Heavy Rainfall: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వరద బీభత్సం
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:12 AM
భారతావనిపై మేఘ విస్ఫోటం జరిగిందా.. అన్నట్లు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, జలాశయాలు ఉ ప్పొంగి ప్రవహిస్తుండడంతో..
జమ్మూకశ్మీర్‌లో 41 మంది మృతి.. చిక్కుకున్న వైష్ణోదేవి భక్తులు
న్యూఢిల్లీ, ఆగస్టు 28: భారతావనిపై ‘మేఘ విస్ఫోటం’ జరిగిందా..? అన్నట్లు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, జలాశయాలు ఉ ప్పొంగి ప్రవహిస్తుండడంతో.. పరీవాహకాలు, లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీటమునిగాయి. ఉత్తరాన కశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు.. పశ్చిమాన రాణ్ ఆఫ్ కచ్ నుంచి తూర్పున దీపూపాస్ వరకు అంతటా భారీ వర్షాలు, వరద బీభత్సం కొనసాగుతుండగా.. రాబోయే రోజుల్లోనూ మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌లో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులపై వర్షాలు, వరదలు తీవ్రంగా ప్రభావం చూపగా.. ఆ రాష్ట్రంలో 41 మరణాలు నమోదయ్యాయి. హిమాచల్‌లో మరణాల సంఖ్య 300 దాటిందని అధికారులు ప్రకటించారు. కులు నుంచి చండీగఢ్ వెళ్లే జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
జమ్మూకశ్మీర్‌లో..
జమ్మూకశ్మీర్‌లో వరద బీభ త్సం దారుణంగా ఉంది. మంగళ, బుధవారాల్లో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గం(హిమ్‌కోటి ట్రెకింగ్)లో కొండచరియలు విరిగిపడి, 34 మంది మృతిచెందారు. దీంతో.. వైష్ణోదేవి ఆలయ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో వేల మంది ప్రయాణికులు స్టేషన్లలోనే పడిగాపులుకాచారు. రావి నది ఉధృతికి గురువారం రాత్రి పఠాన్‌కోట్‌లోని మాధోపూర్ హెడ్‌వర్క్ నాలుగు గేట్లు విరిగిపోయాయి. దీంతో పాక్ సరిహద్దుల్లోని బీఎస్‌ఎఫ్ పోస్టులను ఖాళీ చేస్తున్నారు. జవాన్లను వెనక్కి రప్పిస్తున్నారు.
ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు
కులు-చండీగఢ్ రహదారిలో మండీ వద్ద 12 చోట్ల.. మనాలీ వద్ద కొన్ని చోట్ల కొండచరియిలు విరిగిపడ్డాయి. దీంతో.. ఆ రహదారిపై 50 కిలోమీటర్ల మేర ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించిపోయాయి. అటు బిహార్‌లోని పట్నాలో భారీ వర్షాలతో ప్రజలు అతలాకుతలమవ్వగా.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద గంగ, యమున నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో.. లక్షన్నర మందిని సహాయక శిబిరాలకు తరలించారు. వారాణసీలోని మణికర్ణికా ఘాట్ వద్ద మెట్లపై వరకు గంగానది ప్రవహిస్తోంది. దీంతో దహన సంస్కారాలను ఆ పక్కనే ఉన్న మండపాల పైకప్పులపై నిర్వహించారు. వరదలతో దేశంలోనే అతిపొడవైన జాతీయ రహదారి-44 చాలా చోట్ల తీవ్రంగా దెబ్బతిన్నది.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..