ఎల్లలు దాటి నోరూరిస్తున్నాయి...
ABN , Publish Date - Aug 10 , 2025 | 07:56 AM
చాక్లెట్‌ను చూడగానే పిల్లలకే కాదు... పెద్దలకూ నోరూరుతుంది. అయితే నిన్నటి దాకా చాక్లెట్లు తియ్యగా ఉంటాయనే తెలుసు. కానీ ‘జనరేషన్ జెడ్’ చాక్లెట్లు లుక్‌లోనే కాదు... రుచిలోనూ అనేక మార్పులతో ఆకర్షిస్తున్నాయి.
చాక్లెట్‌ను చూడగానే పిల్లలకే కాదు... పెద్దలకూ నోరూరుతుంది. అయితే నిన్నటి దాకా చాక్లెట్లు తియ్యగా ఉంటాయనే తెలుసు. కానీ ‘జనరేషన్ జెడ్’ చాక్లెట్లు లుక్‌లోనే కాదు... రుచిలోనూ అనేక మార్పులతో ఆకర్షిస్తున్నాయి. ఎవరూ ఊహించని సరికొత్త రుచుల్లో కొత్తతరం చాక్లెట్లు విదేశాల నుంచి వచ్చేశాయి. వాటిని పిల్లలతో పాటు పెద్దలు కూడా తెగ ఇష్టపడుతున్నారు. రంగూ, రుచీ మారిన ఈ ట్రెండీ చాక్లెట్లపై ఓ లుక్కేద్దాం...
కొంచెం కారం...
చాక్లెట్ వెరైటీలు కావాలంటే మెక్సికోకు వెళ్లాల్సిందే. ప్రాచీన మాయన్ల నాగరికత స్ఫూర్తితో కొంగొత్త చాక్లెట్లను అక్కడ తయారుచేస్తున్నారు. గాఢమైన పరిమళం ఉన్న కొకో, ఘాటైన మెక్సికన్ మిర్చి, విశేష సుగంధ ద్రవ్యాల కలయికతో కొత్తగా ‘చిల్లీ’ చాక్లెట్లను సృష్టించారు. ‘స్పైసీ చాక్లెట్లు’గా ఇవి పేరు తెచ్చుకున్నాయి. మెక్సికన్ చిల్లి చాక్లెట్లు రకరకాల బార్లుగా లభిస్తున్నాయి. ఇంకా వేడి వేడి ద్రవంగా కూడా ఈ చాక్లెట్ ప్రసిద్ధి చెందింది. ఇవి మనదేశంలోకీ ప్రవేశించాయి. పేరుకు తగినట్టే ఇవి కాస్త కారంగా ఉంటాయి. ఇదే రెసిపీతో చాక్లెట్ సాస్‌లు, టఫుల్స్, క్యాండీ... ఇలా వెరైటీలు వచ్చేశాయి. తీపికి దూరంగా ఉండాలనుకునే వారు లేదా వెరైటీ చాక్లెట్లు తినాలనే సరదా ఉన్నవాళ్లు వీటిని ఎంజాయ్ చేస్తున్నారు.

చిన్న దేశమే కానీ...
‘లగ్జంబర్గ్’ చాలా చిన్న దేశం. కానీ చాక్లెట్లు తినడంలో ప్రపంచంలోనే నెంబర్‌వన్ దేశం. అక్కడ ఒక వ్యక్తి రోజుకి సగటున 27 గ్రాముల చాక్లెట్లు ఆరగిస్తున్నాడట. అంటే ఒక్కొక్కరు ఏడాదికి సుమారు 10 కిలోల చాక్లెట్లు లాగించేస్తున్నారు. వీళ్లు తింటోన్న చాక్లెట్లలో మిల్క్, డార్క్... ఇలా అన్నీ ఉన్నాయి. పొరుగు దేశాలైన బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న ప్రీమియం చాక్లెట్లు కూడా ఉండడం విశేషం. ఇక రెండో స్థానం ఐస్‌లాండ్‌ది. ఈ దేశంలో రోజూ ఒక్కొక్కరు 20 గ్రాముల చాక్లెట్లు ఆరగిస్తున్నారు. ఇక్కడ అతిశీతల ఉష్ణోగ్రతే దీనికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు.

హస్తకళా నైపుణ్యం
ఐస్‌లాండ్‌లో శీతోష్ణస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. ‘ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్’గా ఈ దేశాన్ని పేర్కొంటారు. అటు మంచు, ఇటు అగ్నిపర్వతాలు అన్నమాట. అందుకే మిగతా ప్రపంచంతో కాస్త దూరంగా ఉన్నట్టుగా ఉంటుంది వారి జీవనం. ప్రతీ పనినీ చాలా శ్రద్ధగా చేయడం వాళ్లకి అలవాటు. వారి హస్తకళా నైపుణ్యానికి చిహ్నంగా చాక్లెట్ తయారీని పేర్కొనవచ్చు. చాక్లెట్ల తయారీలో స్థానికంగా, తాజాగా లభించే పాలు, క్రీము, ద్రవ్యాలనే వాడతారు. అక్కడి చాక్లెట్లలో తప్పకుండా ఉండే పదార్థం లైకోరిస్. దీన్నే ‘ములేతీ’గా పిలుస్తారు. ఈ మొక్క వేర్లు అతిమధురంగా ఉంటాయి. ఈ వేర్లను ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో వాడుతున్నారు. ఈ తీయని వేర్లు, డార్క్ చాక్లెట్ల సమ్మేళనం వల్ల వచ్చే చాక్లెట్ల రుచి అద్భుతం. అయితే ఇవి చాలా తీయగా ఉంటాయి. ఇటీవల కాస్త సీసాల్ట్‌ను చేర్చి ఆ తీపిని తగ్గిస్తూ సరికొత్త చాక్లెట్లను రూపొందిస్తున్నారు. లిమిటెడ్ ఎడిషన్‌లాగా ఇవి లభిస్తున్నాయి.

పులుపే కీలకం...
చాక్లెట్ అంటేనే తియ్యదనం. అదే ట్రేడ్ మార్క్ కానీ, సర్వత్రా పెరుగుతోన్న ఆరోగ్య స్పృహ వల్ల ఈ రుచుల్లో కాస్త మార్పులు వస్తున్నాయి. తీపి తక్కువగా ఉండే డార్క్ చాక్లెట్ ఇలాంటిదే. జపాన్‌కు చెందిన మాచ్చా, యుజు చాక్లెట్లు ఓ ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. గ్రీన్ టీ సువాసన, చిక్కదనంతో ‘మాచ్చా’ చాక్లెట్ రుచి అదుర్స్ అంటున్నారంతా. ఇక సృజనాత్మకమైనదిగా పేరుతెచ్చుకున్న ‘యుజు’ చాక్లెట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిమ్మజాతికి చెందిన పండు యుజు. చిక్కటి పసుపు రంగుతో, చక్కటి పరిమళంతో ఓ రకమైన పులుపు రుచితో ఉండే యుజు పండును చాక్లెట్ల తయారీలో వినియోగిస్తూ... ప్రపంచ దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు జపనీయులు. అనాదిగా అక్కడి వంటకాలలో యుజును వాడడం మామూలే. వెనిగర్లు, డెజర్టుల్లో యుజు ఉండాల్సిందే. ఇదే ఫార్ములా చాక్లెట్లలో వాడి క్లిక్ అయ్యారు. కొకో బటర్, చక్కెర, యుజుల మేలుకలయికలో సరికొత్త చాక్లెట్లని రూపొందిస్తున్నారు. ముఖ్యంగా డార్క్, మిల్క్, వైట్ చాక్లెట్లలో యుజు పండును మిళితం చేయడం వల్ల వాటి రుచి పూర్తిగా మారిపోయింది. మన దేశంలో కూడా ‘యుజు’ చాక్లెట్లకు గిరాకీ పెరుగుతోంది.

రకరకాల ‘టాపింగ్స్’...
ఐస్‌క్రీమ్‌ల రుచిని మరింత ఆస్వాదించేందుకు రకరకాల టాపింగ్స్‌తో తినడం మామూలే. ఇప్పుడు చాక్లెట్ల తయారీలో ఇదే ఫార్ములా వాడుతున్నారు. చాక్లెట్లలో ఎక్కువగా ఉపయోగిస్తున్న టాపింగ్స్ ఇవి...
తాజా పళ్లు: స్ట్రాబెర్రీ, రాస్‌బెర్రీ, నిమ్మ మొదలైన వాటి వల్ల చాక్లెట్ల రుచి తీపి, పులుపుల మిశ్రమమైన కొత్త రుచి వస్తోంది.
నట్స్: నేటితరం కరకరలాడే రుచులను ఇష్టపడుతోంది. అందుకే ఆల్మండ్స్, హజెల్‌నట్స్ లాంటివి చేర్చి చాక్లెట్లు క్రంచీలా ఉండేలా చేస్తున్నారు తయారీదారులు.
స్పైసెస్: యాలకులు, దాల్చినచెక్క, ఎండు మిర్చి... వినడానికే కొత్తగా అనిపిస్తున్నా నేడు చాక్లెట్లలో వీటి వినియోగం బాగా పెరిగింది. ప్రత్యేక రుచి కోసం: సీసాల్ట్, ఛీజ్, సోయ్ సాస్, మిసో లాంటివి కలిపి రుచులలో ప్రత్యేకతను తెస్తున్నారు.
సృజనాత్మకంగా...
ప్రపంచ చాక్లెట్ రంగంలో ఇటలీకి ప్రత్యేక స్థానం ఉంది. అత్యుత్తమ చాక్లెట్ తయారీదారుల్లో ముగ్గురు ఈ దేశం వాళ్లే. యూరప్‌కు కొకో పరిచయమైన 16వ శతాబ్దం నుంచే ఇటలీలో చాక్లెట్ల చరిత్ర మొదలైంది. ఇటాలియన్ చాక్లెట్ రంగాన్ని సృజనాత్మకతకు మారుపేరుగా చెప్పాలి. డార్క్ చాక్లెట్ ప్రియులకు 60 శాతం నుంచి 90 శాతం వగరున్న అనేక రకాల చాక్లెట్లు ఈ దేశంలో లభిస్తున్నాయి. అనేక మూలికలు, పళ్లు, సుగంధ ద్రవ్యాలను చేర్చి ఇక్కడ కొంగొత్త చాక్లెట్లను తయారుచేస్తారు. విశ్వవిఖ్యాత ‘ఫెరారో రోచర్’ చాక్లెట్లు అందరికీ పరిచయమే. ‘హజెల్‌నట్’ను పొరలు పొరలుగా పేరుస్తూ రూపొందించిన ఈ చాక్లెట్లు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ‘పెరుగినా’, ‘వెంచి’... ఇలా ఏ బ్రాండ్ చాక్లెట్లు తీసుకున్నా అందులో చక్కని హజల్‌నట్స్‌ను వినియోగించి, ప్రత్యేక రుచులను తయారుచేసి, చాక్లెట్ ప్రియులకు అందిస్తున్నారు.