Share News

Saifullah Kasuri: పాక్‌ ర్యాలీలో పాల్గొన్న పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి

ABN , Publish Date - May 29 , 2025 | 03:56 PM

పహల్గాం ఉగ్రవాది వెనుక కీలక సూత్రధారి సైపుల్లా కసూరీ పాకిస్థాన్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాడు. అలాగే లష్కరే తోయిబీ చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నాడు.

Saifullah Kasuri: పాక్‌ ర్యాలీలో పాల్గొన్న పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి
Saifullah Kasuri alias Khalid

లాహోర్, మే 29: పాకిస్థాన్ మర్కజి ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) ఆధ్వర్యంలో దేశ అణు పరీక్షల వార్షికోత్సవ ర్యాలీని బుధవారం నిర్వహించింది. ఈ ర్యాలీలో రాజకీయ నేతలతో కలిసి పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సైపుల్లా కసూరీ సైతం పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సైఫుల్లా కసూరీ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారిని తానేనంటూ భారత్ ప్రకటించిందన్నారు. ఈ విధంగా తాను ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించానని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ జరిపిన దాడిలో మరణించిన ముద్దస్సీర్ షాహీద్ పేరిట పంజాబ్ ప్రావిన్స్‌లోని అల్హఅబాద్‌లో ఆసుపత్రులు, రహదారులను నిర్మిస్తామన్నారు. అలాగే అతడి పేరును ఒక సెంటర్‌కు పెడతామని చెప్పారు. ఇక భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న తల్హా సయీద్ సైతం ఈ ర్యాలీలో పాల్గొని భారత్‌కు వ్యతిరేకంగా విషం చిమ్మాడు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడే ఈ తల్హా సయీద్.


2024లో ఆ దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లాహోర్ ఎన్ఏ 22 స్థానం నుంచి పోటీ చేసి ఈ తల్హా సయీద్ ఓటమి పాలయ్యాడు. అతడు పాకిస్థాన్ మర్కజి ముస్లిం లీగ్‌కు అనుబంధంగా కొనసాగుతున్నాడు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో గతంలో చేసుకున్న సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. భారత్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, ఫైసలాబాద్ తదితర నగరాల్లో పీఎంఎంఎల్ ఆధ్వర్యంలో భారీగా ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనల్లో హపీజ్ సయీద్ సైతం పాల్గొని భారత్‌కు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించిన విషయం విధితమే. ఇక అంతర్జాతీయంగానే కాదు.. పాకిస్థాన్‌లో సైతం లష్కరే తోయిబాపై నిషేధం ఉంది. 2008 ముంబై దాడులకు ఇతడే సూత్రధారి అని ఐక్యరాజ్యసమితి గతంలోనే ప్రకటించింది. అతడు ఈ పీఎంఎంఎల్ వెనుక ఉండి నడిపిస్తున్నాడనే చర్చ బలంగా సాగుతోంది.

Updated Date - May 29 , 2025 | 03:58 PM