Bahrain for Food Packet Fraud: గల్ఫ్‌లో ఐదుగురు తెలంగాణ ప్రవాసీలకు రెండేళ్ల జైలు.. దేశ బహిష్కరణ
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:09 AM
సంస్థ యజమానితో కలిసి ఆహార ప్యాకెట్లపై గడువు ముగింపు తేదీలను మార్చడం ద్వారా మోసాలకు పాల్పడ్డారనే కేసులో ఐదుగురు తెలంగాణ ప్రవాసీలు జైలు పాలయ్యారు. ...
19 మంది ప్రవాస భారతీయులకూ అదే శిక్ష
ఆహార ప్యాకెట్లపై గడువు తేదీ మార్చినందుకు బహ్రెయిన్ కోర్టు తీర్పు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): సంస్థ యజమానితో కలిసి ఆహార ప్యాకెట్లపై గడువు ముగింపు తేదీలను మార్చడం ద్వారా మోసాలకు పాల్పడ్డారనే కేసులో ఐదుగురు తెలంగాణ ప్రవాసీలు జైలు పాలయ్యారు. న్యాయస్థానం వీరికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ విధించింది. అలాగే, ఇద్దరు అరబ్బు యజమానులు, ఓ భారతీయ మేనేజరు సహా 19 మంది ప్రవాస భారతీయులు కూడా జైలు శిక్ష పడిన వారిలో ఉన్నారు. బహ్రెయిన్‌లో ఆహార పదార్థాలను సరఫరా చేసే ఓ ప్రముఖ సంస్థలో నిజామాబాద్‌కు చెందిన ముగ్గురు.. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు పని చేస్తున్నారు. అయితే, ఇదే సంస్థలో పని చేయడానికి వచ్చిన ఉద్యోగి ఒకరు అందులో పని విషయమై వివాదం ఏర్పడడంతో సంస్థ కార్యకలాపాలను వీడియో రికార్డింగ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు సంస్థ గిడ్డంగులపై దాడులు చేసి ప్యాకింగ్ చేసిన వివిధ రకాల ఆహార పదార్థాల ప్యాకెట్లపై గడువు ముగిసిన తేదీలను మారుస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని బహ్రెయినీ జాతీయులైన అరబ్బు యజమానులతో సహా మొత్తం 29 మందిని అరెస్టు చేశారు. కానీ, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయస్థానం ఏడుగురు భారతీయులను విడుదల చేయగా.. మిగిలిన 22 మందికి రెండేళ్ల జైలు శిక్షలు విధించింది. ప్రవాస భారతీయుల జైలు శిక్షను రద్దు చేయాలని బహ్రెయిన్‌లోని సామాజిక కార్యకర్త కోటగిరి నవీన్, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ సింగిరెడ్డి నరేశ్‌రెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News