Share News

Major encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ABN , Publish Date - Sep 12 , 2025 | 03:32 AM

ఛత్తీస్‌గఢ్‌‌ రాష్ట్రం మారోసారి కాల్పుల మోతలతో దద్దరిల్లింది. గరియా బంద్‌ జిల్లా అడవుల్లో గురువారం మధ్యాహ్నం జరిగిన..

Major encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌

పది మంది మావోయిస్టుల మృతి

మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు బాలకృష్ణ?

ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లాలోని గణపురం

మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వని పోలీసులు

మరింత మంది మరణించి ఉంటారని అనుమానం

చర్ల/హైదరాబాద్‌/చింతూరు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌‌ రాష్ట్రం మారోసారి కాల్పుల మోతలతో దద్దరిల్లింది. గరియా బంద్‌ జిల్లా అడవుల్లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిసా రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్‌ రీజనల్‌ బ్యూరో కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ (58) అలియాస్‌ భాస్కర్‌ అలియాస్‌ మనోజ్‌తోపాటు ఒడిసా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్‌ అలియాస్‌ పాండు, మరికొందరు కీలక నేతలు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. గరియా బంద్‌ జిల్లా మెయిన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాలుడిగ్గి కొండల్లో మవోయిస్టులు ఉన్నట్లు అక్కడి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ జిల్లాకు చెందిన ఈ30, ఎస్టీఎఫ్‌ కోబ్రా బలగాలు కూబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలు, మావోయిస్టులకు మధ్య 3 గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. అనంతరం ఘటనా స్థలంలో 10 మంది మావోయిస్టుల మృతదేహాలు, ఏకే 47, ఆటోమేటిక్‌ తుపాకులు లభించినట్టు తెలుస్తోంది. చనిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, సెంట్రల్‌ రీజనల్‌ బ్యూరో సభ్యుడు మోడెం బాలకృష్ణ సైతం ఉన్నట్లు గుర్తించారు. ఒడిసా రాష్ట్ర కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలకృష్ణ స్వస్థలం తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా గణపురం. ఆయనపై కోటి రూపాయల రివార్డు ఉందని పోలీసు అధికారులు తెలిపారు. కంధనూల్‌, కలహండీ, బౌధ్‌, నయాగఢ్‌ డివిజన్లలో మంచి పట్టున్న బాలకృష్ణ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని సమాచారం. అయితే, ఇప్పటి వరకు ఎన్‌కౌంటర్‌లో ఎంత మంది చనిపోయారనేది పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో పదుల సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని, కాల్పుల్లో చాలా మంది మృతి చెంది ఉంటారని ఓ జవాను అనధికారికంగా తెలిపారు. గత ఏడాది ఇదే గరియాబంద్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో 26 మంది మావోయిస్టులను కేంద్ర బలగాలు అరెస్టు చేశాయి. అలాగే నారాయణపూర్‌ జిల్లా పోలీసుల ఎదుట 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో బయటపడ్డ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్.. రూ.1000 కోట్ల దోపిడీ

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్

For More TG News And Telugu News

Updated Date - Sep 12 , 2025 | 03:32 AM