Mehul Choksi Extradition Approved: మేహుల్ చోక్సీని స్వదేశానికి తరలించేందుకు బెల్జియం కోర్టు అనుమతి
ABN , Publish Date - Oct 18 , 2025 | 10:31 AM
ఆర్థికనేరగాడు మేహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించేందుకు అనుమతిస్తూ బెల్జియం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు కూడా అతడికి న్యాయస్థానం అవకాశం కల్పించింది.
ఇంటర్నెట్ డెస్క్: బెల్జియం జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు మేహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించేందుకు అక్కడి న్యాయస్థానం అంగీకరించింది. బెల్జియం పోలీసులు ఆయనను అరెస్టు చేయడం సబబేనని కూడా పేర్కొంది. ఈ తీర్పును సవాలు చేసేందుకు కూడా చోక్సీకి కోర్టు అవకాశం ఇవ్వడంతో ఆయనను భారత్‌కు తరలించేందుకు భారత అధికారులకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, ఇది సానుకూల పరిణామమని భారత్ వర్గాలు చెబుతున్నాయి. మేహుల్‌ను స్వదేశానికి చేర్చే ప్రక్రియలో ఇది కీలకమైన తొలి అడుగని వ్యాఖ్యానించాయి (Belgium Court allows Extradition of Mehul Choksi).
విచారణ సందర్భంగా భారత్ తరపు న్యాయవాదుల వాదనలతో కోర్టు ఏకీభవించింది. చోక్సీపై మోపిన నేరపూరిత కుట్ర, మోసం, ఆధారాల ధ్వంసం, అవినీతి తదితర ఆరోపణలు బెల్జియం చట్టాల ప్రకారం శిక్షార్హమైన నేరాలని పేర్కొంది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను స్వదేశానికి తరలించొచ్చని అభిప్రాయపడింది. చోక్సీ కేసులో ఆధారాలను సమర్పించేందుకు సీబీఐ అధికారులు ఇప్పటికే మూడు సార్లు బెల్జియం వెళ్లి వచ్చారు. ఈ ప్రక్రియలో ఐరోపాకు చెందిన ఓ న్యాయవాద సంస్థ సాయం కూడా తీసుకుంటున్నారు.
ఇక చోక్సీని ఆంట్వర్ప్ నగర పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 11న అదుపులో తీసుకున్నారు. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆయనను అరెస్టు చేశారు. బెయిల్ కోసం చోక్సీ పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించింది. ఆయన పారిపోయే ప్రమాదం ఉండటంతో బెయిల్‌ను నిరాకరించింది (Antwerp Police arrest Choksi).
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లను ఎగవేసిన మోహుల్ చోక్సీ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. 2018లో ఆయన దేశం నుంచి పారిపోయారు. ఆయనను వెనక్కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. చోక్సీని స్వదేశానికి పంపిస్తే అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆయనతో వ్యవహరిస్తామని బెల్జియంకు హామీ ఇచ్చింది. ఐరోపా మానవహక్కుల చట్టాలకు అనుగుణంగా ఉన్న ఆర్థర్ రోడ్ జైల్‌లోని (ముంబై) బరాక్ నెం.12లో ఆయనను పెడతామని కూడా చెప్పింది. మేహుల్ చోక్సీ తన భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారన్న వాదనను కూడా భారత్ తోసి పుచ్చింది. చోక్సీ భారతీయుడేనని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎస్ ఆఫీసర్‌పై భార్య ఫిర్యాదు.. నోయిడా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ISRO: నవంబరు చివర్లో బ్లూబర్డ్ ప్రయోగం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి