Operation Sindoor: ఈ పాపకు తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారో తెలుసా..
ABN , Publish Date - May 08 , 2025 | 03:12 PM
Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా సైనిక దాడి నిర్వహించింది. ఈ దాడిని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి.
పాట్నా, మే 08: బిహార్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కాతిహార్ జిల్లాలోని కుందన్ కుమార్ మండల్ తన కుమార్తెకు సిందూర్ అని పేరు పెట్టారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా దాయాది దేశం పాకిస్థాన్‌పై కేంద్రం సిందూర్ పేరుతో సైనిక చర్యకు పాల్పడిన రోజు.. తమకు పాప జన్మించిందని ఆయన వివరించారు. అందుకే తమ పాపకు సిందూర్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ పాపకు సిందూర్ అంటే అర్థం ఇప్పుడే తెలియక పోవచ్చు.
కానీ ఆమె పెరిగి పెద్దదైన తర్వాత ఆ పేరుకు ఆర్థం తెలుసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమాయకుల ప్రాణాలను తీయడం ద్వారా దేశానికి హాని కలిగించే పాకిస్థాన్‌లోని ఉగ్రమూకల పీచమణచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టడం తమకు గర్వంగా ఉందన్నారు. పాపకు ఈ పేరు పెట్డడం పట్ల తమ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు పాపకు సిందూర్ పేరును ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది సైతం ఆమోదించారని చెప్పారు.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ దారుణం వెనుకు పాకిస్థాన్ హస్తం ఉందనేందుకు బలమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులోభాగంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే భారత్‌లోని పాకిస్థానీయులంతా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు గడువు సైతం భారత్ విధించింది.
ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా మరోసారి పహల్గాం తరహా ఉగ్రదాడి ఘటనలు జరగకుండా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రమూకల స్థావరాలపై భీకర దాడులు జరిపింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది మరణించినట్లు భారత్ ప్రకటించింది. భారత్ చేపట్టిన ఈ చర్యకు సిందూర్ అని కేంద్రం నామకరణం చేసింది. అదే రోజు.. కుందన్ కుమార్ మండల్‌కు కుమార్తె జన్మించడంతో ఆమెకు ఈ పేరును పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
India Vs Pakistan: భారత్, పాకిస్తాన్ బలాబలాలు.. యుద్ధం వస్తే ఎవరు కింగ్..
Operation Sindoor: ముగిసిన అఖిలపక్ష సమావేశం.. ప్రధాని మోదీ కీలక సందేశం
Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి
For National News And Telugu News