Share News

Janmashtami: జన్మాష్టమి.. కృష్ణుడి నుంచి పొలిటీషియన్లు నేర్చుకోవాల్సిన పాఠాలు: శశిథరూర్

ABN , Publish Date - Aug 16 , 2025 | 10:00 PM

శ్రీకృష్ణుని స్ఫూర్తిగా రాజకీయ పార్టీలు, నేతలు కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని రచయిత, మాజీ దౌత్యవేత, కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అభిప్రాయపడ్డారు. అందరూ కృష్ణులు కాలేకపోవచ్చు కానీ, ఆయనను అనుకరించడం నేర్చుకోవచ్చని అన్నారు.

Janmashtami: జన్మాష్టమి.. కృష్ణుడి నుంచి పొలిటీషియన్లు నేర్చుకోవాల్సిన పాఠాలు: శశిథరూర్
Krishnashtami-Sashi Tharoor

న్యూఢిల్లీ: ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకలు జరిగిన మరుసటి రోజే జగద్గురువు శ్రీకృష్ణుని 'కృష్ణాష్టమి' వేడుకలు రావడం దేశ ప్రజల సంబరాన్ని రెట్టింపు చేసింది. మహాభారతం, భగవద్గీత, భాగవత పురాణాల్లో శ్రీకృష్ణుని జీవితం, ఆయన అనుసరించిన దౌత్యనీతి, చేసిన బోధలు (భగవద్గీత) నేటికీ నిత్యనూతనం. ఆచరణ సాధ్యం. అంతేకాదు అనుసరణీయం. ఆయన స్ఫూర్తిగా రాజకీయ పార్టీలు, నేతలు కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని రచయిత, మాజీ దౌత్యవేత, కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అభిప్రాయపడ్డారు. అందరూ కృష్ణులు కాలేకపోవచ్చు కానీ, ఆయనను అనుకరించడం నేర్చుకోవచ్చని శశిథరూర్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు రాసిన 'కాలమ్'లో పేర్కొన్నారు. కృష్ణుడు చెప్పిన పాఠాలు, నేతలకు అవి ఏ విధంగా వర్తిస్తాయో అందులో ఆసక్తికరంగా వివరించారు.


1.ధర్మమే సర్వోతృష్టం

శ్రీకృష్ణుడి జీవితమంతా ధర్మం కోసం జరిపిన పోరాటమే కనిపిస్తుంది. ఆయన చర్యలు సంప్రదాయానికి భిన్నంగా, నైతికంగా ఎటుతేల్చిచెప్పలేని విధంగా కనబడతాయి. కానీ వాటన్నింటి అంతిమ లక్ష్యం మాత్రం ధర్మాన్ని పునరుద్ధరించడం, దుష్టలను శిక్షించడమే. రాజకీయ నాయకులు సైతం వ్యక్తిగత ప్రయోజనాలు, పార్టీ విధేయత, ఎన్నికల్లో గెలుపునకు ప్రాధాన్యం ఇవ్వకుండా దేశం, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. క్లిష్ట సమయాల్లో సైతం న్యాయానికి కట్టుబడి ఉండాలి. నైతిక నిబద్ధత కలిగి ఉండాలి.


2. దౌత్య కళ, వ్యూహాత్మక ఆలోచన

కృష్ణుడు వ్యూహ రచనలో, దౌత్యం నెరపడంలో దిట్ట. శాంతియుత సంప్రదింపు ద్వారా మహాభారత యుద్ధం జరక్కుండా చూడాలని ఎంతగానే కృష్ణుడు ప్రయత్నించాడు. కానీ ఆయన దౌత్యం విఫలం కావడంతో పాండవులకు అద్భుతమైన సైనిక వ్యూహానికి నిర్దేశకత్వం వహించారు. ఆయన సలహాలతోనే ధర్మరాజు, భీమ, అర్జున, నకుల సహదేవులు తమలోని బలం, బలహీనతలను గుర్తించి తమ సమర్ధతను చాటుకున్నారు. ఆ విధంగానే మన రాజకీయ నాయకులు సైతం పాలనలో వ్యూహాత్మక ఆలోచలతో ముందుకు వెళ్లాలి. ఇతర పార్టీలు, రాష్ట్రాలు, దేశాలతో నేర్పుగా సంప్రదింపులు సాగించి దేశాభివృద్ధి కోసం దీర్ఘకాలిక వ్యూహాలకు పదును పెట్టాలి. ఇందువల్ల తమ సొంత టీమ్‌‌, ప్రత్యర్థి టీమ్‌లోని బలాలు, బలహీనతలపై అవగాహన ఏర్పరచుకోవచ్చు.


3. సాధికారతా సారథ్యం

భారతయుద్ధంలో కృష్ణుడు నేరుగా పోరాటం చేయనప్పటికీ అర్జునుడికి రధసారథ్యం వహించారు. నాయకుడనే వాడు వ్యక్తిగత పేరును ఆశించకుండా సమర్ధవంతంగా మార్గనిర్దేశకత్వం ఎలా చేయవచ్చో ఆయన చూపించారు. రాజకీయాల్లో నిజమైన నేత ప్రతిసారి తనకే పేరు రావాలని ఆశించకుండా టీమ్‌కు దిశానిర్దేశం చేసి ముందుకు నడిపించాలి. వారు విజయవంతమైతే ఆ విజయం నాయకుడితో పాటు విజయం సాధించిన వారిలో కూడా విజయోత్సాహాన్ని నింపుతుంది.


4.నిష్కామ కర్మ (ఏదీ ఆశించకుండా చేసే పనులు)

భగవద్గీతలో కీలకమైన విషయం నిష్కామ కర్మ. ప్రతి ఒక్కరూ తమకు నిర్దేశించిన పనులు ఫలితంతో సంబంధం లేకుండా సక్రమంగా నిర్వర్తించాలి. చేసే పనిపైనే (యుద్ధం) దృష్టి పెట్టాలని, ఫలితంపై కాదని అర్జునుడికి కృష్ణుడు బోధించారు. రాజకీయ నేతలు కూడా అధికారం కోసమో, పేరు కోసమో, సంపాదన కోసమో కాకుండా ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయాలి. రివార్డుల కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో తమ చర్యలు ఉండకూడదు. ఇందువల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. అయితే చాలామంది రాజకీయ నేతలు వ్యక్తిగత ప్రయోజనాలనే దృష్టిలో ఉంచుకోవడం విచారకరం.


5.మానవ మనస్తత్వశాస్తంపై అవగాహన

శ్రీకృష్ణునికి మానవ మనస్తత్వంపై లోతైన అవగాహన ఉంది. ఆ పరిజ్ఞానంతోనే ఆయన సౌమ్యుడైన ధర్మరాజు నుంచి అహంకారి అయిన దుర్యోధనుడి వరకూ విభిన్నమైన వ్యక్తులతో సమర్ధవంతంగా వ్యవహరించారు. మంచి రాజకీయ నేత మానవ ప్రవృత్తిని నిశితంగా గమనించాలి. ఇది సామాజిక సమస్యలకు కారణాలను గుర్తించేందుకు, భిన్నమైన ప్రజలకు చేరువయ్యేందుకు ఉపకరిస్తుంది.


6. విశ్వ సంక్షేమం

కృష్ణుడు బృందావనంలో గోవులతో సంచరించినా, ద్వారకను ఏలినా సమాజ సంక్షేమం కోసమే పాటుపడ్డాడు. అలాగే రాజకీయనేతలు కూడా తమ ఓటర్లు, మద్దతుదారులకే పరిమితం కాకుండా అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడాలి. అప్పుడే అంతరాలు లేని సమసమాజం నెలకొంటుంది.


7. అహంకారం, అధర్మం చాలా ప్రమాదకరం

అహంకారం, అధర్మ మార్గంలో ఉన్న వారు దుర్యోధనుడు, అతని సహచరగణంలా పతనమవుతారని కృష్ణుడు లైఫ్ స్టోరీ హెచ్చరిస్తుంది. రాజకీయనేతలు కూడా ఇది గుర్తించి వ్యవహరించాలి. అహంకారం, అధికార దుర్వినియోగం, చట్టం పట్ల గౌరవం లేకపోవడం వల్ల రాజకీయంగానే కాకుండా నైతికంగానూ పతనమవుతారు.


శ్రీకృష్ణుడి జీవితమే నైతిక, సమర్ధవంతమైన నాయకత్వానికి మార్గదర్శకత్వం లాంటింది. నిజమైన శక్తి బెదిరింపుల వల్ల కాకుండా తెలివితేటలు, రుజువర్తన, ప్రజలకు అందించే నిస్వార్థ సేవవల్లే సాధ్యం. ఇవన్నీ జన్మాష్టమి నుంచి నేతలు నేర్చుకోవాల్సిన అంశాలు. అందరూ కృష్ణులు కాలేరు, కానీ ఆయన అనుసరించడం నేర్చుకోవచ్చు.

Disclaimer: ఇవి కేవలం రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌కు చైనా మంత్రి.. ఎందుకంటే..

రిజిస్టర్డ్ పోస్ట్ మాయం.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2025 | 10:12 PM