Bridal Glasses Trend: కళ్లజోడుతోనే.. పెళ్లికళ తీసుకొస్తున్నారు
ABN , Publish Date - Nov 30 , 2025 | 09:42 AM
పెళ్లి కుదరగానే... ఏ చీర కట్టుకోవాలి? ఏ నగ వేసుకోవాలి? మేకప్ ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ వధువును ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కళ్లజోడు ధరించే వధువులకు ఈ ఆందోళన, ఒత్తిడి కాస్త రెట్టింపవుతుంది. కళ్లజోడుతోనే ఉండాలా? లెన్స్ పెట్టుకోవాలా? అని సందిగ్ధంలో పడిపోతారు. అయితే క్రమక్రమంగా పరిస్థితులు మారుతున్నాయి.
- కళ్లజోడు... పెళ్లికళ
పెళ్లి అనగానే మంటపం, డెకరేషన్, ఫొటోలు, వీడియోలు, భోజనాలే కాదు... వధూవరుల దుస్తుల దగ్గరి నుంచి ఆభరణాలు, మేకప్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఒకవేళ అమ్మాయికో, అబ్బాయికో కళ్లజోడు ఉంటే ఎలా? గతంలో వేదిక మీదున్న ఆ కాసేపు తీసేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కళ్లజోడుతోనే పెళ్లికళ తీసుకొస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.
సాధారణంగా కళ్లజోడు ధరించిన అమ్మాయిలు చాలామంది కనిపిస్తారు. అయితే ఒక్క పెళ్లి కూతురు కూడా కళ్లజోడుతో పెళ్లిపీటలపై కూర్చోదు. కుటుంబసభ్యుల దగ్గరి నుంచి మేకప్ ఆర్టిస్టు వరకు అందరూ కళ్లజోడు తీసేసి లెన్స్ పెట్టుకొమ్మని సలహా ఇస్తారు. ఆ ధోరణి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ తరం వధువులు.
పెళ్లి కుదరగానే... ఏ చీర కట్టుకోవాలి? ఏ నగ వేసుకోవాలి? మేకప్ ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ వధువును ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కళ్లజోడు ధరించే వధువులకు ఈ ఆందోళన, ఒత్తిడి కాస్త రెట్టింపవుతుంది. కళ్లజోడుతోనే ఉండాలా? లెన్స్ పెట్టుకోవాలా? అని సందిగ్ధంలో పడిపోతారు.
అయితే క్రమక్రమంగా పరిస్థితులు మారుతున్నాయి. వధువు ప్రతీరోజూ ఎలా ఉంటుందో, పెళ్లి వేడుకలోనూ అలానే ఉండాలని కోరుకుంటోంది. కాకపోతే ఈతరం వధువులు కాస్త ఫ్యాషన్‌గా ఉండే కళ్లజోడును ఎంచుకుని, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ప్రతీ యువతి తన పెళ్లిరోజున ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటుంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈతరం అమ్మాయి తను రోజు ఎలా ఉంటుందో, పెళ్లిరోజున కూడా అలాగే ఉండాలని కోరుకుంటోంది. కొన్నేళ్లుగా తనలో భాగంగా ఉన్న కళ్లజోడును పెళ్లిరోజున ఎందుకు పక్కన పెట్టాలని అనుకుంటోంది. అందుకే నిండైన ఆత్మవిశ్వాసంతో కళ్లజోడుతోనే పెళ్లి పీటలపై కూర్చుంటోంది. అదే స్టయిల్‌గా మారిందిప్పుడు.

మ్యాచ్ అయ్యేలా ...
చీరకు నప్పే గాజులు, ఆభరణాలు మాత్రమే కాదు. కళ్లజోడును కూడా ఎంపిక చేసుకుంటున్నారు. పెళ్లికూతురు కళ్లజోడు ధరించడం ఇప్పుడు ఫ్యాషన్ కూడా. గతంలో కళ్లజోడు ఉన్న విషయం తెలియకుండా పెళ్లి వేడుకలో లెన్స్‌లు ఉపయోగించి మ్యానేజ్ చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో వధూవరుల దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. కళ్లజోడు పెట్టుకునే విషయాన్ని ఎందుకు దాయాలి? అని అంటున్నారు. చలువ కళ్లద్దాలు ధరించడం ఫ్యాషన్ అయినప్పుడు... ప్రతీరోజూ పెట్టుకునే అద్దాలు కూడా ఫ్యాషనే అంటోందీ తరం.
పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్న సమయంలో మేకప్ ఆర్టిస్టు, బంధువులు ‘అద్దాలు తీసి, లెన్స్ పెట్టుకుని రమ్మ’ని అంటున్నా అమ్మాయిలు ఆ మాటలు పట్టించుకోవడం లేదు. ‘అద్దాలు వెడ్డింగ్ లుక్‌లో భాగమ’ని అంటున్నారు. ‘‘నేను 2003 నుంచి కళ్లద్దాలు వాడుతున్నాను. రెండు దశాబ్దాలుగా అవి నా ఐడెంటిటీలో భాగంగా మారాయి. ఇంతకు ముందెప్పుడూ నేను కాంటాక్ట్ లెన్స్ వాడలేదు. పెళ్లిలో కూడా లెన్స్ వాడను. కళ్లజోడుతోనే పెళ్లి పీటలపై కూర్చుంటా’’ అంటోంది ఢిల్లీకి చెందిన ప్రణతి. అందం పట్ల వధువు దృష్టి కోణం మారుతోంది అనడానికి ఇది మంచి ఉదాహరణ. ప్రణతిలా చాలామంది వధువులు రోజూ ధరించే కళ్లజోడును తీసేయడానికి ఇష్టపడటం లేదు. కాకపోతే కళ్లజోడును సైతం వెడ్డింగ్ శారీతో మ్యాచ్ అయ్యేలా చూసుకుంటూ ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నారు.
లెన్స్ ఎందుకు?
సాధారణంగా పెళ్లి అనేసరికి యువతులు కళ్లజోడు తీసి పక్కన పెడుతుంటారు. అయితే వరుడు మాత్రం కళ్లజోడుతోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. అలాంటప్పుడు పెళ్లికూతుళ్లు మాత్రం ఎందుకు అద్దాలు పెట్టుకోకూడదు అని ఆలోచించేవారి సంఖ్య పెరుగుతోంది. పెళ్లికూతుళ్ల ఆలోచనా ధోరణిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. లెన్స్‌కు ‘నో’ చెబుతూ కళ్లజోడునే ఫ్యాషన్‌గా మార్చుతున్నారు. ‘‘గతంలో నేనెప్పుడూ లెన్స్ పెట్టుకోలేదు. పెళ్లిరోజు లెన్స్ పెట్టుకోవాలని మేకప్ ఆర్టిస్టు చెప్పారు. లెన్స్ పెట్టుకోవడంలో తనే సహాయం చేశారు. కానీ వాటితో చాలా అసౌకర్యానికి గురయ్యా. పెళ్లి పీటలపై కూర్చుని కళ్లు రుద్దుతూనే ఉన్నాను. అగ్నిగుండం చుట్టూ తిరిగే సమయంలో వేడి భరించలేక లెన్స్ తీసేశాను. కళ్లు మసకగా కనిపించాయి. వెంటనే నా కళ్లజోడు తెప్పించుకుని పెట్టుకున్నా. ఆ సమయంలో నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయిన భావన కలిగింది’’ అని తన అనుభవాన్ని పంచుకున్నారు హైదరాబాద్(Hyderabad)కు చెందిన శ్రిష్ఠి.

మారుతున్న పరిస్థితులు...
జనరేషన్ మారుతున్న కొద్దీ పరిస్థితులు మారుతున్నాయి. వధువుపై అనవసర ఒత్తిడి తగ్గించేందుకు ఫ్యాషన్ ప్రపంచం అనేక విధాలుగా సహాయపడుతోంది. ఇటీవల కాలంలో మోడల్స్ సైతం కళ్లజోడు ధరించి ర్యాంప్ వాక్ చేస్తున్నారు. ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ కలెక్షన్ ప్రదర్శనలో చాలామంది మోడల్స్ ర్యాంప్‌పై కళ్లజోడుతోనే పాల్గొంటున్నారు. కూలింగ్ గ్లాసెస్ మాత్రమే కాదు... ఆప్టికల్ గ్లాసెస్ కూడా బ్రైడల్ ఫ్యాషన్ షూట్‌లోకి ప్రవేశించాయి.
