Share News

Israel-Hamas: హమాస్, ఎల్‌ఈటీ మధ్య సంబంధాలు.. భారత్‌కు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి

ABN , Publish Date - Dec 07 , 2025 | 09:44 PM

హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాలని ఇజ్రాయెల్ భారత్‌ను కోరింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు. పాక్ ఉగ్ర సంస్థ ఎల్‌ఈటీతో హమాస్‌కు సంబంధాలు ఉన్నాయని తెలిపారు.

Israel-Hamas: హమాస్, ఎల్‌ఈటీ మధ్య సంబంధాలు.. భారత్‌కు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి
Hamas Terrorist Organization

ఇంటర్నెట్ డెస్క్: పాలస్తీనాకు చెందిన హమాస్‌‌ గ్రూపును ఉగ్రసంస్థగా గుర్తించాలని ఇజ్రాయెల్ (Israel) భారత్‌ను తాజాగా కోరింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తయ్యబాతో హమాస్‌కు సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా ఉన్న వివిధ మిలిటెంట్ సంస్థల సాయంతో హమాస్ గాజాలో మళ్లీ బలం పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న భయాల నడుమ ఇజ్రాయెల్ అధికారి ఈ కామెంట్స్ చేశారు (Hamas terrorist designation India).

‘హమాస్ లాంటి గ్రూపులను టెర్రరిస్టు సంస్థలుగా భారత్ ప్రకటించాలి. కొన్నేళ్ళ క్రితం లష్కరే తయ్యబాను ఇజ్రాయెల్ ఉగ్రసంస్థగా ప్రకటించింది. భారత్ నుంచి కూడా ఇలాంటి సహకారాన్ని ఆశిస్తున్నాము’ అని పేర్కొన్నారు. 2023లో ఇజ్రాయెల్ ఎల్‌ఈటీని ఉగ్రసంస్థగా ప్రకటించింది.


అంతకుమునుపు ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) కూడా భారత్‌కు ఇదే తరహా విజ్ఞప్తి చేశాయి. ఇరు దేశాలకు హమాస్ ఉమ్మడి శత్రువని పేర్కొన్నాయి. హమాస్ ఆస్తులను స్తంభింపజేయడం, హమాస్‌కు చెందిన వారిని నిషేధించడమే కాకుండా ఉగ్రసంస్థగా ముద్ర వేస్తే సంస్థ దురాగతాలను భారత్ అర్థం చేసుకున్నట్టు స్పష్టమైన సంకేతాలు వెళతాయి’ అని ఐడీఎఫ్ అధికారి ఒకరు అన్నారు.

ఇరాన్ మద్దతున్న గ్రూపులకు, వివిధ దేశాల్లోని ఉగ్ర సంస్థలకు మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని భారత్ గమనిస్తోందని కూడా సదరు ఇజ్రాయెల్ అధికారి అన్నారు. భారత్ నిర్ణయం తాలూకు ప్రభావం ఉపఖండంలోని ఇతర దేశాలపై కూడా ఉంటుందని పేర్కొన్నారు. పాలస్తీనా శరణార్థులకు సాయం చేస్తున్న ఐక్యరాజ్య సమితి విభాగం యూఎన్ఆర్‌డబ్ల్యూఏకు కూడా భారత్ నిధులు ఇవ్వొద్దని ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసింది. అయితే, ఈ అంశంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని కూడా తాము అర్థం చేసుకోగలమని పేర్కొంది.


ఇవీ చదవండి:

వివిధ దేశాల నుంచి భారతీయుల డిపోర్టేషన్.. వివరాలను వెల్లడించిన కేంద్రం

కూలిన అమెరికా ఎఫ్-16సీ ఫైటర్ జెట్.. పైలట్ సేఫ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 07 , 2025 | 09:44 PM