Share News

H-1B visa: మార్చి 7 నుంచి హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్లు

ABN , Publish Date - Feb 07 , 2025 | 05:08 AM

హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎ్‌ససీఐఎస్‌) ప్రకటించింది. మార్చి 7 నుంచి 24 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది.

H-1B visa: మార్చి 7 నుంచి హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్లు

  • అదే నెల 24 వరకూ కొనసాగనున్న నమోదు ప్రక్రియ

  • 31న లబ్ధిదారుల ప్రకటన

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 6: హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎ్‌ససీఐఎస్‌) ప్రకటించింది. మార్చి 7 నుంచి 24 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కోటా కింద జారీచేసే ఈ వీసాల కోసం ఆయా సంస్థలు, ప్రతినిధులు ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలని వెల్లడించింది. హెచ్‌-1బీ వీసా కోసం ఫీజు కింద 215 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. హెచ్‌-1బీ వీసాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకు యూఎ్‌ససీఐఎస్‌ ప్రవేశపెట్టిన కేంద్రీకృత ఎంపిక ప్రక్రియను ఈ సంవత్సరం కొనసాగించనున్నారు.


దీనిప్రకారం ఒక లబ్ధిదారు బహుళ దరఖాస్తులు చేసుకున్నా వాటి సంఖ్యతో సంబంధం లేకుండా ఒకరికి ఒక దరఖాస్తును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. మార్చి 24 నాటికి పరిమితిని మించి అప్లికేషన్లు వస్తే ర్యాండమ్‌ పద్ధతిలో ఎంపిక చేస్తారు. పరిమితికి మించకపోతే వచ్చిన అన్ని రిజిస్ట్రేషన్లను ఆమోదిస్తారు. వీసా లబ్ధిదారుల సమాచారాన్ని సంస్థల యజమానులు మార్చి 7 నుంచి నమోదు చేయడం ప్రారంభించాలి. ఎంపికైన వారి వివరాలను మార్చి 31లోగా ఖాతాలకు పంపిస్తారు.

Updated Date - Feb 07 , 2025 | 05:08 AM