ప్రముఖ బ్రైడల్ మేకప్ ఆర్టిస్టు చాందినీసింగ్ రెండు దశాబ్దాలుగా మేకప్ రంగంలో పనిచేస్తున్నారు. కళ్లద్దాలు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న ఒక వధువును ఆమె అలంకరించారు. ‘‘ఈ ఏడాది కళ్లద్దాలతో పెళ్లికి సిద్ధమయిన ఒక యువతిని అలంకరించాను. వెడ్డింగ్ శారీతో మ్యాచ్ అయ్యేలా కళ్లజోడు రంగు ఎంపిక చేశాను. ‘వావ్’ అనిపించేలా ముస్తాబు చేశాను. కళ్లజోడుతో పెళ్లికూతురు అదిరింది. ఆమెలో ఒకలాంటి ధైర్యాన్ని గమనించాను’’ అని సింగ్ చెప్పుకొచ్చారు. ఆత్మవిశ్వాసంతో ఉన్న ఈతరం యువతులు కళ్లజోడు వారి అందాన్ని దెబ్బతీస్తుందని అనుకోవడం లేదు. వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు. కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నారు. వారికి సోషల్ మీడియా సపోర్ట్ కూడా లభిస్తోంది.
అందం రెట్టింపు
భారతీయుల్లో 10 నుంచి 12 శాతం మంది మయోపియా అనే దృష్టి సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. 2030కల్లా ఇది 31.9 శాతానికి చేరుకుంటుందని అంచనా. దృష్టి లోపాన్ని సరిచేసేందుకు లేజర్ సర్జరీలు, కాంటాక్ట్ లెన్స్‌ల వినియోగం ఉన్నప్పటికీ... కళ్లజోళ్లు వాడే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. గత కొన్నేళ్లుగా కళ్లజోళ్లు ఫ్యాషన్ యాక్సెసరీస్‌గా మారాయు. ప్రముఖ సంస్థలు కొత్త కొత్త డిజైన్లలో కళ్లజోళ్లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. కరణ్‌జోహార్, కరిష్మాకపూర్, తాప్సీ వంటి సెలబ్రిటీలు రకరకాల కళ్లజోళ్లతో కనిపిస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు.
‘ముఖాకృతికి సరిపోయే కళ్లజోడు అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంద’ని అంటారు సెలబ్రిటీ ఫ్యాషన్ స్టయిలిస్టు ఆకృతి సిగ్డెల్. బాలీవుడ్ సెలబ్రిటీలు తబు, కియారా అద్వాణీలతో కలిసి పనిచేశారు సిగ్డెల్. ‘‘చాలా మంది వధువులు లెన్స్ వైపు మొగ్గు చూపుతారు. కానీ రోజూ కళ్లజోడు ధరించే వారు పెళ్లి వేడుకలోనూ ధరిస్తే, వారి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కళ్లజోడు అందాన్ని తగ్గించదు. అందాన్ని రెట్టింపు చేస్తుంది. దుస్తులు, ఆభరణాలు, మేకప్‌తో నప్పేలా మంచి ఫ్రేమ్‌ని ఎంపిక చేసుకుంటే చాలు’’ అంటారు సిగ్డెల్.
పెళ్లిరోజు లెన్స్ పెట్టుకోవాలా? కళ్లజోడు పెట్టుకోవాలా? అనేది పూర్తిగా వధువు ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. బంధువులు లేక మేకప్ ఆర్టిస్టు ఒత్తిడి చేశారని నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు ఫ్యాషన్ ప్రేమికులు. ‘‘అందరికన్నా అత్యంత అందమైన వధువు ఎవరంటే... నిజాయితీగా ఉన్నామని అనుకున్నవారే’’ అంటారు మేకప్ ఆర్టిస్టు క్రియాన్.
సెలబ్రిటీలు సైతం...
సెలబ్రిటీలు కూడా కళ్లజోడు ధరించి కనిపిస్తూ యువతరంలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీపికా పదుకొణె ‘యే జవానీ హై దివానీ’ చిత్రంలో కళ్లజోడుతో కనిపించి సినీప్రియుల హృదయాలు గెలుచుకుంది. కళ్లజోడు అందాన్ని పెంచుతుందే తప్ప తగ్గించదని అంటారు దీపిక. ‘3 ఇడియట్స్’లో కరీనా కపూర్ కళ్లజోడుతో అందంగా కనిపించింది. టాలీవుడ్‌లోనూ సమంత, రష్మిక, అనుష్క వంటి హీరోయిన్లు కళ్లజోడుతో కనిపించి ఆకట్టుకున్నారు. మొత్తంగా కళ్లజోడు అవసరానికే కాదు... ఆకర్షణీయంగా కనిపించడానికి కూడా అనేది అందరూ అంగీకరించాల్సిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు
Read Latest Telangana News and National News