Share News

PoK Student Protests: పెల్లుబికిన యువత ఆగ్రహం.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కలకలం

ABN , Publish Date - Nov 07 , 2025 | 08:54 PM

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని యువత ప్రభుత్వంపై కదను తొక్కుతోంది. అక్కడి విద్యావిధానంలో లోపాలపై వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతోంది.

PoK Student Protests: పెల్లుబికిన యువత ఆగ్రహం.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కలకలం
Student protest in PoK

ఇంటర్నెట్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మళ్లీ నిరసనలు చెలరేగాయి. వ్యవస్థలో లోపాలపై జెన్ జీ కదను తొక్కుతుండటంతో ప్రభుత్వంలో కలవరం మొదలైంది.

ఆర్థిక వ్యవస్థపై అసంతృప్తితో పాక్ ఆక్రమిత కశ్మీర్‌‌లో జనాలు ఇటీవలే వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఇది మర్చిపోకముందే తాజాగా యువత కూడా రంగంలోకి దిగింది. ప్రధాని షహబాజ్ షరీఫ్ సారథ్యంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావిధానం లోపభూయిష్టంగా ఉందంటూ యువత నిరసనలకు తెరలేపారు. ముజఫ్ఫరాబాద్‌లోని ఆజాద్ జమ్ము అండ్ కశ్మీర్ యూనివర్సిటీ విద్యార్థులు తొలుత నిరసన బాట పట్టగా క్రమంగా ఇతర ప్రాంతాల్లోని వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. పరీక్ష ఫలితాల్లో అవకతవకలు, ఫీజుల పెంపుపై మండిపడుతున్నారు (Pok Student Protests).

దాదాపు ఆరు నెలల జాప్యం తరువాత ఇటీవలే అక్కడ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కొందరికి ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయి. మరికొందరేమో అసలు పరీక్షే రాయకపోయినా పాసయిపోయారు. ఇది చాలదన్నట్టు రీకరెక్షన్ కోసం రూ.1500ల ఫీజును నిర్ణయించడంతో విద్యార్థులకు తిక్కరేగింది. ఇక నిరసనల సందర్భంగా ఓ వ్యక్తి విద్యార్థులపై కాల్పులకు దిగాడు. పోలీసుల సమక్షంలోనే ఈ దారుణం జరిగింది. దీంతో, యువత ఆగ్రహావేశాలు మిన్నంటాయి.


అప్రమత్తంగా షరీఫ్ ప్రభుత్వం

నేపాల్ జెన్ జీ తీరులో విద్యార్థులు, యువత ఉద్యమబాట పట్టడంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నిరసనలు పాక్‌లోని ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉండటంతో నిరసనలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే యూనివర్సిటీల్లో నిరసన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే, విద్యార్థి ఉద్యమానికి తాము మద్దతుగా నిలుస్తామని జమ్మూకశ్మీర్ జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ పేర్కొంది. దీంతో, ఉద్యమం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

షుగర్ వ్యాధి ఉంటే ఇక వీసా రానట్టే.. అమెరికా నిబంధనలు మరింత కఠినతరం

హెబ్-1బీ వీసా.. లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 07 , 2025 | 09:07 PM