Share News

Trump Welcomes Foreign Experts: విదేశీ నిపుణులను స్వాగతిస్తున్నాం

ABN , Publish Date - Sep 16 , 2025 | 06:51 AM

అక్రమ వలసల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, దక్షిణా కొరియా హెచ్చరికల దెబ్బకు దిగొచ్చారు. తమ దేశ కంపెనీల్లో విదేశీ ఉద్యోగులను...

Trump Welcomes Foreign Experts: విదేశీ నిపుణులను స్వాగతిస్తున్నాం

  • వారిని భయభ్రాంతులను చేయడం మా అభిమతం కాదు

  • చిప్స్‌, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, షిప్పుల తయారీని విదేశీ ఉద్యోగుల నుంచి మేం నేర్చుకుంటాం: డొనాల్డ్‌ ట్రంప్‌

  • అక్రమ వలస పేరిట ఇటీవల దక్షిణకొరియా కార్మికుల నిర్బంధం

  • అమెరికాలో పెట్టుబడులపై మా సంస్థలు ఆలోచిస్తాయి.. జాగ్రత్త

  • దక్షిణ కొరియా హెచ్చరిక.. అమెరికా అధ్యక్షుడి దిద్దుబాటు చర్య

వాషింగ్టన్‌, సెప్టెంబరు 15: అక్రమ వలసల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, దక్షిణా కొరియా హెచ్చరికల దెబ్బకు దిగొచ్చారు. తమ దేశ కంపెనీల్లో విదేశీ ఉద్యోగులను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. వారిని భయభ్రాంతులకు గురిచేయడం తన అభిమతం కానేకాదని అన్నారు. పదిరోజుల క్రితం జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్‌ కంపెనీ ప్లాంట్‌లో ఆ దేశ వాసులు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారం అందడంతో అక్కడ దాడులు నిర్వహించి.. 475 మందిని నిర్బంధించినట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. వీరిలో దక్షిణ కొరియాకు చెందిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు. ఆ కార్మికులను గొలుసులతో బంధించిన దృశ్యాలపై దక్షిణ కొరియాలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. 12న ఆ కార్మికులను అమెరికా నుంచి దక్షిణ కొరియా తమ దేశానికి తరలించుకుపోయింది. అయితే ఇది జరగడానికి ఒకరోజు ముందే తమ కార్మికుల పట్ల అమెరికా వ్యవహరించిన తీరుపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీజే మ్యూంగ్‌ తీవ్రంగా స్పందించారు.


హ్యుందాయ్‌ ఫ్లాంట్‌లో దాడులు తమను దిగ్ర్భాంతికి గురిచేశాయని.. మన్ముందు తమ దేశ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ సోమవారం ట్రుత్‌ వేదికగా స్పందిచారు. విదేశాలకు చెందిన నిపుణులను తమ దేశ కంపెనీల్లోకి ఆహ్వానిస్తున్నామని.. సంక్లిష్టమైన చిప్స్‌, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, షిప్పులు, రైళ్లు తదితర ఉత్పత్తులను ఎలా తయారు చేయాలనేది విదేశీ ఉద్యోగుల నుంచి నేర్చుకుంటాం అని పేర్కొన్నారు. ఇక టిక్‌టాక్‌ యాప్‌ యాజమాన్యంతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని, దీనిపై చైనాతో ఒప్పందం జరిగిందని ట్రంప్‌ వెల్లడించారు. ఈ మేరకు వాణిజ్య చర్చల్లో భాగంగా స్పెయిన్‌లో చైనాతో సోమవారం సమావేశం బాగా జరిగిందని చెప్పారు. కాగా ఇటీవల డల్లా్‌సలో భారత సంతతికి చెందిన చంద్ర నాగమల్లయ్య అనే వ్యక్తి దారుణ హత్య ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు దిగుమతులపై సుంకాలు విధించాలంటూ జీ-7, నాటోకు అమెరికా పిలుపునివ్వడాన్ని తీవ్ర బెదిరింపు చర్యగా చైనా వ్యాఖ్యానించింది. అమెరికా పిలుపునకు స్పందించి సుంకాలు విధిస్తే తమ నుంచి ప్రతీకార చర్యలుంటాయని హెచ్చరించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 06:51 AM