Share News

Bihar Voter List Controversy: బిహార్‌లో ఓటర్ల జాబితా వివాదంతో ఈసీ కీలక నిర్ణయం

ABN , Publish Date - Jul 06 , 2025 | 08:31 PM

బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్షను ఈసీఐ నిర్వహిస్తుండటంతో దీనిని సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Bihar Voter List Controversy: బిహార్‌లో ఓటర్ల జాబితా వివాదంతో ఈసీ కీలక నిర్ణయం
Election Commission of India

పాట్నా: అసెంబ్లీ ఎన్నికలకు బిహార్ ఓవైపు సిద్ధపడుతుండగా మరోవైపు ఓటర్ల జాబితాకు సంబంధించిన వివాదం ముదురుతోంది. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్ష (Special Intensive Revision-SIR)ను ఈసీఐ నిర్వహిస్తుండటంతో దీనిని సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా నిబంధనలను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్లు తమ దరఖస్తులను సమర్పిస్తే చాలని, ప్రస్తుతం సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం లేదని ప్రకటించింది. దీంతో ఓటర్లకు ఉపశమనం కలిగినట్టయింది.


బిహార్‌లో ఎస్ఐఆర్‌కు ఈసీ ఆదేశించడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం పక్షపాతంతో కూడుకున్నదని, రాజ్యాంగ విరుద్ధమని.. పేదలు, మహిళలు, వలస ఓటర్లను ఓటింగ్ ప్రక్రియ నుంచి మినహాయించేందుకు ఉద్దేశించినదని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈసీ ఆదేశాలను ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఎన్నికలు మరో మూడు, నాలుగు నెలల్లో ఉండగా ఎలాంటి కారణాలు లేకుండా ఎన్నికల కమిషన్ విస్తృత సమీక్షకు ఆదేశించడం సరికాదని, ఇందువల్ల ఎస్టీ, ఎస్టీ, వలస కార్మికులు 3 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోతారని ఏడీఆర్ పేర్కొంది.


నిబంధనల సడలింపు

ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్‌ల సమర్పణకు నిబంధనలను సడలించింది. ఓటర్లు తమ దరఖాస్తులతో ఫొటో ఐడెంటిఫికేషన్, ఇతర డాక్యుమెంట్లు జత చేయనక్కరలేదని తెలిపింది. ఎలాంటి అటాచ్‌మెంట్‌లు లేకుండా నేరుగా తమ దరఖాస్తులను బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ)కు సమర్పించవచ్చని తెలిపింది. శనివారం సాయంత్రం వరకూ బిహార్‌లో అర్హత కలిగిన 14 శాతం మంది ఓటర్లు దరఖాస్తులు సమర్పించారని ఎన్నికల కమిషన్ తెలిపింది.


ఇవి కూడా చదవండి..

ఈసీఐ ఓటర్ల జాబితా సమీక్షపై సుప్రీంకోర్టుకు మహువా మొయిత్రా

బీహార్‌ను నేరాల రాజధానిగా మార్చేశారు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 09:08 PM