Share News

US Student Visa Suspension: అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు బంద్‌

ABN , Publish Date - May 28 , 2025 | 05:26 AM

అమెరికా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. సోషల్ మీడియా తనిఖీలపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు, తరగతులకు హాజరు కాకపోతే వీసా రద్దు జరిగే హెచ్చరిక జారీ చేసింది.

US Student Visa Suspension: అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు బంద్‌

  • ప్రపంచ వ్యాప్తంగా తక్షణమే అమలులోకి

  • విదేశీ విద్యార్థుల ‘సోషల్‌’ ఖాతాల తనిఖీకి త్వరలో కఠిన నిబంధనలు

  • అప్పటిదాకా ఇంటర్వ్యూల నిలుపుదల

  • ఇప్పటికే షెడ్యూల్‌ అయిన వారికి ఓకే

  • క్లాసులు ఎగ్గొడితే.. వీసా రద్దు!

  • విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక

  • హార్వర్డ్‌పై యుద్ధంలో గెలుస్తా

  • నిధుల్లో కోత విధిస్తా: ట్రంప్‌

న్యూఢిల్లీ, మే 27: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థి(స్టూడెంట్‌) వీసా జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపి వేసింది. దీంతో భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీలల్లోనూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు జరగవు. విదేశీ విద్యార్థుల సోషల్‌ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిబంధనలను తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్‌ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీలకు ఆదేశాలు పంపారు. ఇప్పటికే షెడ్యూల్‌ అయిన ఇంటర్వ్యూలకు ఈ ఆదేశాలు వర్తించవు. కానీ, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కొత్తగా విద్యార్థి లేదా ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌(ఎఫ్‌, ఎం, జే) వీసా ఇంటర్య్యూలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. దీనిపై మరింత స్పష్టమైన ఆదేశాలు త్వరలో ఇస్తామని పేర్కొన్నారు. సోషల్‌ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిబంధనలు అమలులోకి వస్తే అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశం మరింత కష్టం కానుంది.


క్లాసులు ఎగ్గొడితే అంతే..!

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. తరగతులకు గైర్హాజరయ్యే వారి వీసా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి వారంతా భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసా కోసమైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హతను కోల్పోతారని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ‘డ్రాపౌట్‌ అయినా, తరగతులు ఎగ్గొట్టినా, విద్యాసంస్థకు సమాచారం ఇవ్వకుండా స్టడీ ప్రోగ్రామ్‌ నుంచి వెళ్లిపోయినా మీ విద్యార్థి వీసా రద్దు కావచ్చు. భవిష్యత్తులో అమెరికా వీసాలకు మీరు అర్హత కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమస్యలను నివారించడానికి వీసా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి’ అని ఆ ప్రకటనలో సూచించింది. మరోవైపు అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రాంను రద్దుచేసే దిశగా ట్రంప్‌ ప్రభుత్వం అడుగులు వేస్తుండటం కూడా భారత్‌తో పాటు ఇతర దేశాల విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.

విదేశాల్లో 10.8 లక్షల మంది విద్యార్థులు

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 2025లో 10.8లక్షల మంది విదేశీ విద్యా సంస్థల్లో చదువుతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ వివరాలను ఇతర విద్యా సంస్థలు కూడా ధ్రువీకరించాయి. 2023లో 10.3 లక్షల మంది చదువుతున్నట్టు గుర్తించగా ప్రస్తుత సంవత్సరంలో ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. కెనడా విద్యా సంస్థల్లో చేరిన వారి సంఖ్య ఈ ఏడాది కాస్త తగ్గినప్పటికీ మొత్తం మీద చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఆ దేశానికి వెళ్లారు. 2024లో కెనడాలో 1,37,608 మంది, యూకేలో 98,890 మంది ఉన్నట్టు వెల్లడయింది. గత ఏడాది అమెరికాలో చదువుతున్న వారి సంఖ్య 3,31,602గా నమోదయింది.

Updated Date - May 28 , 2025 | 05:29 AM