Donald Trump: ఉక్రెయిన్‌కు సైనికసాయం బంద్
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:36 AM
రష్యాతో యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు గత కొన్నేళ్లుగా అందిస్తున్న సైనిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని,

అమెరికా నిర్ణయం.. తక్షణం అమల్లోకి.. 100 కోట్ల డాలర్ల ఆయుధ సామగ్రి సరఫరాపై ప్రభావం
ట్రంప్ నాయకత్వంలో నడుస్తాం
ఖనిజాలు అప్పగించేందుకూ సిద్ధం
ఎక్స్‌లో జెలెన్‌స్కీ ప్రకటన
వైట్ హౌస్‌లో వాగ్వాదంపై పశ్చాత్తాపం
వాషింగ్టన్, మార్చి 4: రష్యాతో యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు గత కొన్నేళ్లుగా అందిస్తున్న సైనిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, 100 కోట్ల డాలర్లకుపైగా (రూ.8,722 కోట్ల) విలువైన ఆయుధ సామగ్రి సరఫరా మీద ప్రభావం పడుతుందని అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అంతేగాక, ‘ఉక్రెయిన్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఇనిషియేటివ్’ కింద అమెరికా కంపెనీల నుంచి ఆయుధాలను కొనుగోలు చేయటానికి ఉక్రెయిన్‌కు అందిస్తున్న లక్షలాది డాలర్ల సాయం కూడా నిలిచిపోనుందన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన పలువురు అధికారులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ కట్టుబడి ఉందని ట్రంప్ నిర్ధారించుకునేంతవరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. అమెరికా అంతర్గతవ్యవహారాల శాఖ ప్రకారం.. రష్యా ఆక్రమణ మొదలైన తర్వాత 2022 ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకూ ఉక్రెయిన్‌కు అమెరికా 6,590 కోట్ల డాలర్ల (రూ.5,74,811 కోట్ల) సైనిక సాయాన్ని అందించింది. ఇటీవల అమెరికాను సందర్శించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వైట్‌హౌ్‌సలోనో ఓవల్ ఆఫీసులో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, ఉక్రెయిన్‌కు ట్రంప్ సైనికసాయాన్ని నిలిపివేయటం గమనార్హం.
ముగింపు లేని యుద్ధం కోరుకోవడం లేదు
సైనిక సాయం నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన గంటల వ్యవధిలోనే జెలెన్‌స్కీ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌లో సుస్థిర శాంతి నెలకొనేందుకు ట్రంప్ దృఢమైన నాయకత్వంలో పనిచేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘శుక్రవారం వైట్‌హౌజ్‌లో జరిగిన మా సమావేశం అనుకున్న రీతిలో సాగలేదు. అందుకు చింతిస్తున్నా. పరిస్థితులను చక్కదిద్దాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని పేర్కొన్నారు. ‘‘ముగింపులేని యుద్ధం కొనసాగాలని ఎవరమూ కోరుకోవడం లేదు. శాంతి కావాలని ఉక్రెయిన్లకు తప్ప ఇంకెవరికి ఉంటుంది? సుస్థిరమైన శాంతి సాధన కోసం అధ్యక్షుడు ట్రంప్ సమర్థ నాయకత్వంలో నేను, నా బృందం కలిసి నడుస్తాం’’ అంటూ అమెరికాకు అనుకూలంగా అభిప్రాయాలను వెల్లడించారు. తొలుత గగనతలంలో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ‘‘యుద్ధాన్ని ముగించడం కోసం సత్వరమే ప్రయత్నాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒప్పందంలో భాగంగా తొలిదశలో ఖైదీలను విడుదల చేస్తాం. గగనతలంలో శాంతి నెలకొనేలా చూస్తాం. క్షిపణులు, దీర్ఘశ్రేణి డ్రోన్లు, ఇంధన వనరులు, పౌర సదుపాయాలపై బాంబుల ప్రయోగాన్ని నిషేధిస్తాం. తరువాత సముద్రంపై జరుగుతున్న యుద్ధానికి సంబంధించి సంధి కుదుర్చుకుంటాం. రష్యా కూడా ఇలాగే చేస్తే అనంతర దశలపై కూడా సత్వర చర్యలు తీసుకుంటాం. అమెరికాతో కలిసి పనిచేసి బలమైన తుది ఒప్పందాన్ని కుదుర్చుకుంటాం’’ అని వివరించారు. ఇంతవరకు అమెరికా చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెబుతూ ఖనిజాల విషయమై ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని తెలిపారు. ‘‘ఉక్రెయిన్ సార్వభౌమ అధికారం, స్వాతంత్య్రం పరిరక్షణకు అమెరికా అందించిన సాయాన్ని గౌరవిస్తున్నాం’’ అన్నారు.
రష్యాపై అమెరికా ఆంక్షల ఎత్తివేత!
రష్యాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఏయే అంశాలపై ఆంక్షలను తగ్గించవచ్చో జాబితా రూపొందించాలంటూ అధ్యక్షుడి కార్యాలయమైన ఽశ్వేత సౌధం నుంచి ఆర్థిక శాఖకు సమాచారం అందించింది. కొన్ని వస్తువులతో పాటు, వ్యక్తులపై విధించిన ఆంక్షలను కూడా తగ్గించనుంది. ఆ దేశ ప్రభుత్వంపై ప్రభావం చూపే సంపన్నుల (కులీనులు)పై ఉన్న ఆంక్షలను కూడా ఎత్తివేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకు ప్రతిగా ఏమి ఆశిస్తున్నారన్నది ఇంకా తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్
Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ
Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు
Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.