Share News

Food for Ear Health: చెవి సమస్యలా? ఇవి తింటే వినికిడి సూపర్!

ABN , Publish Date - Dec 31 , 2025 | 09:54 PM

మంచి ఆరోగ్యానికి.. మంచి పోషకాలు ఉన్న ఆహారాలు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అలాగే చెవి ఆరోగ్యానికి కూడా కొన్ని ఆహారాలు మేలు చేస్తాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Food for Ear Health: చెవి సమస్యలా? ఇవి తింటే వినికిడి సూపర్!
Ear health foods

చెవులు.. మన శరీరంలోని అత్యంత సున్నితమైన, ముఖ్యమైన అవయవాలలో ఒకటి. మన దైనందిన జీవితానికి మంచి వినికిడి చాలా ముఖ్యం. అయితే, చాలా మంది చెవి ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపరు. వాస్తవానికి మంచి ఆహారం.. మన చెవి లోపల ఉన్న సున్నితమైన కణాలు, నరాలు, రక్త నాళాలను నేరుగా ప్రభావిస్తాయట. కానీ, చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు. వినికిడి సమస్యలు వచ్చిన తరువాత ఆస్పత్రులకు పరుగెడుతుంటారు. మరి చెవి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


ఒమేగా-3, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు వినికిడి లోపం, టిన్నిటస్ (చెవుల్లో మోగడం), ఇన్‌ఫెక్షన్స్ సమస్యల నుంచి రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 6 ఆహార పదార్థాలు సహాయపడుతాయని చెబుతున్నారు. అవి ఏంటో చూద్దాం.

1. సాల్మన్:

వయస్సు సంబంధిత వినికిడి లోపం నుండి రక్షణ కల్పిస్తుంది. సాల్మన్ చేపలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకం లోపలి చెవిలోని కోక్లియా (వినికిడి అవయవం) కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ఒమేగా-3 వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. లోపలి చెవి కణాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా వయస్సు సంబంధిత వినికిడి లోపం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


2. నారింజ:

లోపలి చెవి ఇన్‌ఫెక్షన్స్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది. నారింజ పండ్లలో విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. చెవి ఇన్‌ఫెక్షన్స్‌ను నివారించడంలో సహాయపడుతాయి. వాస్తవానికి చెవి ఇన్‌ఫెక్షన్స్ వినిడికి సమస్యను రెట్టింపు చేస్తాయి. విటమిన్ సి సున్నితమైన శ్రవణ నరాలలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా వినిడికి సమస్యలను తగ్గిస్తుంది.

3. పాలకూర:

శబ్దం వల్ల కలిగే వినికిడి నష్టం నుండి రక్షణ కల్పిస్తుంది. పాలకూరలో ఫోలేట్ (విటమిన్ B9) పుష్కలంగా ఉంటుంది. ఇది లోపలి చెవిలో ఆరోగ్యకరమైన రక్త ప్రసరణకు అవసరం. ఫోలేట్ లోపం వినికిడి లోపంతో ముడిపడి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. తగినంత ఫోలేట్ కంటెంట్ పెద్ద శబ్దాల వల్ల కలిగే నష్టం నుండి చెవులు కోలుకోవడానికి సహాయపడుతుంది.


4. వాల్‌నట్స్:

పెద్ద శబ్దాల నుండి చెవి కణాలను రక్షిస్తాయి. వాల్‌నట్స్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది చెవి లోపల ఉన్న చిన్న కణాలను పెద్ద శబ్దాల వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం శ్రవణ నరాలకు స్థిరమైన రక్త ప్రసరణ కొనసాగడానికి సహాయపడుతుంది. ఇది టిన్నిటస్ (చెవుల్లో మోగడం) ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. అరటిపండు:

లోపలి చెవి ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. అరటిపండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. లోపలి చెవి లోపల ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. సరైన పొటాషియం స్థాయిలు నరాల సంకేతాల ప్రసారానికి మద్దతు ఇస్తాయి. లోపలి చెవి ద్రవ అసమతుల్యతకు సంబంధించిన మైకము, సమతుల్య సమస్యలను తగ్గిస్తాయి.


6. డార్క్ చాక్లెట్:

టిన్నిటస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్‌లో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుం. చెవి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. జింక్ లోపం వల్ల చెవుల్లో శబ్దం (టిన్నిటస్) వస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. డార్క్ చాక్లెట్‌ను మితంగా తీసుకోవడం వల్ల చెవి ఆరోగ్యానికి సహాయపడుతుంది.

మన చెవుల ఆరోగ్యానికి సరైన పోషకాహారం చాలా అవసరం. అందులోనూ సాల్మన్, నారింజ, పాలకూర, వాల్‌నట్స్, అరటిపండ్లు, డార్క్ చాక్లెట్ వంటి ఆహారాలు వినికిడి లోపం, ఇన్‌ఫెక్షన్స్, టిన్నిటస్‌ను నివారించడంలో సహాయపడతాయి.


Also Read:

Picture Puzzle: మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి

New Year Celebrations: విజయవాడలో న్యూఇయర్ జోష్..

Saifullla Kasuri: కశ్మీర్‌పై వెనక్కి తగ్గం.. భారత్‌కు పహల్గాం సూత్రధారి సైఫుల్లా కసూరి వార్నింగ్

Updated Date - Dec 31 , 2025 | 09:54 PM