Viral Fever: విషజ్వరాలతో జనం విలవిల..
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:00 PM
జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. వ్యాధులతో జనం విలవిల్లాడుతున్నారు. జ్వరాలతో బాధపడుతున్న జనం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లి పెద్ద మెత్తంలో డబ్బులు ఖర్చు చేసుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.
- రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
- వైద్యపరీక్షల పేరుతో పేదల జేబులు గుల్ల
బళ్లారి(బెంగళూరు): జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. వ్యాధులతో జనం విలవిల్లాడుతున్నారు. జ్వరాలతో బాధపడుతున్న జనం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లి పెద్ద మెత్తంలో డబ్బులు ఖర్చు చేసుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం సరిగ్గా అందుతుందో లేదనే అపనమ్మకంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇక కొందరు ప్రైవేటు క్లినిక్స్ నిర్వాహకులు సీజన్‌లోనే సంపాదించుకోవాలి అనే రీతిలో రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలుకు తెరలేపారు. బళ్లారి, విజయనగర(Ballari, Vijayanagara) జిల్లాల్లో వారం నుంచి వైరల్ ఫివర్స్(సీజనల్ వ్యాధులు) పెరిగాయి.
చాలామందికి కాళ్లు, కీళ్ల నొప్పులు, జలుబు, దగ్గు, కాస్త జ్వరంగా కూడా ఉంటుంది. దీంతో రోగులు వైద్యం కోసం క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. డాక్టర్లు నాడిపట్టకుండానే కనీసం రోగుల బాధను అర్థం చేసుకోకుండానే నీకు పరీక్షలు చేయించాలని రక్తపరీక్ష, మూత్ర పరీక్షలు, డెంగీ, మలేరియా తదితర అన్ని పరీక్షలు చేయిస్తున్నారు. ఇందుకు సరాసరి రూ.1000 తీసుకుంటున్నారు. ఇక డాక్టర్ ఫీజు రూ.400. మందులు, ఇతర టానిక్స్‌కు రూ.1000 ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.2500 నుంచి 5వేల వరకు వైద్య ఖర్చులు అవుతున్నాయి.
తీరా చూస్తే అవి వైరల్ ఫీవర్ అని, ఏమీ కాదు అని రెండు మూడు రోజులు మాత్రలు వాడితే సరిపోతుందని చెప్పి పంపుతున్నారు. వాస్తవానికి వైద్యంపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో దగ్గు వచ్చినా డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ వైరల్ ఫివర్స్ పెరిగాయి. ప్రభుత్వం తరుపున ప్రజాఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కానీ ప్రజల్లో అవగాహన లేని కారణంగా ప్రైవేటుకు వెళుతున్నారు.

కొందరు డాక్టర్లు కూడా ప్రైవేటు క్లినిక్స్‌కు వెళ్లమని రోగులను ప్రొత్సహిస్తున్నారు. వైరల్ ఫివర్స్‌ను అదుపు చేయడానికి నగరపాలికె, పట్టణ, గ్రామ పంచాయతీ అధికారులు శ్రద్ధ చూపడం లేదు. గ్రామాల్లో వైరల్ పివర్స్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. వైరల్ ఫీవర్స్ సోకి ప్రజలు ఇబ్బంది పడతున్నారు. బళ్లారి జిల్లాలో వారం నుంచి రోగుల సంఖ్య పెరిగింది. పీహెచ్‌సీలు, బీఐఎంఎస్ ఓపీలో రోగుల సంఖ్య పెరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News