యుద్ధంలోకి అమెరికా
ABN , Publish Date - Jun 18 , 2025 | 03:20 AM
ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు. ఈ విషయాన్ని నేను పదే పదే చెబుతున్నాను

ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు పక్కాగా తెలుసు: ట్రంప్
ప్రస్తుతానికి హతమార్చం.. ఇరాన్ లొంగిపోవాలి
ఆ దేశం వద్ద అణ్వాయుధం అనేది ఉండకూడదు
సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నాం
టెహ్రాన్‌ను అక్కడి పౌరులు తక్షణం వీడి వెళ్లిపోవాలి
ట్రంప్ హెచ్చరికలు.. జీ7నుంచి అర్ధంతరంగా అమెరికాకు
తాను తిరిగి వెళుతున్నది కాల్పుల విరమణ ఒప్పందం
కోసం కాదని.. విషయం అంతకంటే పెద్దదని స్పష్టీకరణ
ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు!
డీగో గార్షియాలో ఇప్పటికే అమెరికా బీ2 స్టెల్త్ బాంబర్లు
టెహ్రాన్, టెల్‌అవీవ్, జూన్ 17: పతాకస్థాయికి చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో.. అమెరికా కూడా జోక్యం చేసుకోనుందా? ఇజ్రాయెల్‌కు తోడుగా యుద్ధరంగంలోకి దిగనుందా? గడిచిన 24 గంటలుగా శరవేగంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా తమతో అణు ఒప్పందం కుదుర్చుకోలేదన్న కోపంతో ఇరాన్‌పై రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ‘‘ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు. ఈ విషయాన్ని నేను పదే పదే చెబుతున్నాను. టెహ్రాన్ ప్రజలంతా తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్లిపోండి’’ అని హెచ్చరిస్తూ సోమవారం తన సొంత సామాజిక మాధ్యమమైన ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్టు పెట్టారు. అనంతరం.. కెనడాలో జరుగుతున్న జీ7 సమావేశాన్ని వీడి అర్ధంతరంగా అమెరికాకు పయనమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం నిర్వహించడానికి ‘సిచ్యువేషన్ రూమ్’ను సిద్ధం చేయాలని శ్వేతసౌధం వర్గాలను ఆదేశించారు. ‘‘సుప్రీం లీడర్‌గా చెప్పుకొంటున్న సదరు నేత ఎక్కడ దాక్కున్నాడో మాకు పక్కాగా తెలుసు. ఆయన్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం మాకు చాలా సులువు. కానీ, అక్కడ ఆయన క్షేమంగానే ఉన్నారు. ఆయన్ను మేం చంపం.. కనీసం ప్రస్తుతానికి!’’ అని మంగళవారం మరో
పోస్టు పెట్టారు. పౌరులపైన, అమెరికా సైనికులపైన క్షిపణి దాడులను తాము సహించబోమని.. తమ సహనం నశిస్తోందని అందులో పేర్కొన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరిస్తూ మరో పోస్టు పెట్టారు. ఇరాన్ గగనతలం మొత్తం పూర్తిగా తమ నియంత్రణలో ఉందని హెచ్చరించారు. ‘‘ఇరాన్ వద్ద మంచి స్కై ట్రాకర్లు, ఇతర రక్షణ పరికరాలు ఉండొచ్చు. కానీ, వాటికి మా పరికరాలతో పోలికే లేదు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈశాన్య సిరియాలో ఉన్న రెండు బేస్‌ల నుంచి అమెరికా బలగాలు వైదొలగాయి. ఆ బలగాలను ఎక్కడికి తరలించిందీ తెలియట్లేదు. ఇంకోవైపు.. అమెరికా నౌకాదళం తన సూపర్ క్యారియర్ (విమాన వాహక నౌక) యూఎ్‌సఎస్ నిమిట్జ్‌ను దక్షిణ చైనా సముద్రం నుంచి మధ్యప్రాచ్యం దిశగా.. వాయుసేనకు చెందిన 21 రీఫ్యూయెలింగ్ ట్యాంకర్లను (కేసీ-135 ఆర్, కేసీ-46ఏ) అమెరికా నుంచి యూర్‌పకు పంపుతున్నట్టు ‘ద వార్‌జోన్’ వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. మరోవైపు.. మధ్య టెహ్రాన్‌లో 3.3 లక్షల మంది ఉండే ఒక ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిక జారీ చేసింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనే ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీ 2 బాంబర్ల మోహరింపు..
టంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారించి ఈ ఏడాది మార్చిలోనే.. ఆరు బీ2 స్టెల్త్ బాంబర్లను హిందూ మహాసముద్రంలోని డీగో గార్షియా దీవిలో మోహరించారు. మే నెలలో బీ 52 బాంబర్లను కూడా అక్కడికి తరలించారు. ఈ ద్వీపం ఇరాన్‌కు 4,842 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ, బీ2 బాంబర్ల రేంజ్ 11 వేల కిలోమీటర్లు. అంటే.. అమెరికా తల్చుకుంటే బీ2 బాంబర్లు సురక్షితంగా ఇరాన్‌కు వెళ్లి అణు శుద్ధి కేంద్రాలున్న బంకర్లపై బాంబులు జారవిడిచి, వెనక్కి తిరిగి వచ్చేయగలవు. అలా వెళ్లాలంటే ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెల్‌కు లేదా అమెరికాకు నియంత్రణ కావాలి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంపై తమకు పూర్తి నియంత్రణ ఉందని ఇజ్రాయెల్ సైన్యం సోమవారమే ప్రకటించింది. ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి మొదలుపెట్టిన రోజే ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను, క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని.. వాటిని తీవ్రంగా బలహీనం చేసిన సంగతి తెలిసిందే మంగళవారంనాడు ట్రంప్ సైతం.. ఇరాన్ గగనతలంపై తమకు పూర్తి నియంత్రణ ఉందని ప్రకటించారు. అంటే.. అమెరికా బీ2 బాంబర్లకు మార్గం సుగమమైనట్టే. అదే జరిగితే.. ఈ యుద్ధంలో అమెరికా కూడా అడుగుపెట్టినట్టే.
ఇరాన్ గెలవదు..
జీ7 సదస్సు నిమిత్తం కెనడాకు వెళ్లిన ట్రంప్.. ఈ యుద్ధంలో అమెరికా జోక్యంపై మీడియా అడిగిన ప్రశ్నకు తొలుత సమాధానం చెప్పడానికి నిరాకరించారు. అయితే.. ఇరాన్ ఈ యుద్ధాన్ని గెలవలేదని అక్కడ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మించిపోలేదని.. పరిస్థితులు చేయిదాటిపోకముందే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కట్టిపెట్టాలని హెచ్చరించారు. ఇరాన్ తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. తర్వాత అర్ధంతరంగా జీ7 సమావేశాన్ని వీడి వెళ్లిపోయే ముందు.. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు’’ అని ట్రూత్ సోషల్‌లో మరో పోస్ట్ పెట్టారు. అధ్యక్ష విమానంలో అమెరికాకు వెళ్లే సమయంలో కూడా మీడియాతో ఆయన ఇదే మాట చెప్పారు (ఇదే మాటను ఆయన పదేపదే చెబుతుండడం గమనార్హం). ఇరాన్‌తో అణు వివాదానికి శాశ్వత ముగింపు పలకడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘కాల్పుల విరమణ కాదు. ఈ అంశానికి ఒక ముగింపు.. నిజమైన ముగింపు కావాలి’’ అని వ్యాఖ్యానించారు. ఇందుకోసం ఇరాన్‌తో చర్చలకు తమ ప్రత్యేక రాయబారి స్టీవెన్ విట్కా్‌ఫను గానీ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌నుగానీ పంపిస్తానని తెలిపారు. ట్రంప్ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు కృషి చేస్తున్నారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ చేసిన వ్యాఖ్యను తిరస్కరించిన ట్రంప్.. ‘‘జీ7 సదస్సు నుంచి నేను తిరిగి వెళ్తున్నది (ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య) కాల్పుల విరమణ ఒప్పందం కోసమని.. ఎప్పుడూ ప్రచారాన్ని కోరుకునే ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పొరపాటుగా చెప్పారు. అది తప్పు. నేను వాషింగ్టన్‌కు ఎందుకు వెళ్తున్నానో ఆయనకు అస్సలు తెలియదు. నేను వెళ్తున్నది మాత్రం కాల్పుల విరమణ కోసం కాదు. విషయం దానికంటే చాలా పెద్దది. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని నేను మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాను’’ అని పేర్కొన్నారు
అమెరికా తోడు.. అందుకేనా?
ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆ దేశంపై దాడులు ప్రారంభించినప్పటికీ.. ఒక్క నతాంజ్ యురేనియం శుద్ధి కర్మాగారాన్ని మాత్రమే ఒకింత దెబ్బతీయగలిగింది. ఇరాన్ అణు కార్యక్రమానికి అత్యంత కీలకమైన ఫార్దో యురేనియం శుద్ధి కేంద్రాన్ని ధ్వంసం చేయలేకపోయింది. కొండల నడుమ భూగర్భంలో 200 అడుగుల లోతున ఏర్పాటు చేసిన ఆ కేంద్రంలో యురేనియాన్ని 60 శాతం వరకూ శుద్ధి చేయడానికి ఉపయోగించే ఆర్‌ఐ-6 సెంట్రీఫ్యూజ్‌లు 2000 దాకా ఉన్నట్టు అంచనా. ఈ కేంద్రాన్ని కాపాడేందుకు రష్యన్ ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ నియోగించింది. మరోవైపు.. ఖమేనీ సైతం టెహ్రాన్ నగరానికి 340 కిలోమీటర్ల దూరంలోని లవీజాన్ ప్రాంతంలో భూగర్భంలో 200 అడుగుల లోతున ఉన్న ఒక బంకర్‌లో తలదాచుకున్నట్టు సమాచారం. ఖమేనీతోపాటు ఆయన కుమారుడు, మరికొందరు కుటుంబసభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బంకర్లను ధ్వంసం చేయడానికి.. ఇజ్రాయెల్ వద్ద ఉన్న బంకర్ బస్టర్ బాంబులు సరిపోవు. దానికి అత్యంత శక్తిమంతమైన 14 వేల కిలోల జీబీయూ-57 పెనెట్రేటర్లు కావాలి. అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. వాటిని ప్రయోగించడానికి అవసరమైన బీ-2 స్టెల్త్ బాంబర్లు కూడా అమెరికా వద్ద ఉన్నాయి. రేడార్లకు చిక్కని స్టెల్త్ సామర్థ్యం గల ఈ బీ2 బాంబర్లు అమెరికా వద్ద 20 ఉన్నాయి. 200 అడుగుల లోతులో ఉన్న బంకర్లను సైతం తునాతునకలు చేసే జీబీయు-57 బాంబులను ప్రయోగించే ఏకైక యుద్ధ విమానం ఇదే. అందుకే ఈ విషయంలో ఇజ్రాయెల్ అమెరికా సాయాన్ని ఆశిస్తోంది.