Inflation: మీ వద్ద కోటి ఉందని సంతోషంగా ఉన్నారా? రాబోయే ఈ ముప్పు గురించి తెలుసా?
ABN , Publish Date - Mar 13 , 2025 | 05:23 PM
నానాటికీ పెరిగే ద్రవ్యోల్బణం కారణంగా సంపద విలువ తగ్గిపోతుంది. అది ఎలాగో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: మీ వద్ద కోటీ రూపాయలు ఉన్నాయా? ఇక లైఫ్ సెట్ అన్న సంతోషంలో ఉన్నారా? అయితే, ఈ కథనం మీకోసమే. మరో 25 ఏళ్లల్లో ఈ కోటీ విలువ కేవలం 25 లక్షలకు పడిపోతుంది. ద్రవ్యోల్బణం దెబ్బకు డబ్బుకు ఉన్న కొనుగోలు శక్తి చూస్తుండగానే ఆవిరైపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం 5 శాతానికి పరిమితమైనా ఈ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయని కూడా చెబుతున్నారు.
మీ వద్ద ఉన్న కోటి మొత్తాన్ని 6.5 శాతం వడ్డీకి ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడితే కొంత వరకూ ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.
ఇక పీపీఎఫ్ కూడా ద్రవ్యోల్బణం నుంచి కొంత వరకూ రక్షణ కల్పిస్తుంది. ఉదారణకు వచ్చే 25 ఏళ్ల్లో మీరు కోటి పొదుపు చేయాలనుకుంటే ఇప్పటి నుంచే ఏటా పీపీఎఫ్‌లో 146000 చొప్పున మదుపు చేయాల్సి ఉంటుంది.
Retirement Plan: ఒకేసారి పెట్టుబడి..30 ఏళ్లపాటు నెలకు రూ.87 వేల ఆదాయం, ఎలాగంటే..
ఇక ఈపీఎఫ్ ప్రస్తుతమున్న 8.25 శాతం వడ్డీ రేటుపై మదుపు చేస్తే ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి కొంత వరకూ రక్షించుకోవచ్చు. అయితే, వచ్చే 25 ఏళ్లల్లో కోటి సంపద కూడబెడదామనుకున్న వారు. ఇప్పటి నుంచీ నెలకు రూ.9245 ఈపీఎఫ్‌లో మదపు చేయాల్సి ఉంటుంది. అంతే మీ బేసిక్, డీఏ శాలరీ కనీసం 59 వేలు ఉంటే కానీ ఈ స్థాయిలో మదుపు చేయలేరు.
ఇక స్టాక్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా ద్రవ్యోల్బణంలో కోల్పోయిన దానిని భర్తీ చేసేలా పెట్టుబడులు రాబట్టొచ్చు. ఇండెక్స్ ఫండ్స్ ఇందుకు అనుకూలమైనవి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే పెట్టుబడి సాధనాల్లో బంగారం కూడా ఒకటి. దీంతో, పాటు గోల్డ్ ఈటీఎఫ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో కూడా పెట్టుబడి పెట్టొచ్చు.
ద్రవ్యోల్బణంతో పాటుగా రియల్ ఎస్టేట్ ధరలు కూడా పెరుగుతుంటాయి. కాబట్టి, ఈ రంగంవైపు కూడా దృష్టి సారించాలి. చమురు, వ్యవసాయోత్పత్తులు, ఖనిజాల పెట్టుబడులు కూడా మంచివే. ఇక ప్రభుత్వం జారీ చేసే ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ కూడా మెరుగైన ఫలితాలు ఇస్తాయి. డబ్బునంతా నగదు లేదా ఎఫ్‌డీల రూపంలో కాకుండా ఇతర పెట్టుబడి సాధానాల వైపు మళ్లించాలి. అదే సమయంలో ఇతర ఆదాయా మార్గాలు కూడా వృద్ధి చేసుకునేందుకు ప్రయత్నించాలి. దీంతో, పాటు పొదుపుపై దృష్టి పెడితే ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవడం అంతకష్టమైన పనేమీ కాదని నిపుణులు చెప్పే మాట.