు నియమించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఈ నియామకాలు జరిపింది. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు మహారాష్ట్రకు, హర్ష్ మల్హోత్రా ఉత్తరాఖండ్‌కు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పశ్చిమబెంగాల్‌కు రాష్ట్ర ఎన్నికల అధికారులుగా నియమితులయ్యారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ మండలి సభ్యుల ఎన్నికలకు కేంద్రం తరఫు ఇన్‌చార్జులుగా వీరు వ్యవహరిస్తారు.


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉండటంతో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే ఆయా రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుంది. 37 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉండగా, జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు కనీసం 19 చోట్ల ఎన్నికలు పూర్తికావాల్సి ఉంటుంది. ఇంతవరకూ 14 చోట్ల పార్టీ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. బీజేపీ కీలక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లోనూ పార్టీ సంస్థాగత ఎన్నికలు ఇంకా పూర్తికాలేదు. ఈ రాష్ట్రాలకు జనవరిలోనే రాష్ట్ర ఎన్నికల అధికారులను పార్టీ నియమించింది.


పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్ల పాటు ఉంటుంది. 2020 జనవరిలో జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడి పగ్గాలు చేపట్టారు. అయితే 2024లో లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. కొత్త అధ్యక్షుడి నియామకం జరిగేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.


ఇవి కూడా చదవండి..

సీఎం కాన్వాయ్‌లోని 19 కార్లు ఒకేసారి బ్రేక్‌డౌన్.. ఎందుకంటే

రథయాత్రలో అపశ్రుతి.. బీభత్సం సృష్టించిన ఏనుగు..

For More National News

Updated Date - Jun 27 , 2025 | 08:00 PM