Amit Shah: నక్సల్స్‌ను వర్షాకాలంలోనూ నిద్రపోనీయం: అమిత్‌షా
ABN , Publish Date - Jun 22 , 2025 | 07:49 PM
నక్సల్స్ ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ అటల్ నగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు ఆదివారంనాడు ఆయన శంకుస్థాపన చేశారు.
రాయపూర్: వర్షాకాలం (Monsoon) సీజన్‌లోనూ నక్సల్స్‌ను విశ్రాంతి తీసుకోనీయమని, నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ ఆ సీజన్‌లోనూ కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) హెచ్చరించారు. నక్సల్స్‌తో చర్చల ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ అటల్ నగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ (NFSU), సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు అమిత్‌షా ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.
గత ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలోని వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 400 మంది నక్సల్స్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని అమిత్‌షా ఈ సందర్భంగా చెప్పారు. ప్రతిసారి రుతుపవనాల సీజన్‌లో సహజంగా నక్సల్స్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారని, కానీ ఈసారి ఆ సీజన్‌లోనూ వారిని నిద్ర పోనీయమని, 31/3 (2026 నాటికి నక్సల్స్ నిర్మూలన) లక్ష్యం సాధించే దిశగా మరింత ముందుకు దూసుకు వెళ్తామని చెప్పారు. నక్సల్స్ లొంగిపోవాలని, లొంగుబాటు పాలసీని అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని పిలుపునిచ్చారు.
చర్చలు అవసరం లేదు
'చర్యల అవసరం లేదు. కేవలం ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవడమే. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని వారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్రం ప్రకటించిన హామీలన్నీ ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తూం. అంతకంటే ఎక్కువగా కూడా వారికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తాం' అని అమిత్‌షా నక్సల్‌కు సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరిన మరో 311 మంది భారతీయులు
ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయుల తరలింపు
For National News And Telugu News