PM Modi: కీలకమైన ఖనిజాలను ఆయుధాలుగా వాడుకోవద్దు.. బ్రిక్స్ ప్రసంగంలో మోదీ
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:48 PM
కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై మోదీ మాట్లాడుతూ, మానవతా విలువలు, సామర్థ్యాల పెంపునకు ఇదొక సాధనంగా ఇండియా నమ్ముతుందన్నారు. 'ఏఐ ఫర్ ఆల్' అనే మంత్రంతో ముందుకు వెళ్తున్నామని, అనేక రంగాల్లో ఏఐని సమర్ధవంతంగా భారత్ ఉపయోగించుకుంటోందని చెప్పారు.
రియో డి జనీరో: అత్యాధునిక సాంకేతిక పరికరాల తయారీలో కీలకమైన ఖనిజాలను ఏ దేశం స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకుండా, ఇతరులపై ఆయుధాలుగా ఉపయోగించుకునే పరిస్థితి రాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఖనిజాల సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకునేందుకు సభ్యదేశాలు కలిసికట్టుగా కృషిచేయాలని బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పిలుపునిచ్చారు. క్రిటికల్ మినరల్స్ రంగంలో చైనా అధిపత్యం పెరుగుతుండటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది బ్రిక్స్ అద్యక్ష స్థానంలో భారత్ మానవతా విధానాలకు కీలక ప్రాధాన్యమిస్తుందని మోదీ చెప్పారు. బ్రిక్స్‌ను.. బిల్డింగ్ రీసీలియన్స్ అండ్ ఇన్నొవేషన్ ఫర్ కొవాపరేషన్ అండ్ సస్టెయినబిలిటీ అనే కొత్త రూపంలో పునర్నిర్వచించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. జి-20 చైర్మన్‌షిప్ తీసుకున్నప్పుడు ఏవిధంగా ఎజెండాలో గ్లోబల్ సౌత్ అంశాలకు ప్రాధాన్యతనిచ్చామో బ్రిక్స్ సదస్సులోనూ దానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా మానవతా విధానాలకు తొలి ప్రాధాన్యమిస్తామని చెప్పారు.
కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై మోదీ మాట్లాడుతూ, మానవతా విలువలు, సామర్థ్యాల పెంపునకు ఇదొక సాధనంగా ఇండియా నమ్ముతుందన్నారు. 'ఏఐ ఫర్ ఆల్' అనే మంత్రంతో ముందుకు వెళ్తున్నామని, అనేక రంగాల్లో ఏఐని సమర్ధవంతంగా భారత్ ఉపయోగించుకుంటోందని చెప్పారు. వచ్చే ఏడాది భారత్ లో 'ఏఐ ఇంపాక్ట్' సదస్సును నిర్వహిస్తామన్నారు.
బ్రిక్స్ సందర్భంగా క్యూబా అధ్యక్షుడు మియో డియోజ్ కనెల్ బెర్ముడెజ్, మలేసియా ప్రధానమంత్రి అన్వర్ బిన్ ఇబ్రహీం, ఉరుగ్వే అధ్యక్షుడు యమందు ఓర్సి, బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆల్బెర్టో ఆర్స్ కాటకోరాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
ఇవి కూాడా చదవండి..
14 దేశాలకు ట్రంప్ లేఖలు.. సుంకాలు తప్పవంటూ వార్నింగ్
అస్థికలతో అంతరిక్ష ప్రయాణం.. తిరిగొస్తుండగా..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి