కన్న కొడుకుల మోసం.. 103 ఏళ్ల వయసులో జైలుకు..
ABN , Publish Date - Mar 13 , 2025 | 09:53 PM
కన్న కొడుకులు చేసిన పనికి ఓ తండ్రి జైలు పాలయ్యాడు. 103 ఏళ్ల ఆ తండ్రిని కొడుకులు నమ్మించి మోసం చేశారు. 18 నెలలు అతడు జైలులో ఉన్నా పట్టించుకోలేదు. పైగా తండ్రికి బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ అన్న మాట నూటికి 99 శాతం నిజం. బయటి ప్రపంచంలోని కొంతమంది మనుషుల వేషాలు చూస్తుంటే.. డబ్బులే లేకపోతే ఆ బంధాలు ఏమవుతాయో అనిపిస్తుంది. డబ్బు విషయంలో ఎవ్వరినీ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి రక్త సంబంధాలు కూడా డబ్బు ముందు తేలిపోతున్నాయి. తాజాగా, కన్న కొడుకులు ఆస్తి కోసం తండ్రిని దారుణంగా మోసం చేశారు. పక్కా ప్లాన్ వేసి మరీ ఆయన్ని ఇరికించారు. 103 ఏళ్ల ఆ వృద్ధుడిని జైలు పాలు జేశారు. పాపం.. కొడుకులు చేసిన పనికి ఆయన 18 నెలలు జైలులో ఉండాల్సి వచ్చింది. ఇంతటితో ఆ కొడుకుల క్రూరత్వం ఆగిపోలేదు. ఆయన్ని బయటకు రాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్ పూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
పాపం: 103 ఏళ్ల వయసులో జైలుకు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్ పూర్‌కు చెందిన గుర్మీత్ సింగ్‌కు 103 ఏళ్లు. 2018లో ఆయన ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. గురుద్వారా కోసం తనకున్న పొలంలో ఓ ఐదు ఎకరాలను ఇవ్వాలనుకున్నాడు. ఇది అతడి కుమారులు కమల్ జీత్, హర్ ప్రీత్ సింగ్‌లకు నచ్చలేదు. ఎలాగైనా సరే తండ్రి ఆ పొలాన్ని గురుద్వారాకు ఇవ్వకుండా చేయాలనుకున్నారు. కోర్టులో కేసు వేశారు. కేసు కోర్టులో నడుస్తూ ఉంది. ఇలాంటి టైంలో అతడి కుమారులు ఓ కన్నింగ్ ప్లాన్ వేశారు. స్థలానికి సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తయ్యాయని, ఇకపై కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని తండ్రికి అబద్ధం చెప్పారు. గుర్మీత్ కుమారుల మాట నమ్మాడు. కోర్టుకు వెళ్లలేదు. కమల్, హర్ ప్రీత్‌లు మాత్రం కోర్టుకు వెళ్లి వస్తూ ఉన్నారు. వాయిదాలకు హాజరుకాకపోవటంతో కోర్టు గుర్మీత్‌కు వారెంట్ ఇచ్చింది. కొద్దిరోజుల తర్వాత పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. గుర్మీత్ దాదాపు 18 నెలలు జైలులోనే ఉన్నాడు.
ఆయన జైలులో ఉన్నన్ని రోజులు కొడుకులు చూడ్డానికి ఎప్పుడూ వెళ్లలేదు. జైలుకు వెళ్లిన ఓ స్థానిక ఎన్జీఓ సభ్యులకు గుర్మీత్ గురించి తెలిసింది. వారు అతడి స్టోరీ తెలుసుకుని చలించిపోయారు. గుర్మీత్‌ను విడుదల చేయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలను గుర్మీత్ కుమారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బెయిల్ రాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా.. ఆ ఎన్జీఓ సభ్యులు వెనక్కు తగ్గలేదు. నెలల ప్రయత్నం తర్వాత గుర్మీత్‌కు బెయిల్ వచ్చింది. కొద్దిరోజుల క్రితమే ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు. కొడుకులు చేసిన పనికి అతడు తల్లడిల్లిపోతున్నాడు. తనలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రావొద్దంటూ కన్నీరు మున్నీరు అవుతున్నాడు.
Also Read:
ఎనర్జీ డ్రింక్స్‌తో పిల్లలకు కిడ్నీ సమస్యల ముప్పు!
కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన అమ్మాయి.. చివరకు ఏం జరిగిందంటే..
మీ వద్ద రూ. కోటి ఉన్నాయని హ్యాపీగా ఉన్నారా? రిస్క్‌లో పడ్డట్టే..
For More National News and Telugu News..