Pak vs Ind: పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. క్షిపణి ప్రయోగం..
ABN , Publish Date - May 03 , 2025 | 03:39 PM
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా భారత్ నిర్ణయాలు ఉండటంతో ఆగమాగమైపోతోంది. సరిహద్దుల వెంబడి భారీగా సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
న్యూఢిల్లీ, మే 03: పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా భారత్ నిర్ణయాలు ఉండటంతో ఆగమాగమైపోతోంది. సరిహద్దుల వెంబడి భారీగా సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణి షాహీన్-2 ని ప్రయోగించింది. అబ్దాలి వెపన్ సిస్టమ్‌గా పిలిచే ఈ క్షిపణిని ఇండస్ ఎక్సర్‌సైజ్‌లో ప్రయోగించినట్లు పాక్ ప్రకటించింది. ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంపై 450 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించగలదని పాకిస్తాన్ ప్రకటించింది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఈ క్షిపణి పరీక్ష చేపట్టడం మరింత ఉత్కంఠను రేపుతోంది. పాక్ చేపట్టిన ఈ క్షిపణి ప్రయోగం భారత్‌ను రెచ్చగొట్టే చర్యలో భాగంగానే చూస్తున్నారు విశ్లేషకులు.
పాకిస్తాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి ఇదే..
బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన పాకిస్తాన్.. కీలక ప్రకటన చేసింది. ఈ ప్రయోగం ద్వారా పాకిస్థాన్ తమ ఆర్మీ సంసిద్ధతను చాటిచెప్పడంతో పాటు అధునాతన నావిగేషన్ వ్యవస్థ, యుద్ధ సామర్థ్యం, నూతన టెక్నాలజీ వ్యవస్థల వినియోగాన్ని చాటిచెప్పడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. దేశ జాతీయ భద్రతను కాపాడటానికి దళాల కార్యాచరణ సంసిద్ధత, సాంకేతిక నైపుణ్యంపై ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతులు పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారని పాక్ పేర్కొంది.
ఇదిలాఉంటే.. భారత్, పాక్ నియంత్ర రేఖ వెంబడి.. ఆ దేశం నిరంతరాయంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తద్వారా భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు పాక్ కాల్పులకు భారత్ ధీటైన జవాబిస్తోంది. పహల్గాం దాడుల తర్వాత పాకిస్తాన్ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. యుద్ధోన్మాదంతో రెచ్చిపోతున్నారు. భారత్ మరో 36 గంటల్లో పాకిస్తాన్‌పై దాడి చేస్తుందని ఆ దేశ సమాచార శాఖా మంత్రి అతుల్లా తారా కామెంట్స్ చేయగా.. ఈ రెండు మూడు రోజుల్లో ఏదైనా జరుగొచ్చని పాక్ రక్షణ శాఖ మంత్రి అన్నారు.
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం బైసారన్ గడ్డి మైదానంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఉగ్రవాద సంస్థ లష్కర్ ఇ తోయిబాతో పాటు.. పాకిస్థాన్ ప్రమేయం కూడా ఉన్నట్లు భారత్ గుర్తించింది. దీంతో పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు భారత్ అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్థాన్ జాతీయుల అన్ని వీసాలను రద్దు చేసింది. భారత్‌లో నివసిస్తున్న పాకిస్థాన్ పౌరులందరూ భారత్‌ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను కూడా తగ్గించుకుంది. పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని దిగుమతులను నిషేధించింది. ఆ దేశ జెండాలు కలిగిన నౌకలను భారత జలాల్లోకి ప్రవేశించకుండా నిషేధించింది.
Also Read:
షాకింగ్ ఘటన.. నడిరోడ్డుపై ఓ వ్యక్తి
పెంచలకోన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రి ఆనం సమీక్ష
10 ఏళ్ల పాటు యూఎస్‌లో ఉద్యోగం.. లేఆఫ్స్ తరువాత
For More International News and Telugu News..