Italian photographer: ఆమెది.. రంగురంగుల చంద్రలోకం..!
ABN , Publish Date - Dec 07 , 2025 | 08:49 AM
మార్చెల్ల గియులియాపేస్.. ఇటలీ దేశస్థురాలు. ఒకప్పుడు మాఫియా రాజ్యానికి పెట్టింది పేరయిన ‘సిసిలీ’లోని రగుస ద్వీపంలో పుట్టిందామె. వాళ్ల అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో సిసిలీ తుపాకుల మోతతో హింసాత్మకంగా ఉండేది. మాఫియా ముఠాలు కొట్టుకుచచ్చేవి.
‘48 మూన్స్’ పేరుతో అన్నేసి చంద్రుల ఫొటోలు తీయడానికి పదేళ్లు పట్టిందంటే ఆమె అంకితభావాన్ని అద్భుతం అనక తప్పదు. ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ మార్చెల్ల గియులియాపేస్ ఆ అద్భుతమైన పనిచేసి ప్రపంచాన్ని ఆకర్షించింది..
‘‘అమ్మా.. మనం చందమామపైకి వెళ్లొచ్చా? వెళితే చల్లగా ఉంటుందా? వేడిగా ఉంటుందా? ఇక్కడి నుంచి ఎంత దూరం?’’ అంటూ ముద్దుముద్దుగా తల్లిని అడిగింది మార్చెల్ల గియులియాపేస్. ‘‘చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. సూర్యుని కాంతి పరావర్తనం వల్ల మనకు వెలుగునిస్తున్నాడు. భూమిపైలాగే చంద్రునిపైన కూడా పెద్ద పెద్ద పర్వతాలు, లోయలు, ధూళి, దుమ్ము ఉంటాయి. దూరం నుంచి చూసినప్పుడు మాత్రమే మనకు వెలుగు లీనుతూ కనిపిస్తాడు చంద్రుడు..’’ అంటూ ఆమె తల్లి వివరంగా చెప్పింది. ఇలా ఒకరోజు రెండు రోజులు కాదు.. చిన్నప్పటి నుంచీ పాఠ శాల విద్య పూర్తయ్యే వరకు చంద్రునిపై వేల ప్రశ్నలు సంధించేది మార్చెల్ల. ఆమెకు చంద మామ అంటే ప్రాణం. పున్నమి వచ్చినప్పుడు కొండలపైకెక్కి ఆకాశం వైపు చూడటం.. బొమ్మలు గీయడం, పెయింటింగ్ వేయడం.. ఇంటర్‌నెట్, పుస్తకాల్లో చంద్రుని గురించి సమాచారాన్ని చదువుకోవడంతోనే సరిపోయేది.
నేరప్రాంతంలో పుట్టి..
మార్చెల్ల గియులియాపేస్.. ఇటలీ దేశస్థురాలు. ఒకప్పుడు మాఫియా రాజ్యానికి పెట్టింది పేరయిన ‘సిసిలీ’లోని రగుస ద్వీపంలో పుట్టిందామె. వాళ్ల అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో సిసిలీ తుపాకుల మోతతో హింసాత్మకంగా ఉండేది. మాఫియా ముఠాలు కొట్టుకుచచ్చేవి. అలాంటి నేరభూమిలో అతిసున్నిత హృదయంతో పెరిగింది మార్చెల్ల. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయనిగా పనిచేసింది. స్పందించే మనస్తత్వం ఉండటంతో .. ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకతను చాటుకునేది. అత్యాధునిక బోధనా పద్ధతులు, సృజనాత్మకతతో పాఠాలు చెప్పేది.
అందుకని ఇన్నొవేటివ్ టీచింగ్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందింది. బోలెడన్ని అవార్డులు కూడా వచ్చాయి. బతుకు దెరువు కోసం ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది కానీ.. మనసంతా రాత్రిళ్లు ఆకాశంలో మెరిసే జాబిల్లి తనను కవ్విస్తూనే ఉంది. అమ్మ చెప్పిన చందమామ కబుర్లు.. చదివిన విషయాలు.. పదేపదే గుర్తుకొచ్చేవి. ‘‘చంద్రునిపై తనకున్న ప్రేమను ప్రపంచానికి అత్యంత కొత్తగా చెప్పాలి!’’ అనుకుంది. చిన్న కెమెరాతో ఫొటోగ్రఫీలోకి ప్రవేశించిందామె. తన చుట్టూ కనిపించే వివిధ రకాల దృశ్యాలను కెమెరాలో బంధించింది. కొన్ని ఫొటోలు బాగున్నాయి.. ఇంకొన్ని తనకే నచ్చలేదు. ఫొటోగ్రఫీలో ప్రొఫెషనల్‌గా ఎదగడానికి మెళకువలు నేర్చుకుంది.

ప్రకృతే నేర్పింది..
సిసిలీ.. భౌగోళికంగా వైవిధ్యమైన ప్రాంతం. రెండు ప్రధాన లోయల మధ్య ఏర్పడ్డ లైమ్‌స్టోన్స్‌తో అందమైన ప్రదేశంగా పర్యాటక గుర్తింపు పొందింది. దాంతో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా పేరుతెచ్చుకుంది. హిల్‌సిటీగానూ ప్రాచుర్యం పొందింది. ఫొటోగ్రఫీకి ఇంత వైవిధ్యభరిత ప్రాంతం మరొకటి ఉండదని భావించిన మార్చెల్ల రకరకాల ఫొటోలు తీసి అంతర్జాతీయ పత్రికలకు పంపింది. చాలామందికి నచ్చాయి ఫొటోలు. చూస్తుండగానే బాగా పేరొచ్చింది. ఖగోళ పత్రికల్లో ఫొటోలు అచ్చయ్యాయి.
ఇక, అప్పటి నుంచీ ఫొటోగ్రఫీపైన తనకు పట్టు వచ్చింది. అత్యంత శక్తిమంతమైన లెన్స్ కలిగిన కెమెరాలతో చంద్రునిపైకి దృష్టి మళ్లించిందామె. ప్రతిరోజూ రాత్రిపూట ఆకాశంలోకి చంద్రుడు రాగానే కెమెరాతో క్లిక్ క్లిక్‌మంటూ వందల ఫొటోలు తీసేది. అలా నెలలు, సంవత్సరాలు తీస్తూనే ఉంది. ఆమె కంప్యూటర్‌లో వేల ఫొటోలు నిక్షిప్తం అయ్యాయి. భూవాతావరణం రకరకాలుగా ఉంటుంది. ఆ ప్రభావం చంద్రునిపై పడుతుంది. అందుకే కొన్ని యుగాలుగా ఉన్న చంద్రుడు.. ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తాడు.
మార్చెల్ల కష్టపడి పదేళ్లపాటు శ్రమించి జాబిల్లి ఫొటోలు తీసింది. అందులోని 48 పున్నమిచంద్రుల చిత్రాలను ఎంపికచేసి విడుదల చేసింది. ‘48 ఫుల్‌మూన్స్’ పేరుతో అన్నేసి రంగురంగుల నిండుపున్నమి వెన్నెల చిత్రాలు అద్భుతం అనిపించాయి. ఇలాకూడా చంద్రుని ఫొటోలు తీయొచ్చా అనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఆమె మూన్ ఫొటోలకు ఫిదా అయ్యారు. ‘శభాష్ మార్చెల్ల.. నీకంటే బాగా ఇంకెవ్వరూ చంద్రున్ని ప్రేమించలేరు అని నిరూపించావు’’ అంటూ శ్రేయోభిలాషులు అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
Read Latest Telangana News and National News