Share News

Pope Francis Passes Away: పోప్‌ ఫ్రాన్సిస్‌ అస్తమయం

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:00 AM

ఈస్టర్‌ సందేశం చెప్పిన మరుసటి రోజే పోప్‌ ఫ్రాన్సిస్‌ మృతి చెందారు. భారత ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది, కొత్త పోప్‌ ఎన్నికపై చర్చ మొదలైంది

Pope Francis Passes Away: పోప్‌ ఫ్రాన్సిస్‌ అస్తమయం

  • ప్రజలకు ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపిన మరుసటి రోజే తుదిశ్వాస విడిచిన పోప్‌

  • శ్వాసకోశ సమస్యలతో ఇటీవల ఆస్పత్రిలో..

  • మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

వాటికన్‌ సిటీ, న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): క్యాథలిక్‌ మతపెద్ద, రోమ్‌ బిషప్‌ పోప్‌ ఫ్రాన్సిస్‌(88) ఇక లేరు. ఆదివారం ఈస్టర్‌ సందేశం ఇచ్చిన ఆయన ఇటలీ కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 7.35 గంటలకు వాటికన్‌ సిటీలోని తన కాసా శాంటా మార్టా నివాసంలో తుది శ్వాస విడిచారని వాటికన్‌ ప్రకటించింది. ఫ్రాన్సిస్‌ శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియాతో ఫిబ్రవరి 14న ఆస్పత్రిలో చేరి 38 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఆపై కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆదివారం సెయింట్‌ పీటర్‌ స్క్వేర్‌లో ప్రజలకు స్వయంగా ఈస్టర్‌ శుభాకాంక్షలు కూడా చెప్పారు. భక్తులకు ఈస్టర్‌ సందేశం ఇచ్చారు. మరుసటి రోజే ఆయన ప్రాణాలు కోల్పోయారు. గుండె పోటుతో ఆయన మరణించినట్లు ఇటలీ వార్త సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కాగా, ఈస్టర్‌ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌.. పోప్‌ ఫ్రాన్సి్‌సను కలిశారు. ప్రధాని మోదీ 2021, 2024లో ఫ్రాన్సి్‌సను కలిసి భారతదేశానికి ఆహ్వానించారు.


పోప్‌ ఫ్రాన్సిస్‌ వచ్చే ఏడాది భారతదేశానికి రావాల్సి ఉండగా, ఇంతలోనే ఆయన మరణించడం బాధాకరం. కాగా, ఫ్రాన్సిస్‌ మృతి పట్ల భారత ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. మంగళవారం, బుధవారం, అలాగే ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు నిర్వహించే రోజు సంతాప దినాలుగా పాటించాలని తెలిపింది. కాగా, 1937లో పోప్‌ ఫ్రాన్సిస్‌ అర్జెంటీనాలో జన్మించారు. పోప్‌ బెనడిక్ట్‌ తర్వాత 2013లో ఫ్రాన్సిస్‌ 266వ పోప్‌గా బాధ్యతలు చేపట్టారు. ఫ్రాన్సిస్‌ ప్రజల పోప్‌గా పేరు తెచ్చుకున్నారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ సామాజిక అంశాలపై ఆయన మాట్లాడుతుండే వారు. కాగా, దక్షిణ అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన తొలి వ్యక్తి ఫ్రాన్సిస్‌ కావడం విశేషం. పోప్‌ అంత్యక్రియల ప్రక్రియలో ఫ్రాన్సిస్‌ కొంతకాలం క్రితం కొన్ని మార్పులు చేశారు. వాటికన్‌ సిటీ వెలుపల కూడా పోప్‌ను సమాధి చేసేలా ఆయన మార్పులు చేశారు.


ఫ్రాన్సిస్‌ తనను బాసిలికా ఆఫ్‌ శాంటా మరియా మ్యాగోరియాలో సమాధి చేయాలని కోరుకున్నారు. పోప్‌ మరణాన్ని ధ్రువీకరించిన తర్వాత ఆయన ఉంగరాన్ని ధ్వంసం చేస్తారు. పోప్‌ పార్థివ దేహాన్ని బాసిలికా ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆపై ఆచారాల ప్రకారం పోప్‌ పార్థివదేహాన్ని ఖననం చేస్తారు. పోప్‌ చనిపోయిన తర్వాత 4 నుంచి 6 రోజుల్లో అంత్యక్రియలు పూర్తిచేస్తారు. అంత్యక్రియల తర్వాత 9 రోజులు సంతాప దినాలు పాటిస్తారు. అవి పూర్తయ్యాక తదుపరి పోప్‌ ఎన్నిక ప్రక్రియ మొదలు పెడతారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ మరణం పట్ల భారత్‌ క్యాథలిక్‌ బిషప్స్‌ కాన్ఫరెన్స్‌తో పాటు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌, ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ తదితరులు సంతాపం ప్రకటించారు. ఫ్రాన్సిస్‌ మరణంతో తదుపరి పోప్‌ ఎవరనే చర్చ మొదలైంది. తదుపరి పోప్‌ రేసులో ఇటలీకి చెందిన 70ఏళ్ల కార్డినల్‌ పిట్రో పెరోలిన్‌, డెమెక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోకు చెందిన 65ఏళ్ల కార్డినల్‌ ఫ్రీడోలిన్‌ అంబోంగో బెసుంగు, ఇటలీకి చెందిన 69ఏళ్ల కార్డినల్‌ మెట్టో పేర్లు వినిపిస్తున్నాయి.


పోప్‌ ఎంపిక విధానం?

పోప్‌ ఎన్నికకు రహస్య ఓటింగ్‌ నిర్వహిస్తారు. 80 ఏళ్ల లోపు వయసున్న కార్డినల్స్‌ ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు. మొత్తం 252 మంది కార్డినల్స్‌లో 138 మందికి ఓటింగ్‌లో పాల్గొనే అర్హత ఉంది. రోజుకు నాలుగు రౌండ్ల ఓటింగ్‌ చొప్పున ఎవరైన అభ్యర్థికి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చేవరకు ఓటింగ్‌ జరుగుతుంది. ప్రతి సెషన్‌లో బ్యాలెట్‌ పేపర్లకు నల్లటి పొగ వెలువడే రసాయనాలు కలిపి కాల్చుతారు. ఆ సమయంలో ఏ అభ్యర్థి పేరు బ్యాలెట్‌ పేపర్‌ కాల్చుతుండగా తెల్లటి పొగ వస్తుందో ఆ అభ్యర్థి పోప్‌గా ఎన్నికైనట్లు. పోప్‌ ఎన్నికలో ఆరుగురు భారత కార్డినల్స్‌కు ఓటు వేసే అర్హత ఉంది. వారు కార్డినల్‌ ఫలిప్‌ నెరీ ఫెర్రో(72), కార్డినల్‌ క్లెమిస్‌ బెసిలియోస్‌(64), కార్డినల్‌ అంథోని పూల(63), కార్డినల్‌ జార్జ్‌ జాకోబ్‌ కూవకడ్‌(51), కార్డినల్‌ ఓస్వల్డ్‌ గ్రెసియస్‌(80), కార్డినల్‌ జార్జ్‌ అలెంచెరీ(79).


Read Also: Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీని చంపేసిన భార్య

SpaDeX: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్..

China Hydrogen Bomb: చైనా సరికొత్త హైడ్రోజన్‌ బాంబు

Updated Date - Apr 22 , 2025 | 04:00 AM