Space Burial: అస్థికలతో అంతరిక్ష ప్రయాణం.. తిరిగొస్తుండగా..
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:55 PM
అంతరిక్షంలోకి అస్థికలను తీసుకెళ్లే ప్రయోగం విఫలమయింది. స్పేస్ క్యాప్సుల్‌లో 166 మంది అస్థికలను తీసుకెళ్లేందుకు జర్మనీ సంస్థ ప్రయోగం చేసింది. అయితే..
Space Burial: మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి అస్థికలను గంగలో కలపడం ఆచారం. ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్ముతారు. అయితే, అలాంటి అస్థికలతో జర్మనీ సంస్థ వింత ప్రయోగం చేసి చివరకు ఫెయిల్ అయింది. వివరాల్లోకి వెళ్తే..
జర్మనీకి చెందిన ది ఎక్స్‌ప్లొరేషన్ కంపెనీ మిషన్ పాజిబుల్ అనే పేరుతో ఒక వింత ప్రయోగం చేపట్టింది. NYX క్యాప్సుల్‌ను డెవలప్ చేసి జూన్ 23న అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఇందులో అంత వింతగా ఏం ఉందని అనుకుంటున్నారా? ఇందులో 166 మంది అస్థికలతో పాటు కొన్ని శాస్త్రీయ ప్రయోగాల కోసం కొన్ని రకాల విత్తనాలు, ఇతర వస్తువులను నింగిలోకి పంపించింది. అంగారక గ్రహంపై గంజాయి సాగు సాధ్యమేనా? అన్న విషయాన్ని పరిశీలించేందుకు గంజాయి విత్తనాలు పంపించారు. ఇది అంతరిక్ష సమాధి సేవలు అందించే అమెరికాకు చెందిన సెలెస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది.
సెలెస్టిస్ సంస్థ.. ఈ మిషన్ ద్వారా తొలిసారి అంతరిక్షంలోకి అస్థికలను తీసుకెళ్లి తిరిగి భూమికి తీసుకురావాలనేది వారి లక్ష్యం. ఇందులో భాగంగా.. ఆ క్యాప్సుల్ భూమిని రెండు సార్లు విజయవంతంగా చుట్టి, భూమికి తిరిగి రావాలి. అయితే, ఈ క్యాప్సుల్ భూమికి తిరిగి వస్తున్న సమయంలో అనుకోకుండా ప్రయోగ కేంద్రంతో కమ్యూనికేషన్ కోల్పోయింది. ఇంకేముంది కేవలం కొద్ది క్షణాలకే ఈ క్యాప్సుల్ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ఇలా అది చేపట్టాలనుకున్నా వింత ప్రయోగం విఫలం అయింది.
ప్రస్తుతం ఈ మిషన్ ఫెయిల్ అవ్వడానికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, ప్రయోగం ఫెయిల్ అయినందుకు ఆ కంపెనీ బాధిత కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పింది. కానీ ఏం చేస్తాం.. పోయిన అస్థికలు తిరిగి రావు కదా.. అనవసరంగా ప్రయోగానికి పోయి తమ ప్రియమైన వారి అస్థికలు కోల్పోయామని ఆ బాధిత కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు.