Air India: ‘ఏఐ-171’ రద్దు!
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:05 AM
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా... ఏఐ-171 విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ ‘ఏఐ-171’ నెంబరును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
దానిస్థానంలో ఏఐ-159
విమాన ప్రమాద మృతులకు నివాళిగా నెంబరుకు స్వస్తి
న్యూఢిల్లీ, జూన్ 14: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా... ఏఐ-171 విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ ‘ఏఐ-171’ నెంబరును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తమ ప్రయాణికుల మనోభావాలను, వారి సెంటిమెంటును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఇక నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే విమానం ఏఐ-159 నెంబరుతో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. దీనిపై ఎయిర్ ఇండియా వర్గాలు మీడియాతో మాట్లాడుతూ.. ఏదైనా దుర్ఘటన సంభవించినప్పుడు సాధారణంగా విమాన నెంబర్లను మారుస్తారని, ఇది అంతటా జరిగే ప్రక్రియేనని తెలిపాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళిగా ఏఐ-171ను ఏఐ-159గా మార్పు చేసినట్టు పేర్కొన్నాయి.
ప్రాణాలు కాపాడిన 11ఎ సీటు
2 విమాన ప్రమాదాల్లో మృత్యుంజయులిద్దరే
న్యూఢిల్లీ, జూన్ 14: అహ్మదాబాద్ ఎయిరిండియా (బోయింగ్ డ్రీమ్‌లైనర్) విమాన ప్రమాదంలో మాదిరే 27 ఏళ్ల క్రితం జరిగిన మరో విమాన ప్రమాదంలో థాయ్ గాయకుడు రువాంగ్సాక్ లోయ్‌చుషాక్ ఒక్కరే సురక్షితంగా బతికి బయట పడ్డారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో మృత్యుంజయుడైన భారత సంతతి బ్రిటన్ పౌరుడు రమేశ్ బిశ్వాస్.. తాను కూర్చున్న ‘11ఎ’ సీటు పక్కనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండటం వల్లే ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు.
1998 డిసెంబర్ 11న దక్షిణ థాయిలాండ్‌లో ల్యాండవుతూనే ప్రమాదానికి గురైన థాయి ఎయిర్‌వేస్ విమాన ప్రయాణికుల్లో రువాంగ్సాక్ కూడా ‘11ఏ’ సీటులో కూర్చోవడం వల్లే ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిరిండియా విషాదం తెలియగానే రువాంగ్సాక్.. తానూ గతంలో మృత్యుముఖం నుంచి బయటపడ్డ సంగతిని ఫేస్‌బుక్‌లో గుర్తు చేసుకున్నారు. థాయి విమాన ప్రమాదం తనకు పునర్జన్మనిచ్చిందని, దాని ప్రభావంతో దశాబ్ధం పాటు విమాన ప్రయాణానికి దూరంగా ఉన్నట్లు తెలిపారు. ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు రువాంగ్సాక్ సంతాపం తెలిపారు. తాజాగా రమేశ్ బిశ్వాస్ ప్రాణాలతో బయటపడటంతో విమానాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్లపై ఆసక్తి పెరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News