Share News

Quick Weight Loss: అందం కోసం మరీ ఇంతకి తెగిస్తున్నారా?

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:13 PM

నాజూకు గా కనిపించాలనుకోవడం ఓకే. అయితే, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మాత్రం కాదు. ఇప్పుడు తమ బరువును తగ్గించుకునేందుకు కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఆ క్రమంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల్ని..

Quick Weight Loss: అందం కోసం మరీ ఇంతకి తెగిస్తున్నారా?
Quick Weight Loss

ఇంటర్నెట్ డెస్క్: నాజూకు గా కనిపించాలనుకోవడం మంచిదే. అయితే, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మాత్రం కాదు. ఇప్పుడు తమ బరువును తగ్గించుకునేందుకు కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఆ క్రమంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల్ని కూడా లెక్కచేయడం లేదు. ఇటీవలి కాలంలో కొందరు తమ బరువు తగ్గడానికి మౌంజారో, వెగోవీ అనే షుగర్ పేషెంట్లు వాడే మధుమేహ మందుల్ని దుర్వినియోగ పరుస్తున్నారు.

ఇది ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని భారతీయ వైద్యులు హెచ్చరిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం ట్రీట్మెంట్ కోసం ఉద్దేశించిన మందుల్ని నాజూకుగా మారడం కోసం ఉపయోగించడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఇది.. వాంతులు, అలసట, జీర్ణాశయ సమస్యలు వంటి తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇటీవల అనేక సోషల్ మీడియాలో ప్లాట్‌ఫారమ్‌లు ఈ ఇంజెక్షన్‌లను బరువు తగ్గడానికి సత్వర పరిష్కారాలుగా చూపించే పోస్ట్‌లతో నిండి ఉన్నాయని, దీంతో డయాబెటిక్‌కాని వ్యక్తులు కూడా ఈ మందుల్ని వాడేస్తున్నారని చెబుతున్నారు.

ఇలాంటి ఉదంతమే ఇటీవల ముంబైలో వెలుగుచూసింది. 45 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ తరచుగా వాంతులు, తీవ్ర అలసటతో బాధపడుతున్నారు. ఆమె ఎయిర్ హోస్టెస్ కావడంతో వృత్తి రిత్యా డే అండ్ నైట్ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఈ పని గంటలే ఆమె ఇబ్బందులకు కారణమని అన్నారు. అయితే, వాంతులు, అలసట తగ్గకపోవడంతో ఆమె ముంబైలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో చెక్ చేయించుకుంది. అక్కడ చేసిన వైద్య పరీక్షల్లో అసలు కారణం వెల్లడైంది. డయాబెటిస్ పేషెంట్లు బరువు తగ్గడానికి ఉద్దేశించిన శక్తివంతమైన మందు అయిన టిర్జెపటైడ్‌ను ఏ వైద్యుడి సూచన లేకుండా సదరు ఎయిర్ హోస్టెస్ స్వయంగా ఇంజెక్ట్ చేసుకుందని నిర్ధారణ అయింది.


అయితే, ఆమె వాదన వేరుగా ఉంది. తన ప్రీ-డయాబెటిస్, అధిక బరువు సమస్యల గురించి విదేశీ డాక్టర్ ని సంప్రదించిన సమయంలో ఆ డాక్టర్ తనకు ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని, తాను ఇప్పటికీ అవే మందుల్ని వాడుతున్నానని చెప్పుకొచ్చింది.

గురుగ్రామ్‌లోని CK బిర్లా హాస్పిటల్‌లో బారియాట్రిక్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ మయాంక్ మదన్ కూడా ఈ తరహా ఘటనల గురించి స్పందించారు. ప్రతి నెలా తాను 40 నుంచి 50 వరకూ ఇలాంటి కేసులు చూస్తున్నానని చెప్పారు. 'ఒక బేరియాట్రిక్, జీర్ణాశయ సర్జన్‌గా నేను, వేగంగా బరువు తగ్గడానికి వెగోవీ లేదా మౌంజారో వంటి మందులతో స్వంత వైద్యం చేసుకుంటున్నరోగులను ఎక్కువగా చూస్తున్నా' అని అన్నారు.

దీనివల్ల దీర్ఘకాలిక వాంతులు, యాసిడ్ రిఫ్లక్స్, తీవ్రమైన మలబద్ధకం లేదా విరేచనాలు, పోషక లోపాలు, పిత్తాశయ రాళ్లు, ప్యాంక్రియాటైటిస్ వంటి అరుదైన రోగాలు కూడా ఈ మందుల వాడకం వల్ల సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దొంగ డెత్‌ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 05:34 PM