Mumbai Airport: రన్‌వే దాటిన ఎయిర్ ఇండియా విమానం.. ఏం జరిగిందంటే?
ABN , Publish Date - Jul 21 , 2025 | 02:08 PM
మరో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. ముంబై ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం రన్‌వే దాటి పోయింది. ఈ ఘటనలో..
ముంబై: మరో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి ముంబైకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం, ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా రన్‌వేను దాటి పోయింది. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుండటం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు చెప్పారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. విమానం గేటు వరకు వచ్చి ఆగిపోయింది. అయితే, తనిఖీల కోసం విమానాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) ప్రకటనలో, ఇది చిన్న ప్రమాదమే అని, ప్రయాణికులెవరికీ ఎటువంటి గాయాలు జరగలేదని తెలిపారు. ఈ ఘటన వల్ల ప్రధాన రన్‌వేకు (09/27) స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు నివేదించారు. ఈ కారణంగా మరొక రన్‌వే (14/32)ను ఉపయోగంలోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
పగిలిపోయిన విమాన టైర్లు.!
కాగా, ల్యాండింగ్ సమయంలో విమానానికి చెందిన మూడు టైర్లు పగిలిపోయినట్లు సమాచారం. విమాన ఇంజిన్‌కు చిన్నపాటి నష్టం కూడా వాటిల్లిందని అనుమానిస్తున్నారు. అయినప్పటికీ, అది సురక్షితంగా టెర్మినల్ వరకు చేరడంతో ప్రయాణికులు సేఫ్‌గా బయటపడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి.
రాంచీ–ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం రద్దు
ఇదిలా ఉంటే, ఆదివారం ఢిల్లీకి వెళ్లాల్సిన మరో ఎయిర్ ఇండియా విమానానికి సాంకేతిక లోపం తలెత్తడం వల్ల రద్దు చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులలో అసహనం నెలకొంది. ఎయిర్‌లైన్ సిబ్బందితో కొంత మంది ప్రయాణికులు వాగ్వాదానికి కూడా దిగారు. విమానాశ్రయ డైరెక్టర్ ఆర్.ఆర్. మౌర్య తెలిపిన ప్రకారం, టేకాఫ్‌కు ముందు చెక్ చేస్తుండగా సాంకేతిక లోపం కనిపించింది. కొంతమంది ప్రయాణికులను ఇతర విమానాల్లో ఏర్పాటు చేశారు. మరికొంతమంది టిక్కెట్లు రద్దు చేసుకున్నారని, కొంతమందిని సోమవారం జరిగే ఫ్లైట్‌కు మళ్లించి షెడ్యూల్ చేశామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి