Saudi Weather Alert: సౌదీ ఎడారిలో వర్ష బీభత్సం.. నీటమునిగిన రోడ్లు..
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:01 PM
సౌదీ అరేబియాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జెడ్డా, మక్కా సమీపంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి కురిసిన వర్షంతో రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి, రాబోయే రెండు రోజులు వాతావరణం ఇలాగే కొనసాగుతుందని హెచ్చరించింది.
సాధారణంగా సౌదీ అరేబియా పేరు వింటే మండే ఎడారులు గుర్తుకు వస్తాయి. అలాంటిది ఇప్పుడు ఇక్కడ మేఘాలు గర్జిస్తున్నాయి. సౌదీ అరేబియాలోని మక్కా, జెడ్డా, రబీగ్, ఖులైస్, బహ్రా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం, ఆకస్మిక వరదలు, బలమైన ఈదురు గాలులు, ఉరుములతో కూడిన తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో హైల్, ఖాసిమ్, తబుక్, మక్కా, అసిర్, అల్ బహా వంటి ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని.. భద్రతా మార్గదర్శకాలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా రెడ్ అలర్ట్ జోన్లు చాలా ప్రమాదాల్లో ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
భారీ వరదల కారణంగా రోడ్లు సరస్సుల్లా మారిపోవడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాల్సిందిగా సూచించారు. సినిమా హాల్స్ మూసివేశారు. వరదల కారణంగా రోడ్లపై నీరు చేరడంతో ప్రజలు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. రానున్న రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో అంతర్జాతీయ కార్యక్రమాలు వాయిదా వేయాల్సి వచ్చింది. జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను అకస్మాత్తుగా నిలిపివేయాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా రాయబార కార్యాలయం తన గాలా ఈవెంట్‌ను కూడా రద్దు చేసుకుంది.
మదీనా, తబుక్, అల్ జాఫ్, ఉత్తర సరిహద్దు ప్రాంతాలతో పాటు తూర్పు ప్రావిన్స్‌లో బుధవారం, గురువారం వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వరదల కారణంగా ప్రాణ నష్టాలు జరుగుతున్నాయని పుకార్లను నమ్మవొద్దని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిస్క్యూ టీమ్స్ తో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. కాగా, వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
H-1B visa: హెచ్1బీ వీసాదారులకు కొత్త రూల్.. వీసా అపాయింట్‌మెంట్స్ వాయిదా..
Pak Army Spokesman: మహిళా రిపోర్టర్‌పై కన్నుగీటిన పాక్ ఆర్మీ ప్రతినిధి..