Donald Trump: అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన.. ఇంతకీ గోల్డెన్ డోమ్ అంటే..
ABN , Publish Date - May 21 , 2025 | 09:41 AM
Donald Trump: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నడుంబిగించారు. ఆ క్రమంలో ఆయన కీలక ప్రకటన చేశారు.
వాషింగ్టన్, మే 21: అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల హామీలను అమలు పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో దేశ క్షిపణి రక్షణ వ్యవస్థ ఏర్పాటుపై ఆయన మంగళవారం కీలక ప్రకటన చేశారు. ‘గోల్డెన్ డోమ్’ పేరిట రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు రూ.175 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని తెలిపారు. ఈ అధునాతన మిసైల్ రక్షణ వ్యవస్థ తయారు చేయడానికి మూడేళ్ల సమయం పడుతుందని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరించారు. జనవరిలో తాను అధికారం చేపట్టిన కొద్ది రోజులకే.. ఈ భవిష్యత్ రక్షణ వ్యవస్థ నిర్మాణాన్ని తన బృందం అధికారికంగా ఖరారు చేసిందన్నారు. భవిష్యతులో అమెరికాపై జరిగే వైమానిక దాడుల ముప్పును ఎదుర్కొవడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పుకొచ్చారు. దేశానికి అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని ఎన్నిక ప్రచారంలో తాను ఇచ్చిన హామీని ఈ విధంగా నిలబెట్టుకుంటున్నందుకు సంతోషంగా ఉందని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ఇంతకీ గోల్డెన్ డోమ్ సిస్టమ్ అంటే..
ఏ దేశమైనా యూఎస్‌పై భూ ఉపరితలం నుంచి ఆకాశం ద్వారా క్షిపణి దాడులు చేసే అవకాశం ఉంది. అలాంటి క్షిపణులను కనుగొనడం, వాటిని ట్రాక్ చేయడంతోపాటు వాటిని కూల్చివేయడం ఈ గోల్డెన్ డోమ్ లక్ష్యం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. అలాంటి క్షిపణులను ఈ రక్షణ వ్యవస్థ ఆకాశంలోనే కూల్చివేయనుంది. ఈ వ్యవస్థ అమెరికా విజయానికి .. అలాగే దేశ మనుగడకు అత్యంత కీలమైంది. ప్రపంచంలోని అన్ని వైపుల నుంచే కాదు.. అంతరిక్షం నుంచి సైతం ప్రయోగించినా.. వాటిని నిలుపుదల చేసే శక్తి ఈ గ్లోబెల్ డోమ్‌కు ఉండనుంది.
అలాగే ఈ గోల్డెన్ డోమ్ మరింత విస్తృతమైన లక్ష్యాలను కలిగి ఉంది. ఇది భూమి, సముద్రంతోపాటు అంతరిక్షంలో భవిష్యత్ తరం తాలుకా సాంకేతికతలను అమలు చేస్తుంది. వీటిలో అంతరిక్ష ఆధారిత సెన్సార్లతోపాటు ఇంటర్‌సెప్టర్‌లు అమర్చి ఉండనున్నాయి.
పెంటగాన్ చీఫ్..
ఇక పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ.. గోల్డెన్ డోమ్ డిజైన్ ఇప్పటికే ఉన్న భూ- ఆధారిత రక్షణ సామర్థ్యాలతో అనుసంధానించబడుతుందన్నారు. క్రూయిజ్, బాలిస్టిక్, హైపర్‌సోనిక్ క్షిపణులు, డ్రోన్ దాడులతోపాటు అణు దాడుల నుంచి మాతృభూమిని రక్షించడమే లక్ష్యంగా ఈ డోమ్ వ్యవస్థను తాము పెట్టుకున్నట్లు తెలిపారు.
ఎంత ఖర్చవుతోందంటే..
అయితే ట్రంప్ ఇప్పటివరకూ ఈ ప్రణాళిక కోసం 25 బిలియన్ డాలర్లు మేరకు ప్రారంభ నిధులు ప్రకటించారు. ఈ వ్యవస్థ తయారీకి మొత్తం రూ. 175 బిలియన్ డాలర్లు ఖర్చుకానుంది.
తయారీకి పట్టే సమయం..
ఈ వ్యవస్థ పూర్తి కావడానికి దాదాపు మూడేళ్ల సమయం పడుతోంది. అంటే అమెరికా దేశాధ్యక్షుడిగా ట్రంప్ పదవి ముగిసే సమయానికి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానున్నదన్నది సుస్పష్టం.
ఈ ప్రాజెక్ట్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారంటే..
ఈ ప్రాజెక్ట్‌కు యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గులిటెన్ నాయకత్వం వహిస్తారని ట్రంప్ వెల్లడించారు. 2021లో ఆయన స్పేస్ ఫోర్స్‌లో ప్రవేశించారని.. అంతకు ముందు ఆయన దాదాపు 30 ఏళ్ల పాటు ఎయిర్ ఫోర్స్‌లో పని చేశారని ట్రంప్ వివరించారు. ఈ వ్యవస్థ వల్ల అన్ని రకాల క్షిపణులతోపాటు డ్రోను దాడుల నుంచి యూఎస్ రక్షణ పొందుతుందన్నారు. అయితే తమకు సైతం ఈ వ్యవస్థ ద్వారా రక్షణ కల్పించాలని కెనడా కోరిందని ఈ సందర్భగా డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేశారు.
ఇజ్రాయెల్ ఇప్పటికే ఐరన్ డోమ్ పేరిట రక్షణ వ్యవస్థను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో అమెరికా గోల్డెన్ డోమ్ పేరుతో రక్షణ వ్యవస్థను తయారు చేసేందుకు సమాయత్తమవుతోంది. మరోవైపు అమెరికా రూపొందిస్తున్న ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థను రష్యా, చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
Israel Bombing: గాజాలో మృత్యుముఖాన 14వేల చిన్నారులు
Medical Education: అనధికార వైద్య కాలేజీల్లో చేరొద్దు: ఎన్‌ఎంసీ
For International News And Telugu News