Books: ప్రపంచమంతా... పుస్తకాల పండగలే...
ABN , Publish Date - Dec 14 , 2025 | 07:48 AM
కొత్త పుస్తకం ఆవిష్కరించడానికి ఒక వేదిక కావాలి. ప్రముఖ రచయితలు, పబ్లిషర్లను కలుసుకునేందుకు మార్గం కావాలి. సాహిత్య ప్రియులు కోరుకునేది ఇదే. ఇలాంటి వారికోసం ‘బుక్ ఎక్స్‌పో అమెరికా’ స్వాగతం పలుకుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా పుస్తక ప్రదర్శనలను ఏటా ఒకే చోట నిర్వహిస్తుంటారు.
అక్షరానికి ఆదరణ తగ్గట్లేదు... డిజిటల్ యుగంలో కూడా పుస్తకం విజ్ఞాన వెలుగులను పంచుతూనే ఉంది. కావునే పుస్తక ప్రదర్శనలను సందర్శించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. కొన్ని ప్రదర్శనలు కోట్లాది మంది పుస్తక ప్రియులను ఆకర్షిస్తూ పుస్తక ప్రపంచానికి వెలుగులద్దుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ పుస్తక ప్రదర్శనలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... ప్రపంచవ్యాప్తంగా జరిగే బుక్ ఫెయిర్‌లపై ఓ లుక్కేద్దాం...
పుస్తక ప్రపంచానికే మకుటాయమానం
ఆకాశహర్మ్యాలు, విలాసవంతమైన జీవనం ఒకవైపు... పుస్తక ప్రపంచంలో తనదైన ముద్ర ఉండాలనే తపన మరోవైపు. ‘అబుదాబీ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్’లోకి అడుగుపెడితే ఆశ్చర్యపోవాల్సిందే. ఏటా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న అతి పెద్ద పుస్తక ప్రదర్శనలలో ‘అబుదాబీ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్’ ఒకటి. పుస్తక ప్రచురణలో ప్రధాన కేంద్రంగా నిలవాలనే ఉద్దేశంతో ‘అబుదాబీ అఽథారిటీ ఫర్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఇన్ అసోసియేషన్’, ‘ఫ్రాంక్‌ఫర్ట్ బుక్ ఫెయిర్’తో కలిసి ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తోంది. ప్రచురణకర్తలు, రచయితలు, సాంస్కృతిక సంస్థలు... వాటి ఆలోచనలను పంచుకోవడానికి, ప్రచురణ పరిశ్రమకు ఊతం ఇవ్వడం కోసం ఒక వేదికగా ఈ పుస్తక ప్రదర్శన ఉపయోగపడుతోంది.
1981లో మొదటిసారిగా ‘ఇస్లామిక్ బుక్ ఫెయిర్’ పేరుతో నిర్వహించారు. అప్పటి నుంచి ఆదరణ పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు అతి పెద్ద బుక్ ఫెయిర్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రచురణలపై హక్కులు, లైసెన్సింగ్ అమ్మకాలపై చర్చలు, సాంస్కృతిక మార్పిడికి ప్రధాన వేదికగా ఉపయోగపడుతోంది. ఇటీవల జరిగిన బుక్‌ఫెయిర్‌లో 96 దేశాలు, 1400 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఏటా ఒక థీమ్‌తో బుక్‌ఫెయిర్‌ను నిర్వహిస్తారు. ఈ ఏడాది జరిగిన పుస్తక ప్రదర్శనను ‘నాలెడ్జ్ ఇల్యుమినేట్స్ అవర్ కమ్యూనిటీ’ థీమ్‌తో నిర్వహించారు. తదుపరి ఫెయిర్ 2026 ఏప్రిల్ 25 నుంచి మే 4 మధ్య జరగనుంది.
ఒక్కో ఏడాది... ఒక్కోచోట
కొత్త పుస్తకం ఆవిష్కరించడానికి ఒక వేదిక కావాలి. ప్రముఖ రచయితలు, పబ్లిషర్లను కలుసుకునేందుకు మార్గం కావాలి. సాహిత్య ప్రియులు కోరుకునేది ఇదే. ఇలాంటి వారికోసం ‘బుక్ ఎక్స్‌పో అమెరికా’ స్వాగతం పలుకుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా పుస్తక ప్రదర్శనలను ఏటా ఒకే చోట నిర్వహిస్తుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఒక్కో ఏడాది ఒక్కో చోట జరుగుతూ ఉంటుంది. అమెరికాలో జరిగే అతి పెద్ద బుక్ ట్రేడ్ ఈవెంట్ ఇది. 1947లో ‘అమెరికన్ బుక్ సెల్లర్స్ అసోసియేషన్ కన్వెన్షన్ అండ్ ట్రేడ్ షో’ పేరుతో మొదటిసారి బుక్‌ఫెయిర్ నిర్వహించారు. ఏటా మే లేదా జూన్ మొదటి వారంలో నాలుగు రోజుల పాటు నిర్వహిస్తుంటారు. పుస్తక ప్రపంచంలోని ట్రెండ్స్ గురించి నిపుణులు చర్చలు జరుపుతారు. కొత్త పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలు జోరుగా జరుగుతాయి. ఈ బుక్ ఎక్స్‌పో ప్రపంచవ్యాప్తంగా పుస్తకప్రియులను ఆకర్షిస్తుంది. ఇటీవల బుక్ ఎక్స్‌పో అమెరికా స్థానాన్ని బుక్‌కాన్ భర్తీ చేస్తోంది. 2026లో బుక్‌కాన్ ప్రదర్శన ఏప్రిల్ 18 నుంచి 19 తేదీలలో జరగనుంది.

అతి పెద్దది...
నిజానికి పుస్తక ప్రదర్శనకు శతాబ్దాల చరిత్ర ఉంది. 14వ శతాబ్దంలోనే పుస్తక ప్రదర్శన ఏర్పాటైందంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం. జర్మనీలో ‘ఫ్రాంక్‌ఫర్ట్ బుక్ ఫెయిర్’ను 1462లో మొదటిసారి నిర్వహించినట్టు ఆధారాలున్నాయి. ఈ బుక్‌ఫెయిర్‌కు ప్రపంచంలోనే ‘అతి పెద్ద పుస్తక ప్రదర్శన’గా గుర్తింపు ఉంది. ఎక్కువమంది ఎగ్జిబిటర్లు పాల్గొనే పుస్తక ప్రదర్శన కూడా ఇదే. ఏటా అక్టోబర్ నెలలో నిర్వహిస్తుంటారు. గూటెన్‌బర్గ్ మోడ్రన్ బుక్ ప్రింటింగ్‌ను కనుగొన్న తరువాత 1462లో మొదటిసారి బుక్ ఫెయిర్‌ను నిర్వహించారు. తరువాత 1949లో మోడ్రన్ వెర్షన్ ప్రారంభమయింది. అప్పటి నుంచి ఏటా బుక్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నారు. సుమారు వంద దేశాలకు చెందిన 7వేల ఎగ్జిబిటర్లు, లక్షా 70వేల మంది ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి 3 లక్షల మంది పుస్తక ప్రియులు ఈ ప్రదర్శనను సందర్శిస్తున్నారు. 2026 బుక్ ఫెయిర్ అక్టోబర్ 7 నుంచి 11 వరకు జరగనుంది.
ఆసియాలో నంబర్‌వన్
ఆసియాలో అతి పెద్ద పుస్తక ప్రదర్శనగా ‘హాంకాంగ్ బుక్ ఫెయిర్’కు గుర్తింపు ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమైన సాహిత్యాన్ని పుస్తక ప్రియులకు అందించాలన్నది ఈ బుక్ ఫెయిర్ ప్రధాన ఉద్దేశం. 1990లో ప్రారంభమైన ఈ బుక్ ఫెయిర్‌ను కొన్ని లక్షల మంది సందర్శిస్తుంటారు. ‘హాంకాంగ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్’ ఏటా జూలై నెలలో ఈ బుక్‌ఫెయిర్‌ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది జూలైలో జరిగిన బుక్ ఫెయిర్‌కి 9 లక్షల మంది హాజరైనట్టు అంచనా. హాంకాంగ్‌లో జరిగే ప్రధాన ఈవెంట్లలో ఇదొకటి. సందర్శకులు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. వచ్చే ఏడాది జూలై 15 నుంచి 21 వరకు జరగనుంది.
దేశ రాజధానిలో...
భారతదేశంలో రెండో పురాతన పుస్తక ప్రదర్శనగా ‘న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్’కుగుర్తింపు ఉంది. 1972లో మొదటిసారి 200 మంది ఎగ్జిబిటర్లతో ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. ప్రస్తుతం ‘నేషనల్ బుక్ ట్రస్ట్’ న్యూఢిల్లీలోని బుక్ ఫెయిర్‌ను నిర్వహిస్తోంది. ఈ పుస్తక ప్రదర్శనకు ప్రపంచంలోనే అతి పెద్ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ బుక్ ఫెయిర్‌గా ప్రత్యేక గుర్తింపు ఉంది. యూకే, అర్జెంటీనా, స్పెయిన్, ఫ్రాన్స్, టర్కీ వంటి పదుల సంఖ్యలో దేశాలు, వెయ్యికి పైగా పబ్లిషర్లు ఇందులో పాల్గొంటుంటారు. పుస్తకాల హక్కులకు సంబంధించిన చర్చలు ఇక్కడ జరుగుతాయి. రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరిస్తాయి. 2026లో జనవరి 10 నుంచి 18 వరకు పుస్తక ప్రదర్శన జరగనుంది.

పిల్లల కోసం...
