Pharmacy Council: 15 ఏళ్ల తర్వాత ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు
ABN , Publish Date - Nov 30 , 2025 | 05:59 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌కు ఎట్టకేలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష మంది ఫార్మసిస్టులు ఈ ఎన్నికల కోసం 15 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు.
ఆరుగురిని ఎన్నుకోనున్న ఫార్మసిస్టులు
4 నుంచి ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్‌లు
అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌కు ఎట్టకేలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష మంది ఫార్మసిస్టులు ఈ ఎన్నికల కోసం 15 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. కోర్టు కేసులు, కొంత మంది చేసిన రాజకీయాల కారణంగా రాష్ట్ర విభజన తర్వాతి నుంచి ఫార్మసీ కౌన్సిల్‌కు ఎన్నికలు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అండతో కొంత మంది తమ స్వార్థం కోసం ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు అడ్డుపడుతూ వచ్చారు. ప్రభుత్వ ఫార్మసిస్టు అసోసియేషన్, మరికొన్ని అసోసియేషన్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు ప్రభు త్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల్లో 60 వేల మంది ఫార్మసిస్టులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబరు 4వ తేదీ నుంచి ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ పత్రాలు రిజిస్ట్రర్ పోస్టు ద్వారా పంపిస్తారు. ఓటర్లు తమ నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి డిసెంబరు 24వ తేదీ నాటికి తిరిగి ఎన్నికల నిర్వహణ కమిటీకి పంపించాల్సి ఉంటుం ది. డిసెంబరు 26 లేదా 27వ తేదీన వాటిని లెక్కించి, అత్యధిక ఓట్లు సాధించిన ఆరుగురిని సభ్యులుగా ఎన్నుకుంటారు. మొత్తం 15 మంది సభ్యులకుగాను, మరో ఐదుగురిని ప్రభు త్వం నామినేట్ చేస్తుంది. వీరు కాకుండా డీఎంఈ, డీహె చ్, ప్రభుత్వ అనలిస్ట్‌తో పాటు డ్రగ్స్ డీజీలు ఎక్స్‌అఫిషియో మెంబర్లుగా ఉంటారు. ఈ 15 మంది కలిపి ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకుంటారు.
ఇప్పటి వరకూ కౌన్సిల్ రిజిస్ట్రర్ ద్వారానే ఫార్మసీ కౌన్సిల్ నిర్వహిస్తూ వచ్చారు. దీనివల్లే అనేక అవకతవకలు జరుగుతూ వచ్చాయి. కొత్త కౌన్సిల్ ఏర్పడితే ఫార్మసీ కౌన్సిల్‌ల్లో అడ్మినిస్ట్రేషన్ చక్కబడుతుందని ఫార్మసిస్టులు భావిస్తు న్నా రు. ఎన్నికల కోసం పోరాటం చేసి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ప్యానెల్ కొంత మందిని ఎంపిక చేసి ఎన్నికల్లో బరిలోకి దించింది. వీరిలో కోల శ్రావణ్‌కుమా ర్, కోటిపాటి రాధాకృష్ణ, నాగకృష్ణరాజు, నల్లమిల్లి ఆదిరెడ్డి, లుక్కా నరేష్, ప్రభుత్వ ఫార్మసిస్టుల తరఫున వేమురి మాలతి ఎన్నికల బరిలో దిగారు.