Manual Vs Automatic: ఆటోమేటిక్ లేదా మాన్యువల్ గేర్ కారు కొనాలా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:02 PM
మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్న కారు కొనాలా లేదా ఆటోమేటిక్ కారు కొనాలా అని ఆలోచిస్తున్నారా? ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: మాన్యువల్ గేర్స్ ఉన్న కారు కొనాలా లేక ఆటోమేటిక్ వాహనం కొనాలా అని చాలా మంది తికమక పడుతుంటారు. అయితే, ఈ విషయంపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో, మన అవసరాలకు తగినట్టు కారును ఎలా ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆటోమేటిక్ కార్లలో ప్రతికూలతలు
మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (గేర్లు) ఉన్న కార్లతో పోలిస్తే వీటి ఖరీదు ఎక్కువ. ఆటోమేటిక్ కార్లలో గేర్ వ్యవస్థ సంక్లిషంగా ఉంటుంది. కాబట్టి రిపేర్ల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఆటోమేటిక్ కార్ల మైలేజీకి కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. గేర్ల మార్పుపై డ్రైవర్ నియంత్రణ ఉండదు కాబట్టి స్పోర్టీ ఫీల్ కోరుకునే వారు కాస్త నిరాశ చెందే అవకాశం ఉంది.
ఆటోమేటిక్ కార్లలో సానుకూలతలు
ఈ కార్లు నడపడం చాలా సులభం. గేర్లు వాటంతట అవే మారుతాయి కాబట్టి డ్రైవర్‌కు శ్రమ తగ్గి సుదీర్ఘ ప్రయాణాల సమయంలో అలసట అంత ఎక్కువగా ఉండదు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఆటోమెటిక్ కార్లు తగినవి. గేర్ల మార్పు దానంతట అదే సున్నితంగా జరిగిపోతుంది కాబట్టి జర్నీలో కుదుపులు కూడా తక్కువగా ఉంటాయి. ప్రయాణానుభవం మెరుగ్గా ఉంటుంది.
మాన్యువల్ కార్లలో ప్రతికూలతలు
డ్రైవర్‌లు ప్రతిసారీ క్లచ్‌ను కాలితో ఒత్తుతూ గేర్లు మార్చాల్సి ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఇది బడలికను పెంచుతుంది. కొత్త వారికి మాన్యువల్ గేర్ కారును నడపడం కొంత కష్టంగా అనిపిస్తుంది. క్లచ్, బ్రేకులు, యాక్సెరేటర్ మధ్య సమన్వయం సాధించేందుకు కొంత సమయం పడుతుంది. క్లచ్ విషయంలో ఏమరపాటుగా ఉంటే వాహనం సడెన్‌గా ఆగిపోయే అవకాశం ఉంటుంది.
మాన్యువల్ కార్లలో సానుకూలతలు
ఈ కార్ల ప్రారంభ మోడల్స్ ధర ఆటోమేటిక్ వాటితో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఈ కార్లు మైలేజీ ఎక్కువ. గేర్ల మార్పుపై డ్రైవర్‌కు ఎక్కువ నియంత్రణ ఉండటంతో రోడ్లు సరిగా లేని సందర్భాల్లో ప్రయాణం మరింత ఈజీ అవుతుంది. మాన్యువల్ గేర్ వ్యవస్థ నిర్మాణం సింపుల్‌గా ఉంటుంది కాబట్టి రిపేరింగ్ ఖర్చులు అంత భారం కావు. కారు నడిపేటప్పుడు గేర్లు మార్చడాన్ని ఎంజాయ్ చేసే వారికి ఈ కార్లు అత్యంత అనుకూలమైనవి. కాబట్టి, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కార్లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి:
భారత్‌కు వచ్చి తప్పు చేశా.. లైఫ్ దిగజారుతోంది.. టెకీ ఆవేదన
పుతిన్ అంటే ఇదీ.. ఈ అమెరికా వ్యక్తికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూస్తే