పిల్లల పుస్తకాల మార్కెట్ కూడా చిన్నదేం కాదు. కామిక్స్, ఫిక్షన్ అంటూ బోలెడు పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇటలీలోని బోలోగ్నాలో ప్రత్యేకంగా ‘చిల్డ్రన్ బుక్ ఫెయిర్’ను నిర్వహిస్తున్నారు. 1963లో మొదటిసారి ఈ పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఆ ఏడాది 44 మంది ఎగ్జిబిటర్లు మాత్రమే పాల్గొన్నారు. అయితే పెరుగుతున్న ఆదరణతో ప్రస్తుతం 1200 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ప్రతీ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహిస్తుంటారు. పిల్లల కంటెంట్‌కు సంబంధించిన అన్ని రంగాలను అనుసంధానించడానికి ఈ ప్రదర్శన చక్కని వేదికగా ఉపయోగపడుతోంది. కాపీరైట్లను అమ్మడం, కొనుగోలు చేయడం, కొత్త అవకాశాలు, పరిశోధనలకు సంబంధించి చర్చలు జరపడం వంటివన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. 2026 బుక్ ఫెయిర్ ఏప్రిల్ 13 నుంచి 16 వరకు జరగనుంది.
పురాతన పుస్తకాల ప్రదర్శన
అరబిక్ సాహిత్య ప్రపంచంలో ‘కైరో ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్’కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ బుక్ ఫెయిర్‌ను ఈజిప్టులో జరిగే అతి ముఖ్యమైన ఈవెంట్‌గా చెబుతారు. ఏటా ఈ బుక్ ఫెయిర్‌ని 20 లక్షల మందికిపైగా సందర్శిస్తుంటారు. అరబ్ ప్రపంచంలో జరిగే అతి పెద్ద, పురాతన పుస్తక ప్రదర్శన ఇది. మొదటి పుస్తక ప్రదర్శన 1969లో జరిగింది. ఈజిప్టులోని కైరోలో జరుగుతుంది. ఏటా జనవరి చివరి వారంలో నిర్వహిస్తారు. న్యూ కైరోలోని ఈజిప్టు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటరులో జరిగే ఈ ప్రదర్శనను ‘జనరల్ ఈజిప్టియన్ బుక్ ఆర్గనైజేషన్’ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఈవెంట్‌లో 1345 పబ్లిషింగ్ హౌజ్‌లు, సుమారు 80 దేశాలకు చెందిన 6150 ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. 550కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
సందర్శకుల రికార్డు
పాతిక లక్షల మంది ఒక పుస్తక ప్రదర్శనను సందర్శించడమంటే ఒక రికార్డే. ఆ రికార్డును ఎప్పటికప్పుడు తిరగరాస్తుంటుంది ‘ఇంటర్నేషనల్ కోల్‌కతా బుక్‌ఫెయిర్’. ఆసియాలో జరిగే అతి పెద్ద బుక్ ఫెయిర్‌లలో ఒకటిగా దీనికి గుర్తింపు ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించే పుస్తక ప్రదర్శనగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ ప్రదర్శనను సుమారు పాతిక లక్షల మంది సందర్శిస్తుంటారు. ఈ ఏడాది జరిగిన బుక్‌ఫెయిర్‌ను 27 లక్షల మంది సందర్శించారు. 1976లో మొదటిసారి బుక్ ఫెయిర్‌ను నిర్వహించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ‘నాన్ ట్రేడ్ బుక్‌ఫెయిర్’గా గుర్తింపు పొందింది. వచ్చే ఏడాది 49వ బుక్‌ఫెయిర్ జనవరి 22 నుంచి ఫిబ్రవరి 3 మధ్యన ప్రారంభం కానుంది. ఈసారి తొలిసారిగా అర్జెంటీనా పాల్గొంటోంది.
గ్లోబల్ మార్కెట్‌ప్లేస్
‘లండన్ బుక్ ఫెయిర్’... పబ్లిషర్స్, రచయితలు, బుక్ సెల్లర్స్, ఏజెంట్లను ఒక్కచోట చేర్చే పుస్తక ప్రదర్శన ఇది. యూకేలోని ఒలంపియా లండన్‌లో ఏటా మార్చి నెలలో నిర్వహిస్తారు. కొత్త పబ్లికేషన్స్ గురించి చర్చించడం, ఇండస్ట్రీ ట్రెండ్స్‌ని తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. 1971లో ప్రారంభమైన ఈ ప్రదర్శనను ‘స్పెక్స్ 75’ పేరుతో పిలిచేవారు. 1977 నుంచి ‘ది లండన్ బుక్‌ఫెయిర్ 2’గా పిలుస్తున్నారు. 25వేల మంది పబ్లిషర్లు, 845 ఎగ్జిబిషన్ స్టాండ్లు, వెయ్యి మంది ఎగ్జిబిటర్లతో ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా గృహ రుణం రావటం లేదా
Read Latest Telangana News and National News