Share News

Iran: హోర్ముజ్‌ జలసంధిని మూసేస్తాం

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:23 AM

ఇజ్రాయెల్‌తో యుద్ధ వేళ ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని మూసేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఇరాన్‌ మరోసారి బెదిరించింది...

Iran: హోర్ముజ్‌ జలసంధిని మూసేస్తాం

  • మరోమారు హెచ్చరించిన ఇరాన్‌

  • మూసేస్తే భారత్‌కూ చిక్కులు

  • పెట్రో ధరలు పెరిగే అవకాశం

టెహ్రాన్‌, జూన్‌ 19: ఇజ్రాయెల్‌తో యుద్ధ వేళ ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని మూసేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఇరాన్‌ మరోసారి బెదిరించింది. ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ సీనియర్‌ కమాండర్‌, ఎంపీ సర్దార్‌ ఇస్మాయిల్‌ కౌసరి దీన్ని ధ్రువీకరించారు. ఇజ్రాయెల్‌-అమెరికా తమపై దాడి చేస్తే ఈ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ గతంలోనే హెచ్చరించింది. తాజాగా ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో ఇరాన్‌ అన్నంత పనీ చేస్తుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్‌ మధ్య ఉన్న ఇరుకైన ఈ జలసంధిలో ఓ చోట వె డల్పు కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.


చమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్‌, సౌదీ అరేబియా, ఇరాన్‌, యూఏఈ, ఓమన్‌ దేశాల నౌకలు రాకపోకలు సాగించేది హోర్ముజ్‌ జలసంధి గుండానే. ఆయా దేశాల నుంచి చైనా, భారత్‌, జపాన్‌, కొరియా దేశాల చమురు, ఎల్‌ఎన్‌జీ దిగుమతులకు ఇదే ప్రధాన ఆధారం. ప్రపంచవ్యాప్తంగా నిత్యం వినియోగించే చమురులో 20ు, సహజవాయువులో 25ు పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి ఈ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్‌ జలసంధిని మూసివేస్తే భారత్‌కు కూడా తిప్పలు తప్పవు. ఎందుకంటే మన ముడి చమురు అవసరాల్లో 90 శాతం, గ్యాస్‌ అవసరాల్లో 50 శాతానికి దిగుమతులే దిక్కు. మన చమురు దిగుమతుల్లో ఇరాక్‌, సౌదీ అరేబియా, కువైట్‌, యూఏఈల వాటా సగం వరకు ఉంటుంది. ఇరాన్‌ హోర్ముజ్‌ జలసంధిని మూసివేస్తే ఈ సరఫరాలకు తీవ్ర విఽఘాతం తప్పదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

Updated Date - Jun 20 , 2025 | 04:23 AM