Sister Donates Kidney: రాఖీ పండుగ రోజు అద్భుతమైన గిఫ్ట్.. అన్నకు ప్రాణ దానం..
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:02 AM
Sister Donates Kidney: పవన్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పవన్ చెల్లెలు 46 ఏళ్ల బబిత అగర్వాల్ ఏ మాత్రం ఆలోచించకుండా కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
సాధారణంగా రాఖీ పండుగ రోజు రాఖీ కట్టిన వెంటనే ‘నాకేమిస్తున్నావ్?’ అని సోదరీమణులు, సోదరుల్ని అడుగుతుంటారు. కానీ, గుజరాత్‌కు చెందిన ఓ చెల్లి మాత్రం.. రాఖీ పండుగ రోజున అన్న ప్రాణాలు నిలిపే అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది. తన రెండు కిడ్నీలలోంచి ఓ కిడ్నీని అన్నకు దానం చేసింది. చావు బ్రతుకుల మధ్య ఉన్న అన్నను కాపాడుకుంది. రాఖీ పండుగ రోజు ఎంతో సంతోషంగా అన్నకు రాఖీ కట్టింది. ఆస్తుల కోసం అన్నలతో యుద్ధానికి దిగుతున్న చెల్లెళ్లు ఉన్న ఈ కాలంలో ఈ చెల్లి స్టోరీ అందర్నీ ఆలోచింపజేస్తోంది.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్ జిల్లా, జెత్‌పూర్‌కు చెందిన 53 ఏళ్ల పవన్ కుమార్ బంక్ర గత కొన్నేళ్ల నుంచి కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు చెడిపోవటంతో డయాలసిస్‌తో కాలం గడుపుతున్నారు. వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు కిడ్నీ ఇవ్వడానికి ప్రయత్నించారు. భార్య, పిల్లల కిడ్నీలు ఆయనకు సెట్ అవ్వలేదు.
పవన్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పవన్ చెల్లెలు 46 ఏళ్ల బబిత అగర్వాల్ ఏ మాత్రం ఆలోచించకుండా కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. డాక్టర్లు ఆమెకు పరీక్షలు చేశారు. ఆమె కిడ్నీలు సరిపోతాయని తేలింది. జులై 29వ తేదీన సర్జరీ జరిగింది. విజయవంతంగా బబిత కిడ్నీని పవన్‌కు అమర్చారు. వారంలోనే ఇద్దరూ కోలుకున్నారు. రాఖీ పండుగను పురష్కరించుకుని బబిత తన అన్నకు రాఖీ కట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాకు నా అన్న కావాలి. అతడికి కిడ్నీ అవసరం అయితే.. అది ఇవ్వటం నా ధర్మం’ అని అంది. అన్న కోసం కిడ్నీ ఇచ్చిన ఈ చెల్లెలి స్టోరీ పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఒకే అమ్మాయితో పెళ్లి.. అసలు సంగతి చెప్పిన అన్నదమ్ములు..