F-35 Jets: ఎఫ్- 35 డీల్ జరిగే పనేనా?
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:35 AM
రెండో దేశం దానిని కొనడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాదు... అంతర్జాతీయ పరిస్థితులు, టెక్నాలజీలో వచ్చే మార్పులు ఇవన్నీ అందుకు అనుకూలించాలి.

మన రష్యన్ క్షిపణి వ్యవస్థ ఓ అడ్డంకి.. సొంత తయారీకే భారత్ మొగ్గు?
ట్రంప్‌ది ప్రతిపాదన మాత్రమేనన్న భారత విదేశాంగ కార్యదర్శి
ఒక అత్యాధునిక ఆయుధాన్ని ఒక దేశం మరో దేశానికి అమ్మాలంటే? అది ఒక ప్రకటనతో అయ్యేది కాదు. మొదటి దేశం తన ఆయుధాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉండాలి. రెండో దేశం దానిని కొనడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాదు... అంతర్జాతీయ పరిస్థితులు, టెక్నాలజీలో వచ్చే మార్పులు ఇవన్నీ అందుకు అనుకూలించాలి. ఎఫ్-35 యుద్ధ విమానాల్ని భారత్‌కు అమ్ముతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ అది వాస్తవ రూపం దాల్చే విషయంలో ఎన్నో అనుమానాలు, అవాంతరాలు ఉన్నాయి. వాటన్నింటినీ పరిశీలిస్తే ఎఫ్-35 కొనుగోలు ఒప్పందం జరగడానికంటే జరగకపోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది.
అమెరికా అమ్ముతుందా?
శుక్రవారం ట్రంప్ చేసిన ప్రకటనలో భారత్‌కు ఎఫ్-35 విమానాల్ని అమ్ముతామని సూటిగా చెప్పలేదు. ‘‘అంతిమంగా ఎఫ్-35లను భారత్‌కు అమ్మడానికి మార్గం సుగమం చేస్తాం’’ అని మాత్రమే అన్నారు. ఇందులో చాలా అంతరార్థం ఉంది. ఎందుకంటే ఎఫ్-35 అయిదో తరం యుద్ధ విమానం. ఇందులోని స్టెల్త్ టెక్నాలజీ చాలా అత్యాధునికమైనది. రాడార్లకు దొరకకుండా ప్రయాణించగల ఈ విమానాల పరిజ్ఞానం శత్రు దేశాల చేతికి ఎట్టి పరిస్థితుల్లోనూ చేరకుండా అమెరికా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. దానిని ఎవరికి అమ్మాలనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎఫ్-35 యుద్ధ విమానాల తయారీలో అమెరికాదే ప్రధాన పాత్ర అయినప్పటికీ అందులో అనేక నాటో దేశాల భాగస్వామ్యం ఉంది. నాటో దేశమైన తుర్కియే కూడా ఒకప్పుడు ఎఫ్-35 ప్రాజెక్టులో భాగంగా ఉండేది. అయితే రష్యాకు చెందిన ఎస్-400 విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థను కొనడానికి తుర్కియే సిద్ధమవ్వడంతో తుర్కియేకు, అమెరికాకు మధ్య విభేదాలు తతెత్తాయి. ఎస్-400లను కొంటే ఎఫ్-35 ప్రాజెక్టు నుంచి మిమ్మల్ని సాగనంపుతామని అమెరికా హెచ్చరించింది, అయినా తుర్కియే అది లెక్క చేయకుండా రష్యా క్షిపణి వ్యవస్థ కొనుగోలుకే మొగ్గుచూపింది. దీంతో టర్కీని అమెరికా బహిష్కరించింది. ఎఫ్-35లు రాడార్లకు దొరకని స్టెల్త్ విమానాలే అయినప్పటికీ రాడార్లను కొన్ని విపరీతమైన ఫ్రీక్వెన్సీల్లో ఆపరేట్ చేసినప్పుడు వాటిని కనిపెట్టే అవకాశం ఉంది.
ఒకే దేశం వద్ద ఎఫ్-35 విమానం, ఎస్-400 రాడార్లు ఉన్నప్పుడు ఏయే ఫ్రీక్వెన్సీల్లో దానిని కనిపెట్టవచ్చనే ప్రయోగాలు ఇబ్బడిముబ్బడిగా చేసే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఎఫ్-35కు సంబంధించిన బలహీనతలేమిటనే సమాచారం బయటపడి, అది అంతిమంగా రష్యా చేతికి చేరే ప్రమాదం ఉంటుంది. (గతంలో యుగోస్లావియాలో ఒక రాడార్ ఆపరేటర్ ఇలాగే అనూహ్యమైన ఫ్రీక్వెన్సీల్లో రాడార్‌ను ఆపరేట్ చేసి ఎఫ్-117 అనే అమెరికన్ స్టెల్త్ విమానాన్ని కూల్చివేయగలిగాడు) అందువల్లనే టర్కీ విషయంలో అమెరికా అంత కఠినంగా వ్యవహరించింది. ఇప్పుడు భారత్ విషయంలో కూడా అమెరికా ఇదే ప్రశ్నను ఎదుర్కోబోతోంది. రష్యా నుంచి అయిదు ఎస్-400 క్షిపణి వ్యవస్థల్ని కొనడానికి భారత్ 2018లోనే ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని కొనవద్దని అప్పట్లోనే అమెరికా చాలా ఒత్తిడి తెచ్చినా భారత్ పట్టించుకోకుండా రష్యాతో ఒప్పందం చేసుకుంది. మూడు రష్యన్ ఎస్-400 వ్యవస్థలు ఇప్పటికే భారత్‌కు అందాయి. మరో రెండు వ్యవస్థలు 2026లోగా డెలివరీ కానున్నాయి.
ఈ పరిస్థితుల్లో భారత్‌కు ఎఫ్-35 విమానాల్ని అమెరికా ఎలా అమ్మగలదు? అనేది చాలా పెద్ద ప్రశ్న. భారత్ ఎస్-400 ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, తన వద్ద ఇప్పటికే ఉన్న మూడు వ్యవస్థల్ని వేరే దేశానికి అమ్మేయాలని అమెరికా షరతు విధించే అవకాశాలు లేకపోలేదు. ‘‘ఎఫ్-35లను అంతిమంగా భారత్‌కు అమ్మడానికి మార్గం సుగమం చేస్తాం’’ అన్న ట్రంప్ మాటల్లో మతలబు ఇదే అయి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ అమెరికా ఇలాంటి షరతు విధిస్తే భారత్ అందుకు అంగీకరిస్తుందా? రష్యాతో దీర్ఘకాలంగా ఎంతో బలమైన రక్షణ సంబంధాలు ఉన్న భారత్... ‘‘మీ క్షిపణి వ్యవస్థలు మాకు వద్దు. మీతో ఒప్పందం రద్దు చేసుకుంటున్నాం’’ అని రష్యాకు తెగేసి చెప్పి అమెరికన్ విమానాల్ని కొంటుందా? అంటే అది జరిగే అవకాశాలు చాలా చాలా తక్కువేనని చెప్పవచ్చు.
భారత్ కొంటుందా?
ఒకవేళ అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాల్ని భారత్‌కు బేషరతుగా అమ్మడానికి సిద్ధపడినా భారత్ వాటిని కొనడానికి సిద్ధంగా ఉంటుందా? అనేది కూడా మరో పెద్ద ప్రశ్న. భారత్ ఇంతవరకూ ఎప్పుడూ ఎఫ్-35లను తమకు అమ్మాలని అమెరికాను కోరలేదు. అమెరికా కూడా వాటిని భారత్‌కు ఆఫర్ చేయలేదు. అయితే ఎఫ్-35 అభివృద్ధి ప్రాజెక్టులో భారత్ కూడా భాగస్వామి అయితే బాగుంటుందన్న ఆకాంక్షను మాత్రం అమెరికా ఒకటి, రెండుసార్లు వ్యక్తం చేసింది. కానీ భారత్ దానిపై ఎలాంటి ఆసక్తినీ చూపించలేదు. 126 మధ్యశ్రేణి యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయాలని 2001లో భారత వాయుసేన ప్రతిపాదించింది. ఆ ప్రకారం కొన్నేళ్ల తర్వాత భారత ప్రభుత్వం వివిధ దేశాల నుంచి ఆఫర్లు కోరింది. భారత్ పిలుపునకు స్పందించి అమెరికా తమ ఎఫ్-16, ఎఫ్-18 విమానాల్ని భారత్‌కు అమ్మజూపింది తప్ప ఎఫ్-35ను ఆఫర్ చేయలేదు. (అప్పటికే ఎఫ్-35 విమానం అనేక ప్రయోగాలు పూర్తి చేసుకుని తయారీలో తుది దశకు చేరుకుంటోంది) 2012లో అంతిమంగా రాఫెల్ విమానాన్ని భారత్ ఎంచుకుంది. అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని 126 నుంచి కేవలం 36కు కుదించారు. ఆ తర్వాత 2018లో భారత వాయుసేన మరో 114 విదేశీ విమానాల కొనుగోలుకు ఆఫర్లు కోరింది. అమెరికా మళ్లీ దీనికి స్పందించి పాత ఎఫ్-16 (ఎఫ్-21 అని పేరు మార్చారు), ఎఫ్-18లతోపాటు ఎఫ్-15ఈఎక్స్ అనే మరో విమానాన్ని బరిలోకి దించింది తప్ప ఎఫ్-35ను మాత్రం భారత్‌కు అమ్మజూపలేదు. భారత్ కూడా మాకు ఎఫ్-35లు అమ్ముతారా అని అమెరికాను అడగలేదు.
భారత వాయుసేన తన చరిత్రలో ఇంతవరకూ ఒక్క అమెరికన్ యుద్ధ విమానాన్ని కూడా కొనలేదు. హెలికాప్టర్లు, రవాణా విమానాలు మాత్రమే కొనుగోలు చేసింది. ఎందుకంటే... అమెరికా తన ఆయుధాలను నాటోయేతర దేశాలకు అమ్మేటప్పుడు చాలా ఆంక్షలు విధిస్తుంటుంది. అంతేకాకుండా తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి ఎంతమ్రాతం ఇష్టపడదు. అందువల్లనే భారత్ అమెరికా ఆయుధాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటుంది. ఒకవేళ అమెరికా భారత్‌కు ఎఫ్-35లను అమ్మజూపినా... అనేక సాంకేతికపరమైన ఆంక్షలు పెడుతుంది. వాటి వినియోగం విషయంలో కూడా షరతులు పెట్టే అవకాశం ఉంది. అందువల్ల అమెరికా ఇస్తామన్నా ఎఫ్-35ల కొనుగోలుకు భారత్ సిద్ధపడుతుందా అనేది అనుమానమే! అదీ రష్యాతో ఎస్-400 ఒప్పందాన్ని తెగతెంపులు చేసుకుని వీటిని కొనుగోలు చేస్తుందా అంటే మరీ అనుమానమే!! కానీ ట్రంప్ నేరుగా ఆఫర్ చేయడంతో ఈ విషయంలో కొంతమేర కదలిక ఏర్పడి ఒక స్థాయి వరకూ చర్చలు జరిగే అవకాశం మాత్రం ఉంది. ఆ చర్చలు ఫలప్రదమయ్యే స్థాయికి వెళితే మాత్రం అది నిజంగా అద్భుతమే. తాజాగా ట్రంప్ ప్రకటన తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ ట్రంప్‌ది ఒక ప్రతిపాదన మాత్రమేనని వ్యాఖ్యానించడం భారత వైఖరికి అద్దం పడుతోంది.
ఎఫ్-35 విశిష్టతలివీ...
అమెరికాకు చెందిన మూడు సాయుధ దళాలు ప్రధానంగా యుద్ధ విమానాలను ఉపయోగిస్తుంటాయి. ఒకటి వైమానిక దళం... ఇది నేలపై రన్‌వే నుంచి గాలిలోకి లేచే యుద్ధ విమానాల్ని ఉపయోగిస్తుంది. రెండోది మెరీన్స్... ఈ దళం చిన్న చిన్న యుద్ధ నౌకల నుంచి హెలికాప్టర్ల మాదిరిగా పైకి ఎగిరే వెర్టికల్ టేకాఫ్ విమానాల్ని ఉపయోగిస్తుంది. మూడోది... నౌకాదళం... ఇది కాటాపల్ట్ (పంగలకర్ర వంటి పరికరం) సాయంతో విమాన వాహక యుద్ధ నౌకల నుంచి టేకాఫ్ అయ్యే విమానం. అయితే ఈ మూడు దళాలూ మూడు భిన్న రకాలైన యుద్ధ విమానాలను ఉపయోగిస్తుండేవి. మొత్తం మూడు దళాలకూ ఉపయోగపడేలా (కొన్ని చిన్న మార్పులతో) ఒకే విమానాన్ని రూపొందించాలన్న ప్రయత్నంలో తయారైనదే ఈ ఎఫ్-35! ‘‘మూడు దళాలకూ ఒకే విమానం’’ అనే కాన్పె్‌ప్టను అనుసరించి మొదట్లో దీనికి ‘‘జాయింట్ స్ట్రయిక్ ఫైటర్’’ అని పేరు పెట్టారు. దీని తయారీ కాంట్రాక్టు కోసం అమెరికాకు చెందిన బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు పోటీ పడగా చివరికి లాక్‌హీడ్ సంస్థ కాంట్రాక్టును దక్కించుకుంది. సింగిల్ ఇంజిన్‌తో నడిచే ఈ విమానం రాడార్లకు చిక్కని స్టెల్త్ టెక్నాలజీతో రూపొందింది. ఇందులో ఎయిర్‌ఫోర్స్ వెర్షన్‌కు ఎఫ్-35ఎ, మెరీన్ వెర్షన్‌కు ఎఫ్-35బి, నేవీ వెర్షన్‌కు ఎఫ్-35సి అని పేరు పెట్టారు. వీటిలో వాయుసేన వెర్షన్‌ను మాత్రమే భారత్ కొనే అవకాశం ఉంది. ఎందుకంటే నేవీ కోసం ఫ్రెంచి రాఫెల్ (ఎం) విమానాల కొనుగోలుకు భారత్ ఇప్పటికే దాదాపు ఒప్పందం కుదుర్చుకుంది. ఎఫ్-35 విమానం వివిధ సెన్సర్ల ద్వారా అందే సమాచారాన్ని కలిపి విశ్లేషించి పైలట్‌కు కచ్చితమైన సమాచారం, సూచనలు ఇవ్వడం.. అలాగే ఇతర విమానాలు, నేల మీద ఉండే రాడార్ల నుంచి సమాచారాన్ని సేకరించడం, వాటికి సమాచారం ఇవ్వడం (డేటా లింక్స్) ద్వారా గొప్ప నెట్‌వర్కింగ్ చేయగలదు. ఇతర ఆయుధ వ్యవస్థలన్నింటినీ శక్తిమంతంగా మార్చగలదు. తనతో నెట్‌వర్క్ అయిన ప్రతి ఆయుధమూ స్వీయ శక్తిసామర్థ్యాలకు మించి శత్రువుపై దాడి చేసేలా ఇది తోడ్పడగలదు.
భారత్ కొంటే మంచిదే!
అమెరికా ఎఫ్-35లను భారత్‌కు అమ్ముతుందా, వారు అమ్మినా భారత్ కొంటుందా అనే ప్రశ్నలు ఎలా ఉన్నా వీటి కొనుగోలు భారత్‌కు మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఎఫ్-35 అనేది అయిదో తరం స్టెల్త్ విమానం. భారత్ అయిదో తరం విమాన టెక్నాలజీల్లో బాగా వెనుకబడి ఉందని, ఇది దేశ భద్రతకు అంత మంచిది కాదని పలువురు రక్షణ నిపుణులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భారత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ కూడా ఈ తరహాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయిదో తరం స్టెల్త్ విమానాల తయారీలో చైనా ముందుకు దూసుకువెళుతోంది. జే 20 అనే స్టెల్త్ విమానాలు ఇప్పటికే చైనా వాయుసేనలో పెద్దసంఖ్యలో సేవలు అందిస్తున్నాయి. జే 31 అనే మరో స్టెల్త్ విమానాన్ని కూడా చైనా అభివృద్ధి చేసింది. ఈ జే 31 విమానాల్ని తాము చైనా నుంచి కొనబోతున్నట్లు పాకిస్థాన్ ఇటీవల ప్రకటించింది. 2028 నుంచి ఈ విమానాలు పాక్‌కు అందనున్నాయి. అయితే భారత్ వద్ద ఒక్క అయిదో తరం స్టెల్త్ విమానం కూడా లేదు. మన వద్ద ఉన్న విమానాలన్నీ మూడో తరం, నాలుగో తరం, లేదా 4.5 జనరేషన్ విమానాలే. ఏవీ స్టెల్త్ విమానాలు కావు. భారత్ వద్ద ఉన్న అత్యాధునిక రాఫెల్ (ఫ్రెంచి) విమానంలో కూడా స్టెల్త్ పరిజ్ఞానం లేదు. స్టెల్త్‌కు ప్రత్యామ్నాయంగా అందులో ‘‘యాక్టివ్ కాన్సిలేషన్’’ అనే పరిజ్ఞానం ఉన్నట్లు చెబుతున్నా దాని పనితీరుపై రక్షణ నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమ్కా (ఏఎంసీఏ) పేరుతో అయిదో తరం స్టెల్త్ విమానం తయారీని భారత్ ప్రారంభించింది. అయితే దీని తయారీకి చాలా కాలం పట్టనుంది. మొదటి విమానం 2036 నాటికి వాయుసేనకు చేరవచ్చని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) అధికారులు చెబుతున్నారు.
అయితే గతానుభవాల్ని బట్టి చూస్తే ఆ గడువు 2040 వరకూ పాకినా పాకవచ్చు. అంటే మరో 15 సంవత్సరాలపాటు చైనా నుంచి, పాకిస్థాన్ నుంచి స్టెల్త్ విమానాల ముప్పును ఎదుర్కొంటూ భారత్ అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి ఎఫ్-35లను భారత్ త్వరగా కొనుగోలు చేయగలిగితే ఆ ముప్పును దీటుగా ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుంది. మన వాయుసేనకు స్టెల్త్ విమానాలను నడపడంలో, నిర్వహించడంలో తగిన అనుభవం వస్తుంది. అలాగే స్టెల్త్ విమానాల అభివృద్ధి విషయంలో మన రక్షణ పరిశోధన సంస్థలకు మరింత అవగాహన కూడా ఏర్పడుతుంది. అయితే తన సొంత స్టెల్త్ విమానం ఆమ్కా అందుబాటులోకి వచ్చేవరకు ఒక స్టాప్ గ్యాప్ ఏర్పాటుగా మాత్రమే భారత్ ఎఫ్-35ల కొనుగోలుకు మొగ్గు చూపవచ్చు. అంటే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఈ విమానాల్ని కొనాల్సి ఉంటుంది. కానీ ఈ విమానాల కొనుగోలు ఖర్చు కంటే వీటిని నిర్వహించడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువ సంఖ్యలో విమానాల్ని కొంటే తలసరి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతుంది. అందువల్ల తాత్కాలిక అవసరాల కోసం భారత్ వీటిని కొనే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి.
హఠాత్తుగా అమెరికా ఆఫర్ ఎందుకొచ్చింది?
ఎఫ్-35 విమానాల్ని భారత్‌కు అమ్మడానికి ఇంతకాలం ఆసక్తి చూపని అమెరికా ఇప్పుడు అకస్మాత్తుగా ఆ ప్రతిపాదన ఎందుకు చేసిందనేది ఆసక్తికరం. ప్రపంచంలో ఏటా అత్యధికంగా ఆయుధాల్ని కొనుగోలు చేసే దేశం భారత్. అయితే ఇటీవల విదేశీ కొనుగోళ్లు తగ్గించి స్వదేశీ విమానాల అభివృద్ధిపై భారత్ దృష్టి సారించింది. కానీ అయిదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ విషయంలో మన దేశం వెనకబడింది. ఆ లోటును పూడ్చుకోవడం కోసం విదేశాల నుంచి వాటి కొనుగోలుపై ప్రభుత్వం దృష్టి పెట్టబోతోందనే వార్తలు ఇటీవల వస్తున్నాయి. తాజాగా బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ప్రదర్శనలో ఎఫ్-35తోపాటు రష్యాకు చెందిన సుఖోయ్ 57 స్టెల్త్ విమానం కూడా పాల్గొంది. గతంలో సుఖోయ్ 57 విమానం అభివృద్ధి ప్రాజెక్టులో భారత్ కూడా రష్యాతో కలిసి భాగస్వామిగా ఉండేది. అయితే ఆ విమానానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌తో పూర్తిగా పంచుకోవడానికి రష్యా ఇష్టపడకపోవడంతో భారత్ ఆ ప్రాజెక్టు నుంచి వైదొలగింది. ప్రస్తుతం వైదొలగినా తర్వాతి దశలో భారత్ తిరిగి అందులో పాలుపంచుకునే అవకాశం ఉన్నట్టు నాడు రక్షణ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ అప్పట్లో చెప్పారు. ఇటీవల ఏరో ఇండియా ప్రదర్శన నేపథ్యంలో భారత్ సుఖోయ్ 57 విమానాలను కొనబోతోందనే వార్తలు బాగా జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ రష్యా వైపు వెళ్లకుండా తమ వైపు ఆకర్షించేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసి ఉండవచ్చనే అభిప్రాయం రక్షణ నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
- రక్షణ ప్రత్యేక ప్రతినిధి, ఆంధ్రజ్యోతి
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.