Bengaluru tragedy: విజయోత్సవాల్లో ఘోర విషాదం!
ABN , Publish Date - Jun 05 , 2025 | 04:20 AM
బెంగళూరులో బుధవారం తలపెట్టిన ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో ఘోర విషాదం సంభవించింది. పరిమితికి మించి వేలాదిగా క్రికెట్ యువ అభిమానులు పోటెత్తడంతో చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద భారీగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట.. 11మంది మృత్యువాత.. 33 మందికి గాయాలు’
ఐపీఎల్ విజేతలను చూసేందుకు బెంగళూరులో పోటెత్తిన అభిమానులు
గేట్లు తీయడంతో భారీగా తొక్కిసలాట.. మృతుల్లో నలుగురు మహిళలు
న్యాయ విచారణకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశం
బెంగళూరులో వేడుకల మధ్య ఒక యువకుడికి కత్తిపోట్లు
హైదరాబాద్‌లో అభిమానుల హల్‌చల్.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్
బెంగళూరు, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులో బుధవారం తలపెట్టిన ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో ఘోర విషాదం సంభవించింది. పరిమితికి మించి వేలాదిగా క్రికెట్ యువ అభిమానులు పోటెత్తడంతో చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద భారీగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాతపడ్డారు. 33మంది గాయపడ్డారు. బెంగళూరు జట్టు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ కప్‌ను గెలుచుకుంది. ఈ సందర్భంగా బెంగళూరులో పలు కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆర్‌సీబీ క్రికెటర్లు సాయంత్రం 6గంటలకు స్టేడియానికి చేరుకుంటారని నిర్వాహకులు ప్రకటించారు. స్టేడియం సామర్థ్యం 30-40 వేలు. కానీ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పటీదార్ సహా తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు మధ్యాహ్నం ఒంటి గంటకే లక్షమంది తరలివచ్చారని సమాచారం. మరో మూడు గంటల్లో ఇంకో లక్షమంది అక్కడకు చేరుకున్నారు. వారిని నిర్వాహకులు, పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో తొక్కసలాట చోటుచేసుకుంది. కార్యక్రమ వివరాలను ముందుగా అందించకపోవడం, అభిమానులకు నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుందని సమాచారం. మృతులలో నలుగురు మహిళలు, ఆరుగురు పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.
స్టేడియం కాదు.. జన సంద్రమే..
షెడ్యూల్ ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు అహ్మదాబాద్ నుంచి ఆర్‌సీబీ క్రికెటర్లు బెంగళూరు చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు స్టేడియం సమీపంలోని విధానసౌధ తూర్పు ద్వారం వద్ద ఐపీఎల్ విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం సన్మానం ఏర్పాటుచేసింది. అక్కడికీ వేలాదిమంది వెళ్లారు. మరోవైపు, చిన్నస్వామి స్టేడియం చుట్టూ ఎటుచూసినా రెండు కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంతమంది జనం కనిపించారు. వీరందరూ సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత స్టేడియం గేట్ల వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న వారి సంఖ్య లక్ష దాటిందని సమాచారం. అయితే, నిర్వాహకులు ఇదేం పట్టించుకోకుండా ఒక్కసారిగా 3, 12, 18, 19, 20 నంబరు గేట్లన్నింటినీ తెరిచారు. అంతే...వేలాదిమంది దూసుకుపోయారు. ఈ క్రమంలో చాలామంది కిందపడ్డారు. వారిని తొక్కుకుంటూ మిగతావారు ముందుకెళ్లారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని లాఠీచార్జి చేశాయి. కిందపడినవారికి సహాయక చర్యలు ప్రారంభించాయి. భారీగా జనం నిండిపోవడంతో అంబులెన్స్‌లు వారిని దాటుకుని సకాలంలో చేరుకోలేకపోయాయి. దీంతో గాయపడినవారిని చేతులపై ఎత్తుకుని సమీపంలోని వైదేహి ఆస్పత్రి వైపు పోలీసులు పరుగులు తీశారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే నలుగురు మృతి చెందారు. శివాజీ నగర్‌లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించిన 24మందిలో ఏడుగురు మృతి చెందారు.

న్యాయ విచారణకు సిద్దరామయ్య ఆదేశం
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఊహించినదానికంటే ఎక్కువ జనం రావడంతోనే ప్రమా దం జరిగిందని, బందోబస్తు ఏర్పాట్లలో పోలీసులు విఫలమయ్యారన్నారు. మృతులకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం తెలిపారు.
అస్తవ్యస్తం.. గందరగోళం..
విధానసౌధ తూర్పుద్వారం వద్ద ఆర్‌సీబీ జట్టు క్రీడాకారులను సన్మానించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అక్కడికి వేలాదిమంది తరలివచ్చారు. రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. విధానసౌధకు దాదాపు 15 అడుగులకుపైగా ఎత్తైన గేట్‌లు ఉన్నాయి. వాటిపైకి ఎక్కి అవతలకు వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించారు. విధానసౌధ వద్దకు నాలుగైదువేలమంది వస్తారని అంచనా వేశారు. కానీ 60వేలమందికిపైగా జనం చేరడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. విధానసౌధ లోపలికే వేలాదిమంది వివిధ మార్గాల ద్వారా చేరుకున్నారు. దీంతో జట్టు సభ్యులను సన్మానించే కార్యక్రమాన్ని గందరగోళంగా ముగించారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు అక్కడ ఉండగానే.. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట విషయం తెలిసింది. దీంతో ప్రసంగాలు లేకుండా సన్మాన కార్యక్రమాన్ని కొద్దిసేపట్లోనే ముగించారు. కాగా, తొక్కిసలాట తరువాత స్టేడియంలో వేచియున్న వేలాది మంది కోసం క్రికెటర్లు తరలివచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ అభిమానులనుద్దేశించి మాట్లాడారు. గంటన్నరకుపైగా జరగాల్సిన కార్యక్రమాన్ని కొన్ని నిమిషాలలోనే ముగించుకుని అక్కడనుంచి వెళ్లిపోయారు. ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా దేశంలోని పలు చోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. విజయవాడలో విజయోత్సవ ర్యాలీలో బైక్‌తో పాల్గొన్న యువకుడు కారు ఢీ కొనడంతో చనిపోయాడు. కర్ణాటకలో ఒకరు గుండెపోటుతో, మరొకరు యాక్సిడెంట్‌లో చనిపోయారు.

ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి