Trump Administration: అమెరికా నుంచి భారత్‌కు..
ABN , Publish Date - Feb 05 , 2025 | 05:17 AM
అమెరికా సైన్యానికి చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానం 205 మంది భారతీయులతో టెక్సాస్ నుంచి బయల్దేరినట్లు సమాచారం. ఈ విమానం భారత్‌కు చేరుకోవడానికి 24 గంటలు పడుతుంది.
205 మంది అక్రమ వలసదారులు వెనక్కి!
యుద్ధ విమానం ‘సీ-17 గ్లోబ్‌మాస్టర్’లో భారతీయులను తరలిస్తున్న అమెరికా ప్రభుత్వం
నేడు అమృత్‌సర్‌లో దిగనున్న విమానం!.. నేర చరిత్ర ఉన్నవారిని అరెస్టు చేస్తాం: పంజాబ్ పోలీసులు
అమెరికాలో అక్రమంగా ఉంటున్న 18 వేల మంది భారతీయులు.. అక్రమ వలసలకు వ్యతిరేకమన్న భారత్
ట్రంప్‌తో వాణిజ్య యుద్ధానికి జిన్‌పింగ్ సై!.. అమెరికా బొగ్గు, ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తులపై 15% సుంకం
టెక్సాస్, ఫిబ్రవరి 4: అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ మొదలైంది. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియను ప్రారంభించింది. అమెరికా సైన్యానికి చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానం 205 మంది భారతీయులతో టెక్సాస్ నుంచి బయల్దేరినట్లు సమాచారం. ఈ విమానం భారత్‌కు చేరుకోవడానికి 24 గంటలు పడుతుంది. అది బుధవారం మధ్యాహ్నానికి పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అమెరికా నుంచి వచ్చే వారిని నిర్బంధించాలన్న ఆదేశాలేవీ రాలేదని అధికారులు తెలిపారు. కానీ, అమెరికా నుంచి వచ్చే వారి పత్రాలన్నింటినీ తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. అమెరికా నుంచి తిరిగి వస్తున్న వారిలో ఎవరిపైనైనా పంజాబ్‌లో క్రిమినల్ రికార్డులు ఉన్నాయా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. నేర చరిత్ర కలిగిన వారు ఎవరైనా వస్తే.. వెంటనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు భారత్‌కు వస్తున్న విమానంలో ఎవరున్నారు? ఎంత మంది ఉన్నారు? వంటి వివరాలను వెల్లడించడానికి అమెరికా అధికారులు నిరాకరించారు. తమ ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటుందని మాత్రం స్పష్టం చేశారు.

అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారందరినీ బహిష్కరిస్తామని తెలిపారు. అమెరికాలో 18 వేల మందికి పైగా భారత అక్రమ వలసదారులు ఉన్నట్లు ఇరుదేశాలూ గుర్తించాయి. వారందరినీ అమెరికా నుంచి బహిష్కరించేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోంది. అక్రమ వలసదారులను భారత్‌కు తిప్పి పంపిస్తామని చెప్పగా.. ప్రధాని మోదీ అంగీకరించినట్లు ట్రంప్ ఇటీవల వెల్లడించారు. కాగా, అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇప్పటికే భారత్ విదేశాంగ శాఖ తన స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసి లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికా సహా ఏ దేశంలో ఉన్నా తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్న తరుణంలో అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల తొలివిడత తరలింపు జరగడం గమనార్హం.
అక్రమ వలసదారులను తరలించేందుకు అమెరికా వినియోగిస్తున్న సీ-17 సైనిక విమానాలు చాలా ఖరీదైనవి. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన 223 సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానాలను ఆ దేశ సైన్యం వినియోగిస్తోంది. వీటి విలువ దాదాపు రూ.6.6 లక్షల కోట్లు. ఈ మొత్తం టాంజానియా, శ్రీలంక, ఘనా, బెలారస్, ఉరుగ్వే, క్రొయేషియా వంటి దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా 275 సీ-17 విమానాలు వినియోగంలో ఉండగా.. వాటిలో 223 విమానాలు అమెరికా ఆర్మీ వద్దే ఉండడం గమనార్హం. ఆస్ట్రేలియా, కెనడా, భారత్, కువైత్, ఖతార్, యూఏఈ, యూకే కూడా ఈ విమానాలను వినియోగిస్తున్నాయి. కాగా, గతంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించడానికి భారత్ కూడా తన సీ-17 విమానాన్ని రొమేనియాకు పంపింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులుగా ముద్ర వేసి 7.25 లక్షల మంది భారతీయులను వెనక్కి పంపేందుకు అమెరికా సిద్ధమవుతోందని ఆరోపించారు. విదేశీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటు స్థాయీ సంఘం సమావేశంలో తనకీ విషయం చెప్పారన్నారు.
మరిన్ని వార్తల కోసం..
PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి