Weather Forecast: దిత్వా డేంజర్
ABN , Publish Date - Nov 30 , 2025 | 04:22 AM
దిత్వా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాలకు ముప్పు పొంచి ఉందని, ఆది, సోమవారాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు...
ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు
నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు
నేడు తమిళనాడు, కోస్తాంధ్ర తీరాలకు సమీపంగా రానున్న దిత్వా తుఫాన్
దక్షిణ కోస్తా, సీమ జిల్లాలపై ప్రభావం
నాలుగు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్
సముద్రంలోనే బలహీనపడే అవకాశం
తీరం దాటుతుందన్న ఇస్రో నిపుణుడు
రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తం
పరిస్థితిపై హోంమంత్రి, సీఎస్ సమీక్షలు
సహాయ చర్యల కోసం బృందాలు సిద్ధం
అమరావతి/విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘దిత్వా’ తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాలకు ముప్పు పొంచి ఉందని, ఆది, సోమవారాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలు ప్రకటించాయి. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది. తుఫాన్ ప్రభావంతో శనివారం రాత్రి నుంచి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. శనివారం అర్ధరాత్రి తర్వాత వర్షాలు పెరగనున్నాయి. తీర ప్రాంతాల్లో 50-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారి ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీనిప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున తీరం దిశగా అలలు ఎగిసిపడుతున్నాయి. సోమవారం వరకూ మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కృష్ణపట్నం పోర్టులో మూడు, మిగిలిన ఓడరేవుల్లో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.
సముద్రంలోనే బలహీనపడనున్న తుఫాన్!
నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుఫాన్ శనివారం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తమిళనాడు తీరానికి సమాంతరంగా పయనించింది. శనివారం రాత్రికి కరైకాల్‌కు 100, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 180 కి.మీ, చెన్నైకు దక్షిణంగా 280 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనించే క్రమంలో శనివారం రాత్రి నుంచి తమిళనాడు తీరానికి 25నుంచి 50 కి.మీ. దూరంలో సమాంతరంగా పయనించి ఆదివారం ఉదయానికి చెన్నై, దక్షిణ కోస్తాంధ్రకు అతి చేరువగా రానున్నది. ఆ తర్వాత కూడా దక్షిణ కోస్తాలోని తీరానికి ఆనుకుని అతి చేరువుగా అంటే తీరానికి 25 నుంచి 60 కి.మీ. దూరంగా పయనించే క్రమంలో తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దక్షిణ కోస్తాకు ఆనుకొని పయనిస్తూ సోమవారం నాటికి సముద్రంలోనే పూర్తిగా బలహీనపడుతుందని పేర్కొన్నారు. అయితే సోమవారం తెల్లవారుజామున శ్రీహరికోట పరిసరాల్లో తీరం దాటుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు అంచనా వేశారు.
కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ప్రజలు, రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ నుంచి మొబైల్ ఫోన్లకు ఎస్‌ఎంఎ్‌సల ద్వారా తుఫాన్ సమాచారాన్ని పంపాలని స్పష్టం చేశారు. మత్స్యకారులు డిసెంబరు 2 వరకు సముద్రంలోకి వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం ఆయన విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ వర్షాలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకునేలా రైతులను అప్రమత్తం చేయాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో ఉన్న వారిని ముందే గుర్తించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత
తుఫాన్ తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ప్రభావిత జిల్లాల్లో అధికార యం త్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. భారీ వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావితమయ్యే జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ‘వెంటనే సహాయక బృందాలను పంపాలి. ప్రాణనష్టం జరగకుండా ముందస్తుచర్యలు తీసుకోవాలి. తుఫాన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులు, ప్రజలకు తెలియజేయాలి. కంట్రోల్ రూమ్‌లు 24/7 నిర్వహించాలి. అవసరమైతే ప్రజలను సహాయ శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలి. బలమైన ఈదురుగాలులు వీచేటప్పుడు ప్రజలు చెట్లు, హోర్డింగ్‌ల వద్ద ఉండకుండా అప్రమత్తం చేయాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలి’ అని కలెక్టర్లను ఆదేశించారు.

శ్రీలంకలో చిక్కుకున్న ఏడుగురు ఏపీవాసులు
రాపూరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘దిత్వా’ తుఫాను కారణంగా రాష్ట్రానికి చెందిన ఏడుగురు మూడు రోజుల నుంచి శ్రీలంకలో చిక్కుకుపోయారు. కువైట్ నుంచి బయలుదేరి రావాల్సిన వీరు.. కొలంబో విమానాశ్రయంలో ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ నెల 27న కువైట్ నుంచి తిరుపతి జిల్లా రాపూరు మండలం అక్కమాంబాపురానికి చెందిన శివ, సుధాకర్, కోటితో పాటు అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన నలుగురు చెన్నై విమానాశ్రయానికి చేరాల్సి ఉంది. అయితే తుఫాను కారణంగా వారు శ్రీలంకలోని మత్తేలే విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచివిమానాశ్రయ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో కొలంబో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు విమానం బయలుదేరుతుందని సమాచారమిచ్చి.. అనంతరంఅరగంట తర్వాత విమానం రద్దు అయిందని అధికారులు చెప్పారు. దీంతో వారు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. అధికారులు తమను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీరు, ఆహారం, ఇతర వసతులు కల్పించలేదన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ చొరవ తీసుకుని తమను సొంతూరికి చేర్చాలని కోరుతున్నారు.

వర్షాలు పడే జిల్లాలు ఇవే..
ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుఫాన్ గమనాన్ని పర్యవేక్షిస్తూ, ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తుఫాన్ వేళ అత్యవసర సహాయ చర్యల కోసం కడపలో రెండు ఎన్డీఆర్‌ఎఫ్, వెంకటగిరిలో మూడు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే సము.ద్రంలోకి వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pharmacy Council: 15 ఏళ్ల తర్వాత ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు
Minister Sandhya Rani: రాజకీయంగా ఎదుర్కోలేకే ఆరోపణలు