Share News

Baloch Freedom Struggle: 75 ఏళ్లుగా బలూచీల పోరు

ABN , Publish Date - May 09 , 2025 | 05:20 AM

పాక్‌లో బలూచీలకు విద్య, వైద్యం లేని దుస్థితి మధ్య 75 ఏళ్లుగా స్వాతంత్ర్య పోరాటం కొనసాగుతోంది. తాజా దాడులతో బీఎల్‌ఏ దళాలు మరింత క్రియాశీలంగా మారాయి.

 Baloch Freedom Struggle: 75 ఏళ్లుగా బలూచీల పోరు

  • భారత్‌ దాడులతోక్రియాశీలమైన బీఎల్‌ఏ దళాలు

  • అర్ధరాత్రి నుంచి పాక్‌పై దాడులు

  • పాక్‌లో అతిపెద్ద భూభాగం బలూచిస్థాన్‌దే

  • జనాభా మాత్రం 7-8 శాతం వరకే

(సెంట్రల్‌ డెస్క్‌)

బలూచిస్థాన్‌..! పాకిస్థాన్‌లో ఉన్నా.. అక్కడి పౌరులకు స్వేచ్ఛ లేదు.. విద్య, వైద్యం అందని దుస్థితి..! పాకిస్థాన్‌లో 44 % విస్తీర్ణం ఉన్న బలూచిస్థాన్‌ ప్రాంతాన్ని పాక్‌ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. అక్కడి ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నాయి. దీంతో.. స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ.. అక్కడి పౌరులు 75 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు పాక్‌పై భారత్‌ దాడి నేపథ్యంలో.. బలూచీలు తమ కలను సాకారం చేసే దిశలో ముందుకు సాగుతున్నారు.

ఇదీ బలూచిస్థాన్‌ కథ

బ్రిటిష్‌ వారు 1947 ఆగస్టు 15న భారత్‌-పాకిస్థాన్‌లను విభజించి, స్వాతంత్య్రం ప్రకటించినా.. బలూచిస్థాన్‌ ప్రాంతం స్వతంత్రంగా ఉండేది. ‘ఖాన్‌ ఆఫ్‌ కలాత్‌’ అనే రాజు పాలనలో ఈ ప్రాంతం కొనసాగింది. అయితే.. 1948 మార్చిలో పాకిస్థాన్‌ ప్రభుత్వం సైనిక చర్యను చేపట్టి.. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. పాకిస్థాన్‌లో విలీనం చేసుకుంది. పాకిస్థాన్‌ విస్తీర్ణంలో బలూచిస్థాన్‌ వాటా 44శాతంగా ఉంటుంది. అయితే.. పాక్‌ జనాభాలో బలూచీల వాటా 7-8ు మాత్రమే. పాక్‌ దురాక్రమణ నుంచి ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. తమ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బలూచీలను పాకిస్థాన్‌ భావించేది. ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్‌ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదు. ఇక్కడి ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలు లేవు. ఈ ప్రాంతంలోని వనరులను పాకిస్థాన్‌, చైనా దోచుకుంటున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన యువకులను పాక్‌ సైన్యం అపహరిస్తోంది. అలా అదృశ్యమయ్యే వారి జాడ నేటికీ తెలియలేదంటే.. బలూచీల దుర్భర పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


బీఎల్‌ఏ ఆవిర్భావం.. దాడులు ముమ్మరం

2000 సంవత్సరంలో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ(బీఎల్‌ఏ) ఆవిర్భవించింది. స్వతంత్ర బలూచిస్థాన్‌ దేశం కోసం గెరిల్లా యుద్ధాలతో పాకిస్థాన్‌ సైన్యంపై దాడులు చేసేది. క్రమంగా బీఎల్‌ఏ బలం పుంజుకుంది. పాకిస్థాన్‌ సైనికులు, వారి కార్యాలయాలు, కంటోన్మెంట్‌ ప్రాంతాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలను టార్గెట్‌గా చేసుకుని, దాడులు జరుపుతోంది. ప్రస్తుతం బీఎల్‌ఏ చీఫ్‌గా బషీర్‌ జైబ్‌ వ్యవహరిస్తున్నారు. 2018 వరకు ఆయన సోదరుడు అస్లాం బలూచ్‌ ఈ పదవిలో ఉండేవారు. ఆయన మరణం తర్వాత బషీర్‌ జైబ్‌ బాధ్యతలను స్వీకరించాక.. బీఎల్‌ఏ మరింతగా పుంజుకుంది. గెరిల్లా పోరుతోపాటు.. అధునాతన ఆయుధాల వినియోగం, ఐఈడీల ప్రయోగాలు పెరిగాయి. ఆయన నేతృత్వంలోని బీఎల్‌ఏ.. గ్వాదర్‌ పోర్టు వద్ద చైనా ఇంజనీర్లు, వారి వాహనాలపై ఐఈడీ దాడులు చేస్తోంది. తాజాగా మంగళ, బుధవారాల్లోనూ బలూచిస్థాన్‌లో ఐఈడీలు పేల్చి, 21 మంది సైనికులను హతమార్చింది. ఇటీవల క్వెట్టా-పెషావర్‌ మధ్య నడిచే జాఫర్‌ ఎక్స్‌ప్రె్‌సను హైజాక్‌ చేసి, సంచలనం సృష్టించింది. స్వతంత్ర దేశంగా బలూచిస్థాన్‌ను సాధించడానికి పోరాటాలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా పాకిస్థాన్‌లో చైనా ప్రాజెక్టులు, సీపీఈసీ రోడ్డు ప్రణాళిక పాలిట బీఎల్‌ఏ ముప్పుగా పరిణమించింది. దీంతో ఈ ఉద్యమాన్ని అణిచివేయాలంటూ పాకిస్థాన్‌పై చైనా నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది.

Updated Date - May 09 , 2025 | 05:20 